నన్ను దోచుకుందువటే మూవీ రివ్యూ

Update: 2018-09-21 09:02 GMT

బ్యానర్: సుధీర్ బాబు ప్రొడక్షన్స్

నటీనటులు: సుధీర్ బాబు, నభ నటేశ్, నాజర్, జీవ, వైవా హర్ష, రాజశేఖర్ అనింగి, పృద్వి రాజ్, కమెడియన్ వేణు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: అజనీష్ లోకనాథ్

సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు

ఎడిటింగ్: చోట కె. ప్రసాద్

నిర్మాత: సుధీర్ బాబు

డైరెక్షన్: ఆర్.ఎస్. నాయుడు

మహేష్ బాబు బావగా, కృష్ణ కి అల్లుడిగా... ఘట్టమనేని ఫ్యామిలీ సపోర్ట్ తో భారీ బ్యాగ్రౌండ్ తో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ... తాను చేస్తున్న సినిమాల్తో తన కంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు సుధీర్ బాబు. సాలిడ్ గా సినిమాలు చేసుకుపోతున్న సుధీర్ బాబు ఈ ఏడాది సమ్మోహనం సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన సమ్మోహనం క్లాస్ ఆడియన్స్ ని సమ్మోహన పరిచింది. అదితి రావు తో కలిసి నటించిన సుధీర్ బాబు ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు కానీ.. కలెక్షన్స్ విషయంలో మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. సమ్మోహనం సూపర్ హిట్ కానీ.. కలెక్షన్స్ నిల్. అదే టైములో సుధీర్ బాబు ఓన్ బ్యానర్ ని స్థాపించి నన్ను దోచుకుందువటే సినిమాని హీరోగా తానే నిర్మించాడు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో హిట్ సాంగ్ అయిన నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని.. పాటను తన సినిమాకి టైటిల్ గా పెట్టుకున్నాడు సుధీర్ బాబు. మరి ఆర్ఎస్.నాయుడు దర్శకత్వంలో సుధీర్ బాబు చండశాసనుడైన సాఫ్ట్ వెర్ బాస్ గా ఈ సినిమాలో నటించాడు. ఇక సుధీర్ బాబు కి జోడిగా నభ నటేశ్ హీరోయిన్ గా నటించింది. సుధీర్ బాబు క్లాస్ లుక్స్, సుధీర్ బాబు కోపిష్టి తనం, సుధీర్ బాస్ గా ఎంప్లొయీస్ పాలిట రాక్షసుడిగా నన్ను దోచుకుందువటే ట్రైలర్ లో కనిపించడం, హీరయిన్ నభ నటేశ్ తో రొమాన్స్,.. సినిమా మీద అంచనాలు పెంచాయి. అలాగే సినిమా విడుదలకు ముందు సుధీర్ అండ్ టీం చేప్పట్టిన ప్రమోషన్స్ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. మరి మంచి అంచనాల నడుమ నేడు ప్రపంచవ్యాప్తంగా నన్ను దోచుకుందువటే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సుధీర్ బాబు సమ్మోహనం తర్వాత నన్ను దోచుకుందువటే తో ఎలాంటి హిట్ అందుకున్నాడు? హీరోగానే కాక నిర్మాతగా కూడా సుధీర్ బాబు సక్సెస్ అయ్యాడా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన కార్తీక్ (సుదీర్ బాబు) హాస్టల్లో ఉండి చదువుకుంటూ.... పెద్దయ్యాక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తూ అమెరికా వెళ్లడమే లక్ష్యంగా కష్టపడుతుంటాడు. అయితే అదే టైం లో కార్తీక్ తండ్రి (నాజర్) కార్తీక్ కి పెళ్లి సంబంధాలు వెతుకుతుంటాడు. వాటి నుంచి తప్పించుకోవడానికి కార్తీక్ మేఘన (నభ నటేష్)అనే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ తన గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు. షార్ట్ ఫిల్మ్‌లలో నటించే మేఘన... కార్తీక్ ఒకరినొకరు స్నేహితుగాలుగా తర్వాత ఒకరినొకరు ఇష్టపడతారు. కార్తీక్ తన ప్రేమ విషయం చెప్పాలనుకున్నా మేఘనకు చెప్పలేకపోతాడు. మేఘన తన ప్రేమను వ్యక్తం చేసేలోగా.... కార్తీక్ మేఘనను దూరంగా పెట్టాలని అనుకుంటాడు. కార్తీక్ అసలు మేఘనకు ఎందుకు దూరంగా ఉంచాల్సి వస్తుంది? దాని వెనుకున్న అసలు కారణమేంటి? అసలు కార్తీక్ అమెరికా వెళ్లాలన్న కల నెరవేరుతుందా? చివరికి కార్తీక్, మేఘనాలు ఒక్కటయ్యి పెళ్లి చేసుకున్నారా? అనేది నన్ను దోచుకుందువటే మిగతా కథ.

