ఉమెన్స్ డే రోజు ఈ మహిళలకు బాబు గిఫ్ట్ ఇదే...

Update: 2017-03-08 07:30 GMT

ఆక్వా పార్క్ వ్యతిరేక ఆందోళనలతో పశ్చిమ గోదావరి జిల్లా రగులుతోంది. తుందుర్రు ఆక్వా పార్క్ ఏర్పాటు వ్యతిరేకంగా సీపీఎం ఆందోళనకు పిలుపునివ్వడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆందోళన అడ్డుకునే క్రమంలో దాదాపు 1500మంది పోలీసులు మోహరించారు. ఆక్వా ఫుడ్ పార్క్ వైపు స్థానికులు వెళ్లకుండా అన్ని మార్గాలను పోలీసులు మూసి వేశారు. ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న సీపీఎం ., వైసీపీ నేతల్ని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. వందలాది మంది మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో గ్రామంలో ఉద్రిక్తంగా మారింది. ఇళ్లలోకి వెళ్లి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో మహిళలు పోలీసులపై తిరగబడ్డారు. మహిళా దినోత్సవాలు చేస్తూ ముఖ్యమంత్రి తమపై దాడులు చేయిస్తున్నారంటూ సీఎం పై తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. మహిళా దినోత్సవం రోజున తమపై అక్రమ కేసులు బనాయించి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లడంపై గ్రామంలోని మహిళలు మండిపడుతున్నారు.

మూడేళ్ల నుంచి పోరాటం...

మరో వైపు తుందుర్రు పరిణామాలపై సమీప గ్రామాలూ ఆందోళన చెందుతున్నాయి. ఆందోళన కారులపై పోలీసులు విరుచుకుపడటంపై ఆక్వా పార్క్ పరిసర గ్రామాల్లో ప్రజలు మండి పడుతున్నారు. మూడేళ్ళ నుంచి తాము వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ వల్ల గ్రామాల్లో వాతావరణం, నీరు కలుషితమవుతుందని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా కలిశారు. పవన్ ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి మద్దతు తెలిపారు. ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీని వేరే ప్రాంతానికి తరలించాలని పవన్ కోరారు. ఆందోళనకారులకు వైసీపీ కూడా మద్దతు తెలిపింది. జగన్ స్వయంగా వెళ్లి బాధిత గ్రామాలను కూడా సందర్శించారు. అయితే ప్రభుత్వ వాదన వేరే విధంగా ఉంది. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ జలాలను గొట్టం ద్వారా సముద్రంలో కలిసేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల నీరుగాని, వాతావరణం గాని కలుషితం కాదని చెబుతున్నారు. గ్రామస్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్కారు చెబుతున్నా....గ్రామస్థులు మాత్రం తమకు ఫ్యాక్టరీ వద్దే వద్దంటున్నారు. మొత్తం మీద 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆందోళనలు జరుగుతుండటం ఆ పార్టీలో కొంత భయం పట్టుకుందనే చెప్పాలి.

Similar News