మిస్టర్ మజ్ను మూవీ రివ్యూ

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నటీనటులు: అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు, ఇజబెల్లీ లెప్ట్, జబర్దస్త్ ఆది, సుబ్బరాజు, రావు రమేష్, సితార, ప్రియదర్శి, పవిత్ర [more]

Update: 2019-01-25 08:00 GMT

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
నటీనటులు: అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు, ఇజబెల్లీ లెప్ట్, జబర్దస్త్ ఆది, సుబ్బరాజు, రావు రమేష్, సితార, ప్రియదర్శి, పవిత్ర లోకేష్, విద్యుల్లేఖ రామన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్ ఎస్
సినిమాటోగ్రఫి: జార్జ్ సి. విల్లియమ్స్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: భోగవల్లి ప్రసాద్
దర్శకత్వం: వెంకీ అట్లూరి

అక్కినేని వారసుడు అంటే మంచి టాలెంట్ ఉంది.. ఎదో పొడిచేస్తాడు… ఇరగదీసేస్తాడు అని అనుకున్నారు అంతా. కానీ మొదటి సినిమాకే అక్కినేని వారసుడు అఖిల్ కోలుకోలేని దెబ్బతిన్నాడు. ఒక్కసారిగా స్టార్ హీరో రేంజ్ బడ్జెట్ తో ‘అఖిల్’ అనే మాస్ సినిమా చేసేసి హీరోగా నిలబడిపోదామనుకున్నాడు. కానీ ప్రేక్షకులు తెలివి తక్కువొళ్ళు కాదు… హీరోలో టాలెంట్ ని చూస్తారు కానీ.. వారసత్వాన్ని కాదు. అలా అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్’ తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఇక రెండో సినిమా అయినా హిట్ కొడితే ఇండస్ట్రీలో పాతుకుపోవచ్చనుకున్నాడు. అందుకే ‘మనం’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్ తో ‘హలో’ అనే లవ్ స్టోరీ చేసాడు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. డిజాస్టర్ అవ్వలేదు కానీ.. యావరేజ్ అందుకుంది. డాన్స్ ల్లో గ్రెస్, బాడీలో చురుకుదనం అన్నీ ఉన్నప్పటికీ.. అఖిల్ కి ఎక్కడో ఏదో అడ్డం పడుతుంది అనేలా ఆ రెండు సినిమాల ఫలితాలు ఉన్నాయి. ఇక మూడో సినిమాని ఆచితూచి ‘తొలిప్రేమ’తో తోలి హిట్ అందుకున్న వెంకీ అట్లూరి తో మొదలు పెట్టాడు. వరుణ్ – రాశి ఖన్నాలు జంటగా క్యూట్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీని అందంగా తెరకెక్కించిన వెంకీ అట్లూరి.. అఖిల్ తోనూ లవ్ స్టోరీనే చేసాడు. ‘సవ్యసాచి’తో ఫ్లాప్ కొట్టిన బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ అఖిల్ కి జోడిగా నటించిన ఈ చిత్రానికి అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జునకి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన టైటిల్ ‘మజ్ను’ అనే పేరుతో ‘మిస్టర్ మజ్ను’గా సినిమాని తెరకెక్కించారు. మొదటి నుండి భారీ అంచనాలు అయితే లేవు కానీ… మంచి అంచనాలున్న ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సంక్రాతికి నాలుగు సినిమాలు థియేటర్స్ లో సందడి చెయ్యగా… ఈ వారం మాత్రం అఖిల్ సోలోగా ‘మిస్టర్ మజ్ను’తో బరిలోకి దిగాడు. మరి అఖిల్ సోలో ఫైట్ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో సమీక్షలో చూసేద్దాం.