నటీనటుల నటన:

సమ్మోహనం సినిమాలో సినిమా వాళ్లంటే గిట్టని యువకుడిగా... చివరికి సినిమా హీరోయిన్ నే ప్రేమించడం... అలా ఆ సినిమాలో సుధీర్ బాబు హావభావాలతో అద్భుతమగా నటించాడు. ఇక ఈ సినిమా నన్ను దోచుకుందువటే లో ప్రేమ, పెళ్లి లాంటి విషయాలేవి పట్టకుండా కెరీర్ కోసం కష్టపడే యువకుడి పాత్రలో సుధీర్ బాబు బాగా నటించాడు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్లలో సుధీర్ బాబు యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే ఆఫీస్ లో చండశాసనుడైన బాస్ గా ఆకట్టుకున్నాడు. ఇక లుక్స్ లోను సుధీర్ బాబు బావున్నాడు. ఇక హీరోయిన్ విషయానికొచ్చేసరికి కన్నడ భామ నభా నతేష్ అద్భుతంగా నటించింది. తన పాత్రతో సరికొత్తగా మెప్పించింది. తన లవ్లీ పెర్ఫామెన్స్ తో తెరపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచి కుర్రాళ్ళ మనసుల్ని దోచేసుకుందని చెప్పవచ్చు. మొదటి సినిమా అయినప్పటికీ అనుభవం ఉన్న నటిలా చక్కని అభినయంతో మెప్పించింది. కీలకమైన సన్నివేశాల్లో కూడా ఆమె నటన బాగానే ఆకట్టుకుంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. కార్తీక్ తండ్రి పాత్రలో నాజర్ నటనకూడా ఆకట్టుకునేలా ఉంది. హీరోయిన్ తల్లి పాత్రలో తులసి పరిధి మేరకు నటించింది. ఫస్ట్ హాఫ్ లో సుధీర్ బాబు కి వైవా హర్ష మధ్య వచ్చే కామెడీ సీన్స్ లో వైవా హర్ష బాగా కామెడీ పంచాడు.

విశ్లేషణ:

ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయమైన ఆర్.ఎస్.నాయుడు తొలి ప్రయత్నంతో బాగానే ఆకట్టుకున్నాడు. ఆర్.ఎస్. నాయుడు పెద్దగా ప్రయోగాలు చేయకుండా సేఫ్ జోన్ లో కథను రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నడిపించడానికి ఆధ్యంతం ట్రై చేశాడు. అతను కథను చూపించిన విధానం పర్వాలేదనిపిస్తుంది. కథ లో పట్టులేకపోయినా.... కథనంతో సినిమాని నడిపించిన తీరు బావుంది. అయితే దర్శకుడు ఫస్ట్ హాఫ్ మీద పెట్టిన శ్రద్ద సెకండ్ హాఫ్ మీద పెట్టలేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఆసక్తి సెకండ్ హాఫ్ లో అంతగా కనిపించదు.. ఫస్ట్ హాఫ్ లో సరదా సన్నివేశాలతో సరికొత్తగా అనిపించినా.... సినిమా సెకండ్ హాఫ్ లో మాత్రం అంచనాలను అందుకోలేదు. సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తుంది. కొంచెం ఎమోషనల్ సీన్ లను తెరకెక్కించడంలో దర్శకుడు అక్కడక్కడా తడబడినట్లు అనిపిస్తుంది. మరదలితో పెళ్లి చేస్తామని కార్తీక్‌కు తండ్రి చెప్పాడా.. ఆ మరదలు వేరే అబ్బాయిని ప్రేమించానని చెప్పడంతో కార్తీక్... మేఘన గురించి నాన్నకు చెప్తాడు. అయితే మేఘనను చూసేందుకు నాజర్ హైదరాబాద్ రావడం... తండ్రి మేఘన తో బాగా కలిసిపోవడం.. కార్తీక్‌ కూడా ఆమెను ఇష్టపడటంతో ఫస్టాఫ్ సాఫీగా సాగిపోతుంది. కానీ ఇంటర్వెల్ ముందు నిన్ను కలవడం కుదరదని కార్తీక్ ట్విస్ట్ ఇస్తాడు. అలా ఫస్ట్ హాఫ్.. హీరోహీరోయిన్లు, వైవా హర్ష మధ్య వచ్చే కామెడీ సీన్ సినిమా మొత్తానికే హైలెట్ అనిపించేలా ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో కార్తీక్ ఆఫీస్ సమస్యలు, అమెరికా ప్రయాణం, ప్రీ క్లైమాక్స్ ఇలా అన్ని సాగదీతగా అనిపించి ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి. సమ్మోహనంతో డీసెంట్ హిట్ అందుకున్న సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే తో సగం హిట్టే కొట్టాడు. అంటే ఫస్ట్ హాఫ్ హిట్, సెకండ్ హాఫ్ ఫట్ అన్నమాట.

సాంకేతిక వర్గం పనితీరు:

అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ సినిమాకి మెయిన్ మైనస్. పాటల ప్లేస్ మెంట్ కానీ.. మ్యూజిక్ కానీ... బ్యాగ్రౌండ్ స్కోర్ గాని ఏవి ఆకట్టుకునేలా లేవు. రీరికార్డింగ్‌పై మరింత దృష్టిపెడితే బాగుండేది. ఇక సినిమాటోగ్రఫీ బావుంది. ఆఫీస్ సీన్స్ లో సినిమాటోగ్రఫీ హైలెట్ అనేలా ఉంది. గ్రామీణ నేపథ్యం, అర్బన్ లుక్ ఉన్న సీన్లను కనువిందుగా చిత్రీకరించాడు.ఛోటా కే ప్రసాద్ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. ఎడిటింగ్ కూడా ఓకె ఓకేగా అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్లు లెంగ్త్ అయినప్పటికీ.. కథాపరంగా అవసరం కావడం వల్ల అలా ఉంచేశారా అనే ఫిలీంగ్ కలుగుతుంది. ఇక ఈ సినిమాకి హీరోగానూ, సుధీర్ బాబు నిర్మాతగానూ వ్యవహరించాడు. సుధీర్ బాబు ప్రొడ్యూషన్ లో తెరకెక్కిన ఈ సినిమా లో నిర్మాణ విలువల్లో సుధీర్ బాబు ఎక్కడా రాజి పడలేదు.

ప్లస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉండడం, సుధీర్ బాబు, నభ నటేశ్, కొన్ని సెన్సిబుల్ సీన్స్, సినిమాటోగ్రఫీ, కామెడీ

నెగెటివ్ పాయింట్స్: సెకండ్ హాఫ్, పాటలు, ఎమోషనల్ సీన్స్ తేలిపోవడం, ప్రీ క్లైమాక్స్, నెమ్మదిగా సాగే కథనం

రేటింగ్: 2.75/5

Similar News