నాగభరణం రివ్యూ : కథ లోపించిన గ్రాఫిక్స్ మాయ

Update: 2016-10-14 10:35 GMT

నటీనటులు: రమ్య, దిగంత్‌, సాయికుమార్‌, విష్ణువర్థన్‌

సంగీతం: గురుకిరణ్‌

నిర్మాతలు: సాజిద్‌ ఖరేషి, ధవల్‌ గాడ, సొహైల్‌ అన్సారి

దర్శకత్వం: కోడి రామకృష్ణ

'అమ్మోరు, అరుంధతి' సినిమాలు చూసిన వారికి కోడిరామ కృష్ణ గురించి తెలియకుండా ఉండదు. ఆ చిత్రాలు అలా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసాయి. ఇక ఈ సినిమాలలో గ్రాఫిక్స్ ని కోడిరామ కృష్ణ ఏ విధం గా చూపించాడంటే విజువల్ వండర్ అంటారే అలా అందరికి గుర్తుండిపోయే సినిమాలు తీసాడు. ఇక ఆ చిత్రాలలాగే ఇప్పుడు తాజాగా గ్రాఫిక్ మాయాజాలం తో కోడిరామ కృష్ణ డైరెక్షన్ లో కన్నడలో ఆయన చేసిన 'నాగరహవు' అనే ఈ విజువల్ వండర్ చిత్రాన్ని తెలుగులో 'నాగభరణం' అన్న పేరుతో డబ్ చేశారు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రం పూర్తి గ్రాఫిక్స్ వండర్ గా తెరకెక్కించడం... దీనిలో కన్నడ సూపర్‌స్టార్‌ విష్ణువర్థన్‌ని విజువల్‌గా ఒక క్యారెక్టర్‌గా క్రియేట్‌ చేయడం ఈ చిత్రానికి సంబంధించి ఓ వండర్ గా చెప్పుకోవచ్చు. ఇక అరుంధతి సినిమాలాగే ఈ చిత్రం కూడా అటువంటి విజువల్ వండర్ తోనే తెరకెక్కిందని అంటున్నారు. మరి కోడిరామ కృష్ణ పాత చిత్రాలు 'అమ్మోరు, అరుంధతి 'లాగా ఈ 'నాగభరణం' కూడా ప్రేక్షకులను ఎంతవరకు రీచ్ అయ్యిందో.. మరి దేవత కథాశం తో తీసిన చిత్రాలు ఈ మధ్యన పెద్దగా ప్రభావాన్ని చూపలేక చతికలపడుతున్న టైం లో ఇలా గ్రాఫిక్ మాయాజాలం తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మేపించనుందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ: గ్రహణం అంటే అది ఏ విధం గాను మంచిది కాదు... ఇక సూర్య గ్రహణం అంటే ఇంకా బలమున్న అపశకునం అని గట్టిగా నమ్ముతారు ప్రజలు. ఇక సూర్య గ్రహణం పట్టే రోజున దేవతలకు తమ శక్తులన్నీ నశిస్తాయనే భయపడి...వారి శక్తులన్నింటినీ ఒక మహా కలశంలో నిక్షిప్తం చేసి భూలోకంలోనే ఓ చోట భద్రపరుస్తారు. సూర్యగ్రహణానికి ముందు కొన్ని దుష్ట శక్తులు ఆ కలశాన్ని దక్కించుకొని దేవతలను నిర్వీర్యుల్ని చేయాలని ప్రయత్నిస్తుంటారు. అలా దేవతల శక్తులు నశించినప్పుడు ఈ భూప్రపంచాన్ని కొన్ని దుష్ట శక్తులు నాశనం చెయ్యడానికి బయలుదేరతాయి. అయితే వాటికి ఆ అవకాశం ఇవ్వకుండా కాపాడేదే ఓ శక్తి కలశం. ఈ శక్తి కలశం ని శివయ్య (సాయి కుమార్) వంశం కొన్ని వందల సంవత్సరాలుగా కాపాడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా శివయ్య కూతురు నాగమ్మ (రమ్య) శక్తి కలశాన్ని కాపాడే విషయం లో తన ప్రాణాలను పణం గా పెడుతుంది. అయితే అనుకోని ఘటన ల వల్ల ఆమె చనిపోతుంది. ఆ ప్రమాదం లో ఆ శక్తి కలశాన్ని కూడా వదిలేస్తుంది. ఇక తర్వాత మరో జన్మ అంటూ శక్తి కలశాన్ని ఎలాగైనా కాపాడ్డానికి నాగమ్మ, మానస (రమ్య)గా పుట్టి శక్తి కలశం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది. మరి మానస గా వున్న నాగమ్మ ఆ శక్తి కలశాన్ని కాపాడుతుందా? అసలు ఆ కలశం అప్పటి వరకు ఎవరిదగ్గర వుంది? అసలు ఆ కవచానికున్న శక్తులేమిటి? ఎందుకు వాటిని నాశనం చెయ్యడానికి దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి... అనేది మనం వెండి తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