కథ:

విదేశాల్లో ఉండే నిక్కీ(నిధి అగర్వాల్) రాముడి లాంటి భర్త కావాలని కోరుకుంటుంది. అయితే అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది విక్కీ(అఖిల్) క్యారక్టర్. విక్కీ కూడా విదేశాల్లో ఉంటూ… అమ్మాయిలతో రచ్చ రచ్చ చేస్తూంటాడు. విక్కీ ,నిక్కి ఇద్దరూ ఇండియాకు వచ్చి తమ కజిన్ పెళ్లిలో కలుసుకుంటారు. నిక్కితో ప్రేమలో పడిపోతాడు విక్కీ. అయితే రెండు నెలలు డేటింగ్ కు ఆమెను ఒప్పిస్తాడు. అక్కడే చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆమెను మిస్సైన ఫీలింగ్ వచ్చి.. నిక్కీ చదువుతున్న కాలేజిని వెతుక్కుంటూ వెళ్తాడు. మరి నిక్కీ.. విక్కీని అర్థం చేసుకుంటుందా? ఆమెను తిరిగి విక్కీ ఎలా ఒప్పిస్తాడు? చివరికి ఇద్దరూ ఎలా ఒకటి అవుతారనేది మిగతా మిస్టర్ మజ్ను కథ.

నటీనటుల నటన:

అఖిల్ సినిమాలో మాస్ హీరోగా, హలో సినిమాలో క్లాస్ హీరోగా అఖిల్ యావరేజ్ నటన కనబర్చాడు. అయితే ఇప్పుడు మిస్టర్ మజ్నులో మాత్రం అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్, లుక్స్ కాస్ట్ డిఫరెంట్ గా అందంగా కనబడ్డాయి. దర్శకుడు వెంకీ అట్లూరి అఖిల్ లుక్స్ మీద స్పెషల్ గా కాన్సంట్రేట్ చేసాడనిపిస్తుంది. ప్లే బాయ్ అయిన విక్కీ పాత్రలో చక్కని నటనను కనబరిచాడు. ఇక ఎప్పటిలాగే డాన్స్ లలో అఖిల్ తన గ్రెస్ చూపించాడు. ఇక ఫస్టాఫ్ లో వచ్చే టైటిల్ సాంగ్ లో అఖిల్ 8 ప్యాక్ బాడీ కనిపించే సీన్లు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తాయి. ఇంకా అఖిల్ ఫైట్స్‌ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. నటన పరంగా ఈ సినిమాలో అఖిల్ చాలా పరిణితి చెందాడనిపిస్తుంది. అమ్మాయిలతో ప్రేమలో పడడం.. ఒక్క నెలకే బ్రేకప్ చెప్పేస్తూ లవర్ బాయ్ లా అఖిల్ ఆకట్టుకున్నాడు. అమ్మాయిలను ఆకర్షించడానికి అఖిల్ చేసే పనులన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక హీరోయిన్ నిధి హాట్ హాట్ గా గ్లామర్ తో ఆకట్టుకుంది. కానీ నటనలో మాత్రం నిధి అగర్వాల్ మరింతగా రాటుదేలాలి. కొన్ని సీన్స్ లో అంటే అఖిల్ కాంబో సీన్స్ లో మాత్రం నిధి తన నటనతో ఆకట్టుకుంది. ఇక కమెడియన్ గా హైపర్ ఆది పర్వాలేదనిపించాడు. మిగతా పాత్రల్లో కనిపించిన నాగబాబు, రావు రమేష్ మరియు సుబ్బరాజు తదితరులు వారి పాత్రల పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఎస్.ఎస్.థమన్ పాటల విషయంలో తడబడినా… నేపధ్య సంగీత మాత్రం దంచి కొడతాడు. అందుకే థమన్ ని బ్యాగ్రౌండ్ మాస్టర్ అనేది. ఇక మిస్టర్ మజ్ను మ్యూజిక్ పరంగా ఓ అన్నంత గొప్పదిగా లేకపోయినా.. మూడు పాటలు మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. నేపధ్య సంగీతం మాత్రం పర్వాలేదనిపించాడు. ఇక జార్జ్ సి. విల్లియమ్స్ ఫోటోగ్రఫి సినిమాకే హైలెట్, విదేశాల్లో వచ్చే సన్నివేశాలు, ఇండియాలోని సన్నివేశాలను, పాటలను, యాక్షన్ సీన్స్ ని తన కెమెరాతో జార్జ్ విల్లియమ్స్ అద్భుతంగా చూపెట్టాడు. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది. అక్కడక్కడా కత్తెర వేయాల్సిన సీన్స్ ఉన్నాయి. ఇక భోగవల్లి ప్రసాద్ ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాకి ఖర్చు పెట్టాడు. నిర్మాణ విలువలు.. ప్రతి ఫ్రెమ్ లోనూ రిచ్ లుక్ తీసుకొచ్చాయి.

