అచ్చెన్నకు ఆ సెంటిమెంట్ వర్తిస్తుందా...??

Update: 2018-12-21 01:30 GMT

టెక్కలి నియోజకవర్గం.... ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ సుపరిచితమైన పేరు. టెక్కలి అనగానే ముందుగా గుర్తొచ్చేది అచ్చెన్నాయుడు మాత్రమే. గత ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి గెలిచిన అచ్చెన్నాయుడు చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నారు. కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతిపక్షనేత జగన్ పై విరుచుకుపడటంలో అచ్చెన్నాయుడు ముందుంటారు. టెక్కలి నియోజకవర్గంలో ప్రస్తుతం జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ నియోజకవర్గంలో జగన్ పాదయాత్రకు మంచి స్పందన కన్పిస్తుండటం ఆ పార్టీనేతల్లో ఉత్సాహం నింపింది. ఈసారి ఎలాగైనా టెక్కలిలో ఫ్యాన్ పార్టీ జెండాను ఎగురవేసి తెలుగుదేశం పార్టీని గట్టి దెబ్బ తీయాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసిగా ఉన్నారు.

గత ఎన్నికల్లో....

నిజానికి టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఏమీ కాదు. టెక్కలి నియోజకవర్గంలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇప్పటివరకూ టెక్కలి నియోజకవర్గంలో పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు టీడీపీ గెలిచింది. ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన అచ్చెన్నాయుడు వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పై ఎనిమిదివేల ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. ఇది పెద్ద మెజారిటీ కాదన్నది వైఎస్సార్ కాంగ్రెస్ నేతల అభిప్రాయం. దీనికి తోడు అచ్చెన్న రెండు సార్లు వరసగా ఓటమి చెందడం వల్ల కూడా ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారంటున్నారు.

రెండుసార్లు ఓడి....

ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు గతంలో హరిశ్చంద్రాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఆ నియోజకవర్గం రద్దు కావడంతో 2009లో జరిగిన ఉప ఎన్నిక, ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికలో అచ్చెన్నాయుడు ఓటమిపాలయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన రేవతిపతి మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పుడు రేవతి పతి భార్య భారతిని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించడంతో అచ్చెన్నాయుడు ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇలా సాధారణ ఎన్నిక, ఉప ఎన్నికల్లో రెండుసార్లు ఓటమి పాలయిన సానుభూతితో అచ్చెన్నాయుడు 2014 ఎన్నికలలో గెలిచారంటారు.

ఒకసారి గెలిచిన నేత....

ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. సెంటిమెంట్ అనుకోవచ్చేమో. ఒకసారి గెలిచిన వారు మరోసారి గెలిచే ఛాన్స్ లేదు. అదీ కూడా ఈ నియోజకవర్గ చరిత్రలో ఒకరికే దక్కింది. అది 1952, 1955 ఎన్నికల్లో రొక్కం లక్ష్మీనరసింహ దొరకు మాత్రమే ఆ ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత సిట్టింగ్ లు ఎవరూ గెలిచిన దాఖలాల్లేవు. ఇదే నియోజకవర్గం నుంచి 1994లో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీరామారావు టెక్కలి నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత టెక్కలిని వదులుకున్నారు. ఇక మొత్తంగాచూస్తే సెంటిమెంట్ పరంగానూ, అచ్చెన్నాయుడిపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత తమకు కలసి వస్తుందంటున్నారు వైసీపీ నేతలు. ప్రస్తుతం ఈ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా పేరాడ తిలక్ ఉన్నారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉండటంతో ఈసారి ఇక్కడ ఎన్నిక తీవ్ర ఉత్కంఠను రేపుతుందనే భావిస్తున్నారు.

Similar News