సప్తగిరి ఎల్ ఎల్ బి మూవీ రివ్యూ

Update: 2017-12-07 11:42 GMT

నటీనటులు: సప్తగిరి, కశీష్ వోరా, ఎంపీ శివప్రసాద్, సాయికుమార్, ఎల్.బి.శ్రీరామ్, షకలక శంకర్, రవి కిరణ్ తదితరులు

సంగీతం: విజయ్ బుల్గానిన్

నిర్మాత: డాక్టర్ రవి కిరణ్

దర్శకత్వం: చరణ్ లక్కాకుల

ఇండస్ట్రీలోకి స్టోరీ రైటర్ గా అడుగుపెట్టి అనతికాలంలోనే కమెడియన్ గా స్థిరపడిన సప్తగిరి... కామెడీ చేశాడంటే.. ఆ సినిమాకు కాసుల పంటే. గతంలో ఇది ప్రూవ్ అయింది కూడా. అలాంటి కామెడీ కింగ్… హీరోగా మారి.. సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సప్తగిరి హీరోగా నటించిన తొలి సినిమాతోనే మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అదే ఊపుతో ఇప్పుడు మరోసారి సప్తగిరి LLB తో ప్రేక్షకులను అలరించడానికి ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . సప్తగిరి LLB సినిమా హిందీలో ఘన విజయం సాధించిన జాలీ LLB కి రీమేక్. సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాను నిర్మించిన డాక్టర్ రవికిరణ్ ఈ చిత్రానికి కూడా నిర్మాత. అయితే సప్తగిరి LLB లో సప్తగిరి డాన్స్ లు స్పెషల్ ఎట్రాక్షన్ గా కనబడుతున్నాయి. సప్తగిరి LLB ట్రైలర్ లో సప్తగిరి డాన్స్ అందరిని ఆకట్టుకుంది. చరణ్ లక్కాకుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సప్తగిరి ఎక్స్ ప్రెస్ లాగ కేవలం మాస్ ఆడియన్స్ నే కాకుండా… ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

పుంగనూరు గ్రామంలో పుట్టిన సప్తగిరి(సప్తగిరి) ఎల్.ఎల్.బి పూర్తి చేసి గ్రామంలో చిన్న చిన్న కేసులు వాదించుకుంటూ లాయర్ వృత్తి చేస్తుంటాడు. అయితే లాయర్ వృత్తిలో అనుభవం కావాలని.... ఇంకా తన మరదలిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ వచ్చి ప్రాక్టీస్ పెట్టాలని నిర్ణయించుకుంటాడు. అలా సిటీకు వచ్చిన సప్తగిరి కోర్టులో రాజ్ పాల్(సాయి కుమార్) అనే లాయర్ ను చూస్తాడు. అతడి వాదనలు విని ఫిదా అయిపోతాడు. ఫేమస్ లాయర్ అయిన రాజ్ పాల్ హిట్ అండ్ రన్ కేసులో రోహిత్ అనే నేరస్తుడిని నిర్ధోషిగా విడుదల చేయిస్తాడు. ఈ కేసును మళ్ళీ ఓపెన్ చేయించి ఆధారాలతో సహా రోహిత్ ను పట్టించాలని నిర్ణయించుకుంటాడు సప్తగిరి. మరి రాజ్ పాల్ అనుభవం ముందు సప్తగిరి గెలిచాడా? న్యాయం జరిగేలా చూశాడా? ఈ క్రమంలో సప్తగిరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు..? అనే విషయాలు సప్తగిరి సినిమాని వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల నటన:

