ర‌ంగ‌స్థ‌లం - రివ్యూ-2

Update: 2018-03-30 05:15 GMT

టైటిల్‌: ర‌ంగ‌స్థ‌లం

న‌టీన‌టులు: రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్‌రాజ్ త‌దిత‌రులు

సినిమాటోగ్ర‌ఫీ: ర‌త్న‌వేలు

మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌

ఎడిటింగ్‌: న‌వీన్ నూలి

నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని - య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ - సీవీఎం మోహ‌న్‌

స్క్రీన్ ప్లే - ద‌ర్శ‌క‌త్వం: సుకుమార్‌

రిలీజ్ డేట్‌: 30 మార్చి, 2018

టాలీవుడ్‌లో గ‌త నాలుగైదు నెల‌లుగా చిట్టిబాబు (రామ్‌చ‌ర‌ణ్‌) - రామ‌ల‌క్ష్మి (స‌మంత‌) హ‌డావిడే ఎక్క‌డ చూసినా క‌న‌ప‌డుతోంది. క్రియేటివ్ సినిమాల‌కు పెట్టింది పేరు అయిన సుకుమార్ డైరెక్ష‌న్‌లో కెరీర్‌లో ఎప్పుడూ చేయ‌న‌ట్టుగా రామ్‌చ‌ర‌ణ్ భారీ రిస్క్ చేసిన సినిమాయే రంగ‌స్థ‌లం. చెర్రీ చెవిటివాడిగా... స‌మంత అచ్చ తెలుగు ప‌ల్లెటూరి ఆడ‌ప‌డ‌చుగా 1985 నాటి గ్రామీణ జీవ‌న నేపథ్యంతో పాటు నాడు గ్రామాల్లో ఉన్న ఎన్నిక‌లు, ప‌ట్టింపులు, పంతాలు, స్వ‌చ్చ‌మైన ప్రేమ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమాయే రంగ‌స్థ‌లం. సినిమా రిలీజ్ ముందు నుండే భారీగా హైప్ రావడం... టీజర్స్, సాంగ్స్, ప్రమోషన్స్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేయడంతో ఈ సినిమాపై విపరీతమైన పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. భారీ హంగులతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మించారు. మ‌రి రంగ‌స్థ‌లం థియేట‌ర్ల‌లో ఎంత వ‌ర‌కు ర‌చ్చచేసిందో తెలుగుపోస్ట్‌.కామ్ స‌మీక్ష‌లో ఓ లుక్కేద్దాం.

సింగిల్‌లైన్ స్టోరీ :

గ్రామంలో ప్రెసిడెంట్ అరాచ‌కాల‌ను హీరో ఎదిరించి నిల‌బ‌డ‌డ‌మే రంగ‌స్థ‌లం

స్టోరీ:

1970 - 80లో రంగ‌స్థ‌లం అనే ఊరు. ఆ ఊళ్లో చెల్లుబోయిన చిట్టిబాబు (రామ్‌చ‌ర‌ణ్‌) ఆయిల్ ఇంజ‌న్ న‌డుపుతూ రైతుల పొలాల‌కు నీళ్లు పెడుతూ జీవిస్తుంటాడు. ఆ ఊరి ప్రెసిడెంట్ ఫ‌ణీంద్ర భూప‌తి (జ‌గ‌ప‌తిబాబు) జ‌నాల‌ను భ‌య‌పెడుతూ వారిని అమాయ‌కుల‌ని చేసి ఆడిస్తూ 30 ఏళ్లుగా ప్రెసిడెంట్‌గా ఉంటాడు. ఆయ‌న‌కు ఎదురుగా నామినేష‌న్ వేసే ధైర్యం కూడా ఎవ్వ‌రికి ఉండ‌దు. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు వ‌రుస‌కు మామ కూతురు అయిన రామ‌ల‌క్ష్మి (స‌మంత‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. చిట్టిబాబుకి మంగ‌మ్మ‌త్త (అన‌సూయ‌) అంటే మ‌హా ఇష్టం.

