వాసుకి మూవీ రివ్యూ

Update: 2017-07-28 07:49 GMT

నటీనటులు: మమ్ముట్టి, నయనతార, శైలు అబ్రహం.

సంగీతం గోపిసుందర్

ప్రొడ్యూసర్: వేణుగోపాల్ పి

డైరెక్టర్: ఏకే సాజన్

కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార కి ఆఫర్ నచ్చితే ఏ భాషలో నటించడానికైనా సై అంటుంది. ఆమె కోరినంత ఇచ్చి, కథ నచ్చితే నయనతార భాష భేదం చూడకుండా చిన్న చితక స్టార్స్ తో నటించడానికైనా సిద్ధమే. ఇక నయనతారకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే నయనతార డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించి చాలాకాలమే అయ్యింది. వెంకటేష్ తో 'బాబు బంగారం'లో నటించిన నయన్ మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ 102 వ సినిమాలో చెయ్యడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇతర భాషల్లో నయన్ నటించే సినిమాలను తెలుగులో నయన్ కున్న డిమాండ్ ని బట్టి తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఏ భాషలో నయనతార నటించినా ఆ సినిమాని ఖచ్చితంగా తెలుగులోకి డబ్ చేస్తున్నారు నిర్మాతలు. తాజాగా నయనతార మలయాళంలో మమ్ముట్టితో కలిసి నటించిన చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో 'వాసుకి' పేరుతొ విడుదల చేసారు. మరి అక్కడ మలయాళంలో హిట్ అయిన 'వాసుకి' ఇక్కడ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ: వాసుకి(నయనతార) ఒక కథాకళి డాన్సర్. తనకిష్టమైన కథాకళి డాన్స్ ని పెళ్ళైనప్పటికీ .. వదలకుండా అప్పుడప్పుడు కథాకళి డాన్స్ చేస్తూ ఉంటుంది. వాసుకి తన కూతురు అనన్య, భర్త( మమ్ముట్టి) తో కలిసి ఎంతో సంతోషంగా గడిపేస్తుంది. ఎంతో అన్యోన్యంగా వుండే వాసుకి ఫ్యామిలీ ఒక అపార్టుమెంట్లో నివాసముంటారు. అయితే వాసుకి ఒకసారి వర్షం పడుతున్నప్పుడు టెర్రస్ పైకి ఎక్కి కథాకళి నాట్యం చెయ్యాలని టెర్రస్ మీదకి వెళుతుంది. అయితే అక్కడ అనుకోని సంఘటన జరుగుతుంది. ఆ క్రమములోనే వాసుకి చేతికి ఫ్యాక్చర్ అవుతుంది. టెర్రస్ మీద జరిగిన అనుకోని సంఘటనతో వాసుకి చాలా వింతగా ప్రవర్తిస్తుంటుంది. తమ వీధిలో చిల్లర వ్యాపారం చేసుకునే వాళ్లందరిపై వాసుకి డిసిపి(షీలు అబ్రహం) కి కంప్లైంట్ చేస్తుంటుంది. అసలు టెర్రస్ మీద ఏం జరుగుతుంది? అక్కడ జరిగిన ఘటనకు వాసుకికి సంబంధం ఏమిటి? అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిపై వాసుకి పోలీసులకు యేమని కంప్లైంట్ చేస్తుంది? అసలు వాసుకి వింత ప్రవర్తనకి కారణం ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే వాసుకి చిత్రాన్ని వెండి తెర మీద వీక్షించాలసిందే.

నటీనటుల నటన: నయనతార ఎప్పటిలాగే అదరగొట్టే పెరఫార్మెన్సు తో ఆకట్టుకుంది. వాసుకి పాత్రకి 100 శాతం న్యాయం చేసింది. అద్భుతమైన నటనతో పాటే మంచి బాడీ లాంగ్వేజ్ తో నయనతార కేకపెట్టించింది. అలాగే ఎమోషన్ సీన్స్ లోకూడా నయనతార నటన అదిరిపోయిందనే చెప్పాలి. కేవలం నటనతోనే కాదు మంచి అందంతో నయన్ ఆకట్టుకుంది. కళ్ళతోనే ఎక్సప్రెషన్ పలికిస్తూ అదరహో అనిపించింది. అయితే ఈ సినిమా పూర్తిగా లేడి ఓరియెంటెడ్ చిత్రం కాబట్టి మమ్ముట్టికి నటనలో పెద్దగా స్కోప్ లేదు. ఉన్నంతలో బాగా మెప్పించాడు. ఇక మిగిలిన నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: సమాజంలో మహిళలు ఎదుర్కుంటున్న అఘాయిత్యాలను దర్శకుడు ఏకే సాజన్ కొత్తగా చూపెట్టాలని అనుకున్నాడు. అయితే ఈ చిత్రానికి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించడంతో దర్శకుడు చేసిన ప్రయత్నం విఫలమయ్యిందనే చెప్పాలి. సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని.. దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కానీ సాజన్ అసలు పాయింట్ ని పక్కన పెట్టి ఇతర విషయాల మీద ఎక్కువ ఫోకస్ చెయ్యడం వలన సినిమా మంచి ఫలితం ఇవ్వలేకపోయింది. రొటీన్ కథనే తీసుకున్నా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని మలచడంలో సాజన్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. ఇక మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి వాసుకి చిత్రంలో పాటలకు స్కోప్ లేకపోవడంతో భారమంతా బ్యాగ్రౌండ్ స్కోర్ మీద పడింది. గోపి సుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ ని దంచేసాడనే చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాగా ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే ఎడిటింగ్ మీద ఎక్కువ శ్రద్ద పెట్టలేదనిపిస్తుంది. చాలా లోపాలు కనబడతాయి ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ డ్రాగ్ చేసినట్లు అనిపిస్తాయి.... మరికొన్ని సీన్స్ అస్సలు సింక్ కావు. ఇక స్క్రీన్ ప్లే విషయంలోనూ దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. మరింత ఆసక్తికరంగా కథని నడిపించి ఉంటె సినిమా ఫలితం మాత్రం మరొకలా ఉండేది. ఇక నిర్మాణ విలువలు కాథానుసారంగా వున్నాయి.

ప్లస్ పాయింట్స్: నయనతార, ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్, బ్యాగ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్, స్లో కథనం

రేటింగ్: 2 .0 /5

Similar News