పనితీరు: అసలు ఈ చిత్రం ఒక బలమైన కథ గాని కథనం గాని లేకుండా కేవలం గ్రాఫిక్స్ మీదే ఆధారపడిందని ఈ సినిమా చూసిన వారికి ఇట్టే అర్ధమై పోతుంది. కథ, కథనం బలం గా ఉంటేనే ఈ రోజుల్లో సినిమాలు హిట్ అవుతున్నాయి. ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే గ్రాఫిక్స్‌తో రూపొందే ఈ తరహా చిత్రాలు సహజత్వానికి దూరంగా వుంటాయి. కేవలం ఒక్క గ్రాఫిక్స్ ని నమ్ముకుని ఈ సినిమా డైరెక్షన్ బాధ్యతలు చేపట్టేసాడు కోడిరామకృష్ణ. దైవ శక్తులు వున్న ఓ మహా కలశాన్ని మ్యూజిక్‌ కాంపిటీషన్‌లో ట్రోఫీగా ఇవ్వడం అనేది కొంచెం విడ్డూరం గా అనిపిస్తుంది. అసలు మానస ఈ కలశాన్ని కాపాడే ప్రయత్నం లో కాకుండా అప్పుడప్పుడు గ్రాఫిక్స్‌లో తన శక్తుల్ని చూపిస్తూ ఉంటుంది. ఇక మొదటి హాఫ్ లో అనవసర కామెడీతో కాలక్షేపం చేస్తూ సినిమా సాగుతుంది. సినిమాలో ఎంచుకున్న ప్రధానాంశం మంచిదే అయినా దానిచుట్టూ అల్లిన కథ, కథనం సినిమాకి పెద్ద మైనస్‌ అయింది. క్లైమాక్స్‌లో శివుడు పంపిన దూతగా ఎంట్రీ ఇచ్చిన విష్ణువర్థన్‌ దుష్ట శక్తుల్ని హతమార్చి కలశాన్ని రక్షిస్తాడు. విష్ణువర్థన్‌ క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేసి అతనితో ఫైట్స్‌ చేయించడం, డాన్స్‌ చేయించడం ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది.

ఫస్ట్‌ హాఫ్‌ అంతా సినిమా నిడివిని పెంచే సీన్స్‌తో, పాటలతో, నవ్వు రాని కామెడీ సీన్స్‌తో నింపేసి ఫస్ట్‌ హాఫ్‌ ఎండింగ్‌లో అసలు కథలోకి వెళ్ళిన డైరెక్టర్‌ సెకండాఫ్‌ని సీరియస్‌గా కథపైనే నడిపించినా క్లైమాక్స్‌కి వచ్చే సరికి కేవలం గ్రాఫిక్స్‌, విష్ణువర్థన్‌ ఎంట్రీ మాత్రమే అద్భుతం అనేలా వుంటుంది తప్ప క్లైమాక్స్‌ చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇక రమ్య నాగమ్మగా, మానసగా తగిన న్యాయం చేసిందనే చేప్పాలి. ఇక నాగమ్మ కేరెక్టర్ అయితే 'అరుంధతి' సినిమాలో అనుష్క (అరుంధతి) పాత్రని పోలి ఉంటుంది. నాగచరణ్‌గా దిగంత్‌ పర్వాలేదనిపించాడు. అసలు ఈ సినిమాని 'అరుంధతి' సినిమాని అటు ఇటుగా మర్చి 'నాగభరణం' తీసారా అనిపించేలా చాల చోట్ల కనిపిస్తుంది. హెచ్‌.సి. వేణు ఫోటోగ్రఫీ బాగుంది. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ప్రతి ఫ్రేమ్‌ని అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. గురుకిరణ్‌ పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక అక్కడక్కడా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఇక నిర్మాతలు ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టారని సినిమా చూసిన వారికి అర్ధమవుతుంది. అయితే ఈ చిత్రం మాత్రం క్లాస్ ఆడియన్స్ ని మెప్పించలేదు. బి, సి సెంటర్లో మాత్రం బాగానే ఆడుతుందని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్: గ్రాఫిక్స్, కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్‌ను విజువల్ ఎఫెక్ట్స్, రమ్య నటన

మైనస్ పాయింట్స్: కథ, కథనం, డైరెక్షన్, పాటలు, కామెడీ, ఫస్ట్ హాఫ్, క్లైమాక్స్

రేటింగ్: 1.75/5

Similar News