ఇక దుబాయ్ నుంచి వ‌చ్చిన చిట్టిబాబు అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఊళ్లో ఫ‌ణీంద్ర ఆగ‌డాలు, దుర్మార్గాలు స‌హించ‌లేక ఎదురు తిరిగి ప్రెసిడెంట్ ఎల‌క్ష‌న్స్‌లో అత‌డికి ఎదురుగా నామినేష‌న్ వేస్తాడు. వీళ్ల‌కు ఎమ్మెల్యే ప్ర‌కాష్‌రాజ్ అండగా ఉంటాడు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉండ‌గా కుమార్‌బాబు హ‌త్య‌కు గుర‌వుతాడు ? కుమార్‌బాబు చ‌నిపోతూ చెప్పిన షాకింగ్ నిజం ఏంటి ? అస‌లు ఈ హ‌త్య వెన‌క ఉన్న ఊహించ‌ని వ్య‌క్తి ఎవ‌రు ? వారిని చిట్టిబాబు ఏం చేశాడు ? చివ‌ర‌కు రంగ‌స్థ‌లం ప్రెసిడెంట్‌గా ఎవ‌రు ? గెలిచారు ? రామ‌ల‌క్ష్మితో చిట్టిబాబు ప్రేమ ఏమైంది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

క‌థ‌నం, విశ్లేష‌ణ :

సుకుమార్ - రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్ అన‌గానే ముందు నుంచి క్రేజీ సినిమాగానే రంగ‌స్థ‌లం ఉంది. 1985నాటి కథ.. స్వచ్చమైన మనుషుల మ‌ధ్య స్వార్థం ఉన్న వ్య‌క్తులు ఉంటే వారి జీవ‌న విధానాలు ఎలా ఉంటాయి ? వారి ఆధిప‌త్య‌, అహంకార‌, నియంతృత్వ ధోర‌ణికి హీరో ఎలా చెక్ చెప్పాడ‌న్న‌దే సినిమా స్టోరీ. సినిమా మెయిన్ ప్లాట్ మాత్రం చాలా రొటీన్‌. ఫ‌స్టాఫ్ రొటీన్‌గానే ఉన్నా కాస్త ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. గ్రామీణ నేప‌థ్యం, హీరో, హీరోయిన్ల ప్రేమ స‌న్నివేశాలు, క్యారెక్ట‌ర్ల రివీల్‌, వాటి చుట్టూ అల్లుకున్న సీన్లు బాగా డిజైన్ చేశాడు. ఈ త‌రం ప్రేక్ష‌కుడికి ఆ త‌రం ప్రేమ ఎలా ఉంటుందో చ‌ర‌ణ్ - స‌మంత ప్రేమ సీన్లు చూస్తే క‌నెక్ట్ అవుతాయ్‌. ఆ కాలంలో మ‌నుష్యులు, వారి మ‌న‌స్త‌త్వాలు ఎలా ఉంటాయో బాగా చూపించాడు. హీరోను హీరోలా కాకుండా నార్మ‌ల్ మ‌నిషిలా చూపించారు.

క‌థ‌లో ఎవ‌రికి ఎంత క్యారెక్ట‌ర్ కావాలో అంత ఇచ్చాడు. చ‌ర‌ణ్ న‌ట‌న‌లో చాలా ప‌రిప‌క్వ‌త వ‌చ్చింది. ఇంట‌ర్వెల్‌తో కాస్త గ్రాఫ్ పెరిగిన‌ట్లు అనిపిస్తుంది. చరణ్ నటన సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఇక సెకండాఫ్‌లో డ్రామా బాగా ఎక్కువైంది. ఎమోష‌న‌ల్ సీన్లు, ఇత‌ర‌త్రా సీన్లు ఉన్నా అవి ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ అయ్యే విష‌యంలో పూర్తి స‌క్సెస్ కాలేదు. ఎలక్షన్స్ సీన్స్ కాస్త ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ద‌గ్గ‌ర మాత్రం పూర్తిగా త‌డ‌బ‌డ్డాడు. విల‌న్ల క్యారెక్ట‌ర్లు ముగించిన విధానం స‌రిగా లేదు. ఇక క‌థ‌ను చెప్పాల‌నుకున్న క్ర‌మంలో సుకుమార్ ర‌న్ టైం మ‌ర్చిపోయాడు. దీంతో చాలా సీన్లు సాగ‌దీసి సాగ‌దీసి ఉండ‌డంతో ర‌న్ టైం ఏకంగా 179 నిమిషాలు అయ్యింది. దీనికి తోడు సెకండాఫ్‌లో కొన్ని సీన్లు ప‌దే ప‌దే రిపీట్ అయిన‌ట్టు ఉంటాయి. సెకండాఫ్ బాగా ల్యాగ్ అయ్యింది.

