ఖైదీ నెం.150 రివ్యూ 2

Update: 2017-01-11 14:10 GMT

ఖైదీ నెం.150 రివ్యూ

నటీనటులు : చిరంజీవి, కాజల్ అగర్వాల్, తరుణ్ అరోరా, అలీ, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, ప్రిథ్వి రాజ్ తదితరులు

కథ : ఎ.ఆర్.మురగదాస్

సంభాషణలు : సాయి మాధవ్ బొర్రా, వేమారెడ్డి మరియు పరుచూరి బ్రదర్స్

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

నిర్మాత : రామ్ చరణ్ తేజ్

కథనం, దర్శకత్వం : వి.వి.వినాయక్

ఖైదీ నెం.150 : సరిగ్గా దశాబ్ద కాలం క్రితం విడుదలైన శంకర్ దాదా జిందాబాద్ తరువాత మెగా స్టార్ చిరంజీవి ఫుల్ లెంగ్త్ హీరో గా నటించిన సినిమా కావటం, పైగా ల్యాండ్ మార్క్ సంఖ్య 150 వ చిత్రం కావటంతో తొలి నుంచి ఖైదీ నెం.150 చిత్రం పై మెగా అభిమానులతో పాటు ప్రేక్షక, పరిశ్రమ వర్గాలలోనూ అంచనాలు భారీగానే వున్నాయి. మెగా కాంపౌండ్ నుంచి ఖైదీ నెం.150 చిత్ర ప్రకటన వెలువడకముందే తెలుగు ప్రేక్షకులలో చాలా మంది తమిళ కత్తి ని వీక్షించటంతో చిరంజీవి కం బ్యాక్ చిత్రంగా రీమేక్ ను ఎంచుకోవటం సబబు కాదనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నప్పటికీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన తండ్రి 150 వ చిత్రానికి కత్తి రీమేక్ నే ఎంచుకోవటాన్ని సమర్ధించుకుంటూ వినాయక్ శైలి మాస్ అంశాలు జోడిస్తూ కథకు తెలుగు నేటివిటీ జోడించాం అని ప్రచారం చేసి నిర్మాత చరణ్ పెట్టిన పెట్టుబడిని, మెగా అభిమానులు పెట్టుకున్న ఆశల్ని, ప్రేక్షకులు పెంచుకున్న అంచనాలను ఈ ఖైదీ అందుకున్నాడా లేదా చూద్దాం పదండి.

కథ : ఖైదీగా జైలు శిక్షను అనుభవిస్తున్నకత్తి శ్రీను(చిరంజీవి) ని జైలు సిబ్బంది తప్పించుకున్న ఖైదీని పట్టుకోవటానికి సహాయపడమని ప్రాధేయపడటంతో ఆ ఖైదీని పట్టించటానికి జైలు నుంచి బైటకి వచ్చిన కత్తి శ్రీను జైలు సిబ్బందికి ఆ ఖైదీని పట్టుబట్టించి ఈ క్రమంలో తాను తప్పించుకుంటాడు. ఆలా జైలు సిబ్బందిని తప్పించుకుని కలకత్తా నుంచి హైదరాబాద్ లోని తన సహచరుడు, తోటి దొంగ ఐన మల్లి(అలీ) వద్దకు వస్తాడు. కత్తి శీను కలకత్తా జైలు నుంచి తప్పించుకుని రావటంతో అక్కడ ఉండటం మంచిది కాదని విదేశాలకు వెళ్లిపోవాలంటూ మల్లి సూచించటంతో దొంగ పాస్పోర్ట్ సృష్టించుకుని బ్యాంకాక్ వెళ్లిపోవటానికి ఫ్లైట్ టికెట్స్ తీసుకుని చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్న అనంతరం లక్ష్మి(కాజల్ అగర్వాల్) ని చూసి తన చిన్న నాటి స్నేహితురాలు శుభ లక్ష్మి అని పొరపాటు పడతాడు. ఈ క్రమంలో వారి మధ్య తొలి పరిచయం ఏర్పడుతుంది. లక్ష్మి తన అక్కకి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వచ్చిందని తెలుసుకుని కత్తి శీను తన బోర్డింగ్ పాస్ ను చింపి వేస్తాడు. ఇక విదేశాలకు వెళ్ళకూడదు అని నిశ్చయించుకుని లక్ష్మి తో పరిచయం పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో జిల్లా కలెక్టర్ రోడ్ మీద వెళ్తున్న కత్తి శీను ని తీసుకురమ్మని పోలీస్ ని పంపిస్తాడు. ఆలా కలెక్టర్ తో వెళ్లిన కత్తి శీను, మల్లి లకి అంతకు ముందు రాత్రి వారు రక్షించి ఆసుపత్రిలో చేర్పించిన కొణిదల శివ శంకర ప్రసాద్(చిరంజీవి) గురించిన వివరాల తో పాటు 25 కోట్ల రూపాయలు సంపాదించుకునే డీల్ ఎదురవుతుంది. ఈ క్రమంలో తన వద్దకు వచ్చిన డీల్ శంకర్ ఆశయాలకు విరుద్ధమని కత్తి శ్రీను ఎలా తెలుసుకున్నాడు? కత్తి శీను అనుకుని శంకర్ ని కలకత్తా పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం శంకర్ ని నమ్ముకున్నవారి సమస్యలు ఎవరు తీర్చారు అనేది వెండి తెర పైనే చూడాలి.