కమెడియన్ గా సినిమాల్లో కడుపుబ్బా నవ్వించే సప్తగిరి ఒక్కసారిగా హీరోగా మారి.. కాస్త సీరియస్ లుక్ తో సినిమా మొత్తం మైంటైన్ చెయ్యడం అనేది కాస్త కష్టమైన విషయమే. కానీ సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమాలో హీరోగా ఎంటర్టైన్మెంట్ తో అలరించాడు. ఇక ఇపుడు సప్తగిరి LLB లో మాత్రం సినిమా మొత్తం సీరియస్ లుక్ తో... గంభీరంగా బాగానే ఆకట్టుకున్నాడు.ఇక డాన్సులు, యాక్షన్ సన్నివేశాల్లో స్టార్ హీరోలకు ధీటుగా నటించాలని అనుకున్నాడు. కానీ అక్కడ ఒక కమెడియన్ ను చూస్తున్నామనే ఫీలింగ్ తప్ప ఒక హీరో ఇవన్నీ చేస్తున్నాడనే భావన ఎంతమాత్రం కలగదు. కానీ హీరోగా మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. లాయర్ గా రాజ్ పాల్ పాత్రలో సాయికుమార్ అధ్బుత నటన కనబరిచాడు. సప్తగిరి, సాయి కుమార్ కాంబినేషన్ లో కొన్ని సీన్లు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. హీరోయిన్ కశీష్ వోరా కేవలం పాటల వరకు పరిమితమైంది. అసలామె పాత్రకి సినిమాలో ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. ఇకపోతే జాలీ LLB లో బోమన్ ఇరానీ చేసిన పాత్రను సప్తగిరి LLB లో సాయికుమార్ అవలీలగా చేసేశాడు. ఎంత పొడువాటి డైలాగునైనా.. అలవోకగా చెప్పేశాడు. అందుకు తగ్గట్టుగా పరచురి బ్రదర్స్ రాసిన మాటలు బాగా ప్లస్ అయ్యాయి. ఇక కమెడియన్స్ ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. నిర్మాత రవికిరణ్ కూడా ఓ పాత్రలో కనబడి ఆకట్టుకున్నాడు. ఇక షకలక శంకర్, ఎల్ బి శ్రీరామ్ వంటి వారు ఉన్నంతలో పర్వాలేదనిపించారు.

దర్శకత్వం:

బాలీవుడ్ లో విజయవంతమైన జాలీ LLB... ని తెలుగులో సప్తగిరి ని హీరోగా పెట్టి రీమేక్ చెయ్యడం దర్శకుడు చరణ్ లక్కాకుల పెద్ద సాహసమే చేసాడని చెప్పాలి. ఎంతో ఇంటెన్స్ వున్న ఈ కథను సప్తగిరిని ఎన్నుకోవడం… దానిని పరెఫెక్ట్ గా సప్తగిరితో క్యారీ చేయించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఓ కేసు చుట్టూ కథను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు. ఆ కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడా మిస్ కాకుండా చూసుకున్నాడు. హీరోను ఎలివేట్ చేసే సన్నివేశాలు, పాటలు, యాక్షన్, డైలాగులు ఓ రేంజ్ లో రాసుకున్నాడు. అయితే హీరోగా సప్తగిరిని కాకుండా మరొకరిని తీసుకుంటే బావుండేదనిపిస్తుంది. సినిమా లో అక్కడక్కడా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. ఒక్క ట్విస్ట్ కూడా ఆసక్తికలిగించేలా ఉండదు. సినిమా మొత్తం రొటీన్ స్క్రీన్ ప్లే తో సాగుతుంది. ఎక్కడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ అనేది కలగదు. ఒక్క క్లైమాక్స్ ఎపిసోడ్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. దర్శకుడు కొంతవరకు కామెడీతో నడిపించి అకస్మాత్తుగా హీరోలో వేరియేషన్ చూపిస్తాడు. హీరో మారడానికి గల కారణాలు అంత బలంగా అనిపించవు.

సాంకేతిక వర్గం పనితీరు:

సంగీత దర్శకుడు విజయ్ బుల్గనిన్ మ్యూజిక్ ఏమంతగా ఆకట్టుకునేలా లేదు. ఒక్క మాంటేజ్ సాంగ్ తప్ప.. సాంగ్స్ లో సత్తాలేదు. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కి మాత్రం ప్రాణం పోశాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నివేశాలను ఎంతో అందంగా చిత్రీకరించడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. గౌతమ్ రాజు ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా వుంది. మొదటి హాఫ్ లో ఇంకాస్త ట్రిమ్మింగ్ చేస్తే బాగుండు. నిర్మాత ఇందులో హీరో బావగా నటించి మెప్పించాడు. నిర్మాణ విలువలు కథానుసారంగా వున్నాయి.

ప్లస్ పాయింట్స్: సప్తగిరి నటన, సాయి కుమార్, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, కొన్ని డైలాగ్స్

మైనస్ పాయింట్స్: దర్శకుడు, సంగీతం, ఎడిటింగ్, ఫస్ట్ హాఫ్, కామెడీ లేకపోవడం, ట్విస్టులు లేకపోవడం

రేటింగ్: 2 .0 /5

Similar News