న‌టీన‌టుల విశ్లేష‌ణ :

న‌టీన‌టుల విష‌యంలో రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో న‌ట‌నా ప‌రంగా ఈ సినిమాకు అత్య‌ధిక మార్కులు ప‌డ‌తాయ్‌. చెవిటి వాడిగా అత‌డి న‌ట‌న సూప‌ర్‌. ఓ చెవిటి వాడు ఎమోష‌న్‌, యాక్ష‌న్, కోపం ఇలా అన్ని విష‌యాలు ఎలా ప‌లికిస్తాడో ? బాగా చేశాడు చ‌ర‌ణ్‌. రామ్‌చ‌ర‌ణ్‌లో మ‌నం ఎంత చూడ‌గూడ‌దు అనుకున్నా చిరంజీవి క‌నిపిస్తాడు. చ‌ర‌ణ్ చాలా బాగా న‌టించాడు.. కానీ చిరంజీవి క‌నిపించేస్తున్నాడు. స‌మంత ఎంత చూడాల‌నుకున్నా ఎవ్వ‌రూ క‌నిపించ‌డం లేదు. స‌మంత చాలా అద్భుతంగా న‌టించింది. ఇక నుంచి ఇలాంటి క్యారెక్ట‌ర్లు చేయాల‌నుకునే వారికి ఆమె పెద్ద రిఫ‌రెన్స్‌. జ‌గ‌ప‌తిబాబు న‌టన అద్భుతం... అయితే సుకుమార్ అత‌డి క్యారెక్ట‌ర్ ముగింపు విష‌యంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఆ క్యారెక్ట‌ర్‌కు అన్యాయం చేశాడు. అన‌సూయ పర్వాలేద‌నిపించినా క్యారెక్ట‌ర్‌లో పూర్తిగా క‌లిసిపోలేద‌నిపించింది. ఆది త‌న‌కు ఇచ్చిన క్యారెక్ట‌ర్‌కు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. నిన్ను కోరిలో ల‌వ‌ర్‌గా, స‌రైనోడులో విల‌న్‌గా ఇప్పుడు హీరో అన్నగా చేసిన న‌ట‌న అద్భుతం. ఇలాంటి క్యారెక్ట‌ర్ల‌లో అదికి ఆదే సాటి అనిపించాడు. ఇక ఎమ్మెల్యేగా ప్ర‌కాష్‌రాజ్‌, రోహిణి – నరేష్ వారి తల్లిదండ్రులుగా కనిపించారు.

సాంకేతికత :

టెక్నిక‌ల్‌గా ఆర్ట్ వ‌ర్క్ సినిమాకు ప్రాణం పోసింది. ఈ సినిమాకు ఇంత ఉన్నతంగా ఉండ‌డానికి కార‌ణం ఆర్ట్ వ‌ర్కే టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్‌లో సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆర్ ఆర్ విషయంలో మాత్రం ప్రేక్ష‌కుడిని విసిగించేశాడు. చెర్రీ చెవిటి సీన్ల‌తో పాటు ఎన్నిక‌లు, ఇత‌ర‌త్రా గ్రామీణ వాతావ‌ర‌ణం, ప్రేమ నేప‌థ్యంలో వ‌చ్చే సీన్ల‌లో ఆర్ ఆర్ మ‌న‌స్సును అయితే ట‌చ్ చేయ‌లేదు. ఇక ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ అద్భుతం... ఆదిపై ఎటాక్ చేసే ఫైట్‌లో మాత్రం క్లోజ‌ప్ షార్టులు ఎక్కువ‌య్యాయి. ఫైట్లు సినిమాకు త‌గిన‌ట్టుగా రామ్ - ల‌క్ష్మ‌ణ్ డిజైన్ చేశారు. నాటి వాతావ‌ర‌ణం నేప‌థ్యంలోనే ఇవి ఉన్నాయి. న‌వీన్ నూలి ఎడిటింగ్ పెద్ద మైన‌స్‌. మూడు గంట‌లు (179 నిమిషాలు) పాటు ఉన్న సినిమాలో 25 నిమిషాల‌కు పైగానే బోరింగ్ సీన్లు ఉన్నాయి. అస‌లు సినిమా సెకండాఫ్‌లో క‌థ‌కు సంబంధం లేని సీన్లు కూడా వ‌స్తుంటాయి. వీటిని ట్రిమ్ చేయ‌కుండా ఎందుకు వ‌దిలారో అర్థం కాదు. మైత్రీ మూవీస్ వారి నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.

