C/O కంచరపాలెం మూవీ రివ్యూ

Update: 2018-09-07 08:02 GMT

బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్

నటీనటులు: సుబ్బారావు, రాధ బెస్సీ, కేశవ కర్రీ, నిత్య శ్రీ, కార్తీక్‌ రత్నం, విజయ ప్రవీణ, మోహన్‌ భగత్‌ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: స్వీకర్ అగ‌స్తి

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి,వరుణ్‌ ఛాపేకర్

ప్రొడ్యూసర్: ప్రవీణ పరుచూరి

దర్శకత్వం: వెంకటేష్ మహా

యంగ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకటేశ్ మ‌హా దర్శకత్వంలో బడా నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్‌లో రానా సమర్పకుడిగా విజయ ప్రవీణ నిర్మాణంలో తెరకెక్కిన C/O కంచరపాలెం చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి సమర్పకుడిగా రానా దగ్గుబాటి.. మంచి ప్రమోషన్స్ తో సినిమా మీద అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసాడు. అయితే ఈ సినిమా మీద ఇంత ