సినిమా రివ్యూ : జాగ్వార్

Update: 2016-10-06 13:22 GMT

తారాగణం : నిఖిల్ గౌడ, దీప్తి సాతి, జగపతి బాబు, రమ్య క్రిష్ణ, ఆదర్శ్ బాల క్రిష్ణ, సంపత్, ఆదిత్య మీనన్, రావు రమేష్, సుప్రీత్, బ్రహ్మానందం తదితరులు.

సంగీతం : ఎస్.ఎస్. థమన్

ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస

నిర్మాత : అనిత కుమారస్వామి

కథ : విజయేంద్ర ప్రసాద్

దర్శకత్వం : మహాదేవ్

పరిచయ నటులకి పరిమితి మించి ఖర్చు పెట్టి సినిమాలు చెయ్యటం ప్రస్తుతం అలవాటైపోయిన సంస్కృతే. గతంలో బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ పరిచయ చిత్రం అల్లుడు శీను, అక్కినేని వారి నట వారసుడు అఖిల్ అక్కినేని తొలి చిత్రం అఖిల్, ఇప్పుడు కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి వర్యులు దేవే గౌడ మనుమడు నిఖిల్ గౌడ జాగ్వార్ కూడా ఆ కోవకు చెందినదే. కానీ వేరొక చిత్రానికి పొంతన కూడా లేకుండా ఏకంగా 75 కోట్లు ఖర్చు పెట్టారు ఈ హీరో పరిచయానికి. ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ లాంటి రచయిత కథ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేక ఫలితం లోనూ అల్లుడు శీను, అఖిల్ లను అనుసరిస్తుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ : ఎస్.ఎస్.క్రిష్ణ (నిఖిల్ గౌడ) మెడికల్ కాలేజీ స్టూడెంట్. అతను కాలేజీ కి వెళ్లి చదువుకుంటూనే సమాంతరంగా కొందరిని హత్యలు చేస్తూ ఉంటాడు. పైగా తాను చేసే హత్యలను ప్రచార మాంద్యాలలో లైవ్ ప్రదర్శనలు చేస్తూ ఉంటాడు. ఈ జరుగుతున్న హత్యల వెనుక దాగి ఉన్న నిజాలను, కారణాలను అన్వేషించే పనిలో ఉంటాడు ఒక సి.బి.ఐ.ఆఫీసర్(జగపతి బాబు). ఎస్.ఎస్.క్రిష్ణ కు బైట ఈ హత్యలే కాకుండా కాలేజీ లో తనకు సీనియర్ ఐన రవి (ఆదర్శ్ బాల క్రిష్ణ) తో ఎప్పుడు మనస్పర్థలు వుంటూ ఉంటాయి. రవి కి చెల్లి ఐన ప్రియా (దీప్తి సాతి) వెంట పడుతూ అల్లరి పెడుతుంటాడు ఎస్.ఎస్.క్రిష్ణ. ఆ వరుస హత్యల కేసులో సి.బి.ఐ కి ఎస్.ఎస్.క్రిష్ణ పట్టుబడ్డాడా?? ప్రియతో సాగించిన ప్రేమాయణం ఫలించిందా?? చదువుకునే కుర్రాడు హత్యలు చెయ్యటానికి కారణం ఐన బలమైన కారణాలు ఏమిటి?? ఇటు వంటి ప్రశ్నలు అన్ని సమాధానపరచుకోవటానికి జాగ్వార్ చిత్రాన్ని తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ : పరపతి కలిగిన కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు కనుక మొదటి చిత్ర విడుదలకు ముందే అమితంగా ప్రచారం పొంది జనాల్లో నిఖిల్ గౌడ పేరు నానింది. మరి అంతటి ప్రచారం నిర్మాత చేస్తే దానికి తగ్గ అంచనాలు ప్రేక్షకుడు పెంచుకోవటం సహజం. కానీ నిఖిల్ గౌడ్ నటన విషయం లో ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయాడు. నృత్యం, పోరాట సన్నివేశాలు మాత్రం నిఖిల్ గౌడ స్టామినాని ఆవిష్కరించాయి. దీప్తి సాతి ని బాగా నటించలేదు అనే కన్నా నటించే అవకాశం ఆమె పాత్రకు రచయిత, దర్శకుడు కల్పించలేకపోయారని చెప్పటం ఉత్తమం. రమ్య క్రిష్ణ చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రను పోషించినా ఉన్న కాసేపు ప్రేక్షకుల చూపులను ఆకట్టుకున్నారు. జగపతి బాబుని విలన్ పాత్రల్లోనే కాక సి.బి.ఐ ఆఫీసర్ గా కూడా స్టైలిష్ గా చూపించారు మహాదేవ్. బ్రహ్మానందం నటన కానీ, హాస్య సన్నివేశాలు కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. మిగిలిన నటీనటులందరు వారి వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రధానం గా నొక్కి చెప్పాల్సిన పేరు మనోజ్ పరమహంస. ఆయన ఛాయాగ్రహణం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిర్మాతల పెట్టుబడి ఆయన చిత్రీకరణ వల్ల ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్టు కనిపించింది. సంగీతం విషయానికి వస్తే పాటలు ప్రేక్షకులకు విసుగు తెప్పించాయి. పాటలకు ప్రేక్షకుడు బైటకి వెళ్లి రావటం అనే సంస్కృతి మళ్లి మొదలు పెట్టే ఉద్దేశంతో ఆ స్వరాలూ థమన్ నుంచి కోరుకుని ఉండొచ్చు దర్శకుడు మహాదేవ్. తమన్నా కనిపించే ప్రత్యేక గీతం కూడా ఇందుకు మినహాయింపు కాదు. నేపధ్య సంగీతం విషయంలో థమన్ కొంత మేర ప్రేక్షకులను క్షమించాడు. ముందు నుంచి అనుకుంటున్నా విధంగానే రాజీపడని నిర్మాత పనితనం పోరాట సన్నివేశాల్లో కనిపించింది. కథకు సంబంధించి ఎం కావాలో ఇవ్వటంతో పాటు తనయుడే హీరో అవ్వటంతో కథ కోరుకోనివి కూడా సమకూర్చి పెట్టారు నిర్మాత.

కథ విషయానికి వస్తే తెలుగు ప్రేక్షకుడు పాత రోజుల నుంచి అలవాటు పడిపోయిన పాత ప్రతీకార నేపధ్యం ఉన్న సాధ సీదా కథే. విజయేంద్ర ప్రసాద్ అనే పేరు చూసి కథ బలంగా ఉంటుంది అని నమ్మిన సగటు ప్రేక్షకుడికి తీవ్ర నిరాశే ఎదురైయ్యింది. బహుశా ఇటువంటి కథలు కన్నడ ప్రేక్షకులకి కొత్త ఐయి ఉండొచ్చు కానీ మనం ప్రతి ఏడాది పాతిక సార్లు ఐనా చూసేదే. హీరో పాత్ర మొదట్లోనే చదువు తో పాటు హత్యలు కూడా చేస్తుండటంతో ఈ కథ పై మొదటి రీల్ అయ్యేసరికి ఒక అంచనాకి వచ్చేసారు ప్రేక్షకులు.

పేలవమైన కథకి కూడా హంగు ఆర్భాటాలతో కూడిన కథనం తోడైతో ఆ చిత్రం విజయ దిశగా పయనించొచ్చు. కానీ నిర్మాతలను విజయేంద్ర ప్రసాద్ ఎంత మోసం చేసాడో కథనం, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన మహాదేవ్ కూడా అంతే మోసం చేసాడు. పాత కథ కి అంతే పాత కథనం తో నడిపి ప్రేక్షకుల ఓర్పును పరీక్షించాడు మహాదేవ్. ఫస్ట్ హాఫ్ లో మహాదేవ్ స్క్రీన్ప్లే టెక్నిక్స్ కొంచం ఊరట కలిపించినా, ద్వితీయార్ధంలో మాత్రం ప్రేక్షకుడి చూపు తెరపై కన్నా చేతి గడియారం పై ఉండేలా స్క్రీన్ప్లే తీర్చిదిద్దాడు. ఇక దర్శకత్వంలోనూ నూతన పంథా ఏది కనపడదు. రాజ మౌళి దగ్గర శిష్యరికం పొందిన విజ్ఞానం ప్రదర్శించే అవసరం ఇప్పటికి లేదు అనుకున్నాడో ఏమో...

ప్లస్ పాయింట్స్ : నిర్మాణ విలువలు, ఛాయాగ్రహణం, పోరాట సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ : కథ, కథనం, సంగీతం, కూర్పు, దర్శకత్వం

రేటింగ్ : 2/5

Similar News