సుకుమార్ ఎలా తీశాడంటే...

సినిమాలో ప్ర‌తి సీన్ చాలా నేచుర‌ల్‌గా తెర‌కెక్కించాడు. ఏదో 1970-80 కాలం నాటి క‌థ అంటే న‌టీన‌టుల‌ను, వాళ్లు వాడే వ‌స్తువుల‌ను కాకుండా సినిమాలో చుట్టూ ఉండే ప‌రిస‌రాలు, ప‌రిస్థితుల‌ను కూడా అదే కాలంలో ఎలా ఉంటాయో చూపించి ప్రేక్ష‌కుడిని మాత్రం ఆ కాలానికి తీసుకు వెళ్లాడు. మ‌నం సినిమా చూస్తుంటే ఆ కాలంలోనే ఉన్న‌ట్టు అనిపిస్తుంది. ఫ‌స్టాఫ్‌లో క‌థ చెప్పే విధానం, క్యారెక్ట‌ర్ల‌ను ప‌రిచ‌యం చేసిన తీరు, క‌థ‌లోకి ప్రేక్ష‌కుడిని తీసుకు వెళ్లిన విధానం చాలా నేర్ప‌రిగా ఉంది. అయితే క్లైమాక్స్‌లో మాత్రం ఈ క‌థ రాసింది 2018 కాలం నాటి సుకుమార్ అని క్లీయ‌ర్‌గా తెలుస్తుంది.

ఆది చ‌నిపోయాక మాత్రం సుకుమార్ గాడి త‌ప్పాడు. ఇక ఇప్పుడున్న డైరెక్ట‌ర్ల‌లో తాను మిగిలిన డైరెక్ట‌ర్ల క‌న్నా చాలా తెలివైన వాడిని అని నిరూపించుకునేందుకు సుకుమార్ ఎప్పుడూ తాప‌త్ర‌య ప‌డుతుంటాడు. ఈ సినిమాలోనూ అదే మ‌రోసారి ఫ్రూవ్ చేశాడు. స‌హ‌జంగా ఉన్న రంగ‌స్థ‌లం ఫ‌స్టాఫ్ వ‌ర‌కు బాగానే బండి లాగినా సెకండాఫ్‌లో మాత్రం చాలా చోట్ల దారి త‌ప్పిన‌ట్టు ఉంది. క్లైమాక్స్‌, క్లైమాక్స్‌కు ముందు వ‌చ్చే సీన్లలో ఫీల్ మిస్ అయ్యింది. సినిమాలో సుక్కు లెక్క‌ల ఓకే అనిపించినా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ లెక్క‌ల మాస్టారు ఫార్ములా ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో ? చూడాలి.

ప్ల‌స్‌లు (+) :

- న‌ట‌నా ప‌రంగా చర‌ణ్‌, స‌మంత‌కు కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా

- ఆర్ట్ వ‌ర్క్‌

- సినిమాటోగ్ర‌పీ

- సుకుమార్ టేకింగ్‌

- ఫ‌స్టాప్‌

 

మైన‌స్‌లు (-):

- రొటీన్ క‌థ‌

- ఎడిటింగ్‌

- సెకండాఫ్‌

- క్లైమాక్స్‌

- విల‌నిజం

ఫైన‌ల్‌గా....

ఇప్ప‌టి ప్రేక్ష‌కుడిని 1980 కాలంలోకి తీసుకెళ్లిన నేచుర‌ల్ రంగ‌స్థ‌లం. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్ ఎలా ఉంటుందో ? మాత్రం అంచ‌నా వేయ‌లేం... చూడాల్సిందే..

తెలుగుపోస్ట్ రేటింగ్‌: 3.0/ 5

Similar News