పని తీరు: దశాబ్ద కాలం తరువాత ద్విపాత్రాభినయంతో అలరించటానికి వచ్చిన మెగా స్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ లో, డాన్స్ మూవ్మెంట్స్ లో, ఎమోషనల్ సీన్స్ పండించే విధానంలో, డైలాగ్ డెలివరీ లో ఎటువంటి మార్పు కనిపించలేదు. మెగా స్టార్ కనిపించిన ప్రతి ఫ్రేమ్ ని మెగా అభిమానులు తనివి తీరా ఎంజాయ్ చేసేలానే ఆయన కష్టపడి మరీ చాలా ఈజ్ తో నటించారు. రామ్ చరణ్ సరసన కథానాయిక గా నటించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు చిరు సరసన చేస్తుందంటే అందరూ ఆశ్చర్య పోయినప్పటికీ కాజల్ లో మోడరన్ లుక్స్ తో పాటు వయసు మీదపడ్డ ఛాయలు కూడా పుష్కలంగా కనపడుతుండటంతో వీరి మధ్య పెద్ద వయసు వ్యత్యాసం ఉన్నట్టు కనిపించలేదు. అయితే పాపం కాజల్ కి నటించటానికి అవకాశం కూడా దక్కలేదు. కేవలం పాటలకు మాత్రమే పరిమితమయ్యే క్యారెక్టర్ ని అంతకట్టారు దర్శకుడు వినాయక్. కథలోని ప్రతినాయకుడి పాత్రకు అనుగుణంగా తరుణ్ అరోరా చాలా హుందా ఐన కార్పొరేట్ విలన్ స్టైల్ ని ప్రతిబింబిస్తూ చాలా సెటల్డ్ గా నటించాడు. సినిమా లో పూర్తి నిడివి కత్తి శీను పాత్ర వెంటే వుండే అలీ తన హాస్యంతో ఈ మధ్య కాలం లో తాను చేసిన సినిమాలలో కంటే బాగానే నవ్వించగలిగాడు. కథకి అవసరం లేనటువంటి పాత్రలో బ్రహ్మానందంలో నటింపజేసినప్పటికీ కొద్దిగా హాస్యం పండించగలిగాడు వినాయక్. కాకపోతే ఆ సన్నివేశాలు కేవలం ఒక వర్గ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం. ఇక పోసాని కృష్ణ మురళి, పృథ్వి రాజ్ వంటి నటులు కేవలం ఒక సన్నివేశానికి మాత్రమే పరిమితమయ్యారు.

కథ విషయానికి వస్తే తమిళ కత్తి చిత్రానికి మురగదాస్ అందించిన కథ ని ఏ మాత్రం కదపకుండా, చెరపకుండా అలానే తీసుకున్నారు వినాయక్. ఆ క్రెడిట్ ని కూడా మురగదాస్ కే ఇచ్చేశారనుకోండి. మిగిలిన స్క్రిప్ట్ పనులకు ఎంతమంది రచయితలను చరణ్ కూర్చోబెట్టాడో తెలీదు కానీ సంభాషణల రచయితగా సాయి మాధవ్ బొర్రా, వేమారెడ్డి ల పేర్లు, స్క్రీన్ ప్లే కి వినాయక్ పేరు పడగా అదనంగా రచన అని పరుచూరి బ్రదర్స్ పేర్లు వేశారు. మరి వీరి రచన ఏమిటో స్పష్టత లేకపోయినప్పటికీ సంభాషణలన్నీ సన్నివేశాలకి, పాత్రలకి అనుగుణంగా కథని ఎక్కడికక్కడ ముందుకు నెడుతూ సాగాయి. అడపా దడపా పొలిటికల్ పంచ్ ల తరహా లో చిరు తో పలికించిన సంభాషణలు కూడా థియేటర్లలో హోరెత్తిస్తున్నాయి. వినాయక్ సమకూర్చిన కథనంలో మాత్రం లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. అసలు కథలోకి ప్రేక్షకుడిని తీసుకు వెళ్ళేలోపు ఇతర పాత్రలను, ఆ పాత్రలు అసలు కథకి ఎలా కనెక్ట్ అవ్వాల్సొచ్చిందో అనే అంశాలను ఆసక్తి కరంగా తీర్చిదిద్దలేకపోయాడు. కాజల్ అగర్వాల్ పాత్రను ప్రేక్షకులు గుర్తించటం కోసం అవసరం లేకపోయినప్పటికీ ప్రేక్షకులను కథలో నుంచి బైటకి తీసుకు వస్తూ డ్యూయెట్స్ కి సన్నివేశాలు సృష్టించాడు. అయితే కథనంలో నిర్లక్ష్యత తన మేకింగ్ లో ఏ మాత్రం కనపడకుండా జాగ్రత్త పడ్డాడు. చిరు ని అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అలా చూపించటంలో సక్సెస్ అయ్యాడు. బాగా బరువైన అంతర్లీన భావోద్వేగాలు వున్న సన్నివేశాలను సైతం మాస్ సన్నివేశాలకు ధీటుగా రక్తికట్టించారు. నిర్మాత చరణ్ పెట్టిన ప్రతి పైసా కి లెక్క తెర పై కనిపంచేలా చిత్రీకరణ చేశారు ఛాయాగ్రాహకుడు రత్నవేలు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలలో నీరు నీరు, రథాలు పాటలు తప్పితే మిగిలినవి ఆశించిన స్థాయిలో తెర పై అలరించలేకపోయాయి. నేపధ్య సంగీతంలో మాత్రం దేవి తన మార్క్ చూపించాడు. చిత్రం లో వున్న పోరాట సన్నివేశాలలో కాయిన్ ఫైట్ ప్రత్యేకంగా నిలిచింది.

ప్లస్ పాయింట్స్ : చిరంజీవి, కథ, సంభాషణలు, నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్స్ : కథనం లోని లోటుపాట్లు, స్టోరీ టేక్ ఆఫ్, చిరు-కాజల్ ల మధ్య రొమాన్స్

విశ్లేషణ : నో డౌట్. బాస్ ఈజ్ బ్యాక్

Similar News