విశ్లేషణ:

తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వెంకీ అట్లూరి.. తొలిప్రేమ సినిమాని అందమైన ప్రేమ కథగా ఆకట్టుకునేలా తీసి ప్రేక్షకులను మెప్పించాడు. టీనేజ్ లవ్, కాలేజ్ లవ్ లతో పాటుగా ఎమోషనల్ టచ్ ఉన్న ప్రేమ కథతో అదుర్స్ అనిపించాడు. కథ రొటీన్ అయినా.. కథనంతోనే తొలిప్రేమ తో హిట్ అందుకున్నాడు వెంకీ అట్లూరి. ఇక రెండో సినిమాని అక్కినేని వారసుడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చేసాడు. మిస్టర్ మజ్ను అనే రొమాంటిక్ టైటిల్ అయితే తీసుకున్నాడు కానీ.. కథ విషయంలో వెంకీ పొరబాటు చేసాడు. కథలో కొత్తదనం లేకపోవడమే కాదు. కథనంలోనూ పట్టు లేదు. దర్శకుడు వెంకీ అట్లూరి హీరో హీరోయిన్ రొమాంటిక్ సీన్స్, అఖిల్ లుక్స్ మీద పెట్టిన శ్రద్ద కధ మీద పెట్టలేదనిపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే అక్కడక్కడా కొన్ని హాస్య సన్నివేశాలు, రొటీన్ ఎమోషనల్ సీన్స్ తప్ప ఫస్టాఫ్ పెద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు. దర్శకుడు వెంకీ ఈ విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. అసలు సినిమా చూసే ప్రేక్షకునికి ఫస్టాఫ్ పూర్తయ్యేవరకు కథలోకి వెళ్లినట్టు కూడా అనిపించదు. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సాగతీతగా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం సినిమాని ఆసక్తికరంగా మల్చలేకపోయాడనిపిస్తుంది. అయితే సినిమా సెకండాఫ్ లో అయినా కథలో కొత్తదనం కనిపిస్తుంది ఆనుకుంటే.. సెకండ్ హాఫ్ స్లో నేరేషన్ ఇబ్బంది కలిగిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో అఖిల్, నిధి అగర్వాల్ మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. కామెడీకి ఎక్కడా ప్రాధాన్యతనిచ్చినట్లు కనబడదు. ప్రేమ కథలోని మెయిన్ ఎమోషన్ బలంగా ఎలివేట్ కాకపోవడం, కథనం స్లోగా సాగడం, లవ్ స్టోరీ పూర్తిగా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ లో సరైన క్లారిటీ లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి. అయితే వెంకీ తీసిన తొలిప్రేమని చూసిన వారు మిస్టర్ మజ్నులో ఇంకా ఏదైనా కొత్తదనం చూస్తామనుకుని థియేటర్స్ వస్తే మాత్రం నిరాశ తప్పదు. వెంకీ అట్లూరి ఈసారి బాగా తడబడినట్లుగా సినిమాలో చాలా చోట్ల కనబడుతుంది. అఖిల్ మాత్రం తన ముందు రెండు సినిమాలకన్నా ఈ సినిమాలో నటనలో పరిణీతి, డాన్స్ లోని గ్రెస్ ని కనబర్చాడు. ఈ సినిమాకి తన వంతు కృషి అఖిల్ చేసాడు కానీ.. వెంకీ అట్లూరి తప్పిదాల వలన అఖిల్ కి ఈ మిస్టర్ మజ్ను తో మళ్లీ యావరేజే పడింది.

ప్లస్ పాయింట్స్: అఖిల్ నటన, డాన్స్, మూడు పాటలు, సినిమాటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు, నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్: కథ, కథనం, సెకండ్ హాఫ్, కామెడీ, దర్శకత్వం

రేటింగ్: 2.5/5

Tags:    

Similar News