ఆ దగ్గు మందులు భారత్ లో అమ్మలేదు

ఆ దగ్గు మందులు భారత్ లో అమ్మలేదు

Update: 2022-10-07 01:50 GMT

గాంబియా దేశంలో పిల్లల మరణాలకు భారత్ లో తయారు చేసిన దగ్గు మందులే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడంతో ఆ దగ్గు సిరప్‌ల నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఈ ఉత్పత్తులు కేవలం ఎగుమతుల కోసం మాత్రమే తయారు చేశారని.. భారతదేశంలో విక్రయించడం లేదని తెలిపారు. నాలుగు ఔషధాలకు సంబంధించి.. హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన అదే బ్యాచ్ నమూనాలను ప్రయోగశాలకు పరీక్ష కోసం పంపినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. మెయిడన్ ఫార్మాస్యూటికల్ తయారు చేసిన ప్రొమెథజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్ మాలిన్ బేబీ కాఫ్ సిరప్, మేకాఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ ఈ ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది.

భారత్ లో తయారు చేసిన దగ్గు సిరప్ కారణంగా గాంబియా దేశంలో 66 మంది చిన్నారుల ప్రాణాలు పోయాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ దగ్గు సిరప్ ను భారత్ లోని హర్యానా రాష్ట్రం సోనేపట్ కు చెందిన మెయిడన్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ తయారు చేసినట్టు తేలింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నెలలో భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)ని అప్రమత్తం చేసింది. డీసీజీఐ వెంటనే ఈ విషయాన్ని హర్యానా రాష్ట్ర ఔషధ మండలి దృష్టికి తీసుకు వెళ్ళింది. నాలుగు దగ్గు ముందుల వల్ల తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఏర్పడిందని.. ఇదే 66 మంది చిన్నారుల ప్రాణాలు పోవడానికి కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ దగ్గు మందుల్లో ఎక్కువ స్థాయిలో స్థాయిలో డైఎథిలేన్ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్ ఉండడంతో ప్రాణానికి ఎంతో ప్రమాదకరమని నిపుణులు తేల్చారు. వీటివల్ల కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు, మూత్ర విసర్జన చేయలేకపోవడం, తలనొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. పశ్చిమ ఆఫ్రికా దేశంలో 66 మంది పిల్లల మరణాల కారణంగా భారత దేశ ప్రతిష్టకు దెబ్బతగిలింది. ఆఫ్రికాలోని ఎన్నో దేశాలకు భారత్ ఔషధాలను సరఫరా చేస్తోంది. "ప్రపంచ ఫార్మసీ"గా భారతదేశ ప్రతిష్టకు దెబ్బ తగిలిందని నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News