కాగల కార్యం గవర్నర్ నెరవేరుస్తారా ?

రాష్ట్ర గవర్నర్ గా ఎనభయ్యేళ్ల పెద్దాయన బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీకి ఉన్నారు. ఆయన ఒడిషాలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఆరెస్సెస్, బీజేపీలకు అంకితం అయిన వారు. [more]

Update: 2020-06-22 13:30 GMT

రాష్ట్ర గవర్నర్ గా ఎనభయ్యేళ్ల పెద్దాయన బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీకి ఉన్నారు. ఆయన ఒడిషాలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఆరెస్సెస్, బీజేపీలకు అంకితం అయిన వారు. అదే సమయంలో రాజ్యాంగం పట్ల కూడా బాగానే అవగాహన ఉంది. ఆయనతో జగన్ సర్కార్ కి ఇప్పటిదాకా ఇబ్బందులు రాలేదు. పైగా రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డను తప్పిస్తూ కొత్తగా తెచ్చిన సంస్కరణలకు కరోనా వేళ పచ్చ జెండా ఊపి మరి ఆర్డినెన్స్ కి ముద్ర వేసిన గవర్నర్ గా ఉన్నారు. ఇది బీజేపీ నేతలకే మింగుడుపడని వ్యవహారంగా కూడా ఉందంటారు. ఇపుడు అలాంటి కాషాయాన్నే మరో మారు ఏపీలోని కాషాయం పార్టీతో పాటు, టీడీపీకి కూడా తాగించాలని వైసీపీ చూస్తోందిట, మరి గవర్నర్ అలా చేస్తారా.

మూడు రాజధానులూ….

జగన్ కి మూడు మీద బాగా మూడ్ ఉంది. ఆయన తలచుకున్నా అది అందకుండా పోతోంది. ఆరు నెలల క్రితం తన మనసులో మాటను అసెంబ్లీలో బయటపెట్టినా కూడా అంతకు ఆరు నెలల ముందు నుంచి జగన్ కి మూడు మీద మా చెడ్డ మనసు ఉందని తెలిసిపోతోంది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధాని పనులను అటకెక్కించేసి మరీ రైతుల్లో కలవరాన్ని రేపారు. సరే మూడు రాజధానుల బిల్లు విషయంలో గతంలోనూ, ఇపుడు కూడా శాసనమండలిలో వైసీపీ సర్కార్ భంగపడింది. గతంలో అయితే సెలెక్ట్ కమిటీకి పంపించాలని మండలి తీర్మానించింది. ఈసారి ఏకంగా ఏ నిర్ణయమూ తీసుకోకుండానే వాయిదా పడింది.

అదే అస్త్రమా….

అయితే రాజ్యాంగ కోవిదులు అంటున్న మాట ఏంటంటే రెండవ సారి కూడా ఏ విషయంలొ చెప్పకుండా మండలి వాయిదా పడింది కాబట్టి ఒక్క నెల రోజులు ఆగి మూడు రాజధానులు బిల్లుని గవర్నర్ కి పంపించి చట్టంగా తీసుకురావచ్చు అని. శాసనమండలిలో ఇప్పటికే రెండు సార్లు బిల్లు వెళ్ళినందువల్ల ఇక ఆ వైపుగా చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. అందువల్ల నెల రోజులు ఆగిన తరువాత మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ హరిచందన్ కి పంపించి ఆమోదముద్ర వేయించుకోవాలని జగన్ సర్కార్ తహతహలాడుతోందని అంటున్నారు. దీని మీద గవర్నర్ ఆమోదముద్ర వేస్తే అది చట్టం అవుతుంది. అపుడు కోర్టులు కూడా ఏమీ అనవని వైసీపీ భావిస్తోందిట.

అలా జరిగేనా…?

అయితే ఇక్కడ కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. శాసనమండలిలో బిల్లు ప్రవేశపెట్టకుండానే సభ వాయిదా పడింది కాబట్టి బిల్లు అక్కడకు రానట్లే లెక్క అని టీడీపీ వాళ్ళు వాదిస్తున్నారు. మరో వైపు సెలెక్ట్ కమిటీకి పంపాలన్న తీర్మానం గతంలో చేసినది లైవ్ లో ఉందని, అందువల్ల మండలి నిర్ణయం తీసుకోలేదని ఎలా చెబుతారు అన్నది మరో పాయింట్. ఇవన్నీ ఎలా ఉన్న మెజారిటీ ఉన్న ప్రభుత్వం కాబట్టి రెండు సార్లు అసెంబ్లీలో పూర్తి బలంతో ఆమోదించుకున్న తీర్మానం కాబట్టి మండలిలో టీడీపీ పెడుతున్న అడ్డంకులు, రాజకీయ కారణాలు ఇవన్నీ గవర్నర్ కి చెప్పి ఒప్పించి బిల్లులు చట్టంగా చేసుకోవాలని జగన్ సర్కార్ అనుకుంటోందిట. మరి అదే జరిగితే దాని పర్యవశానాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.

Tags:    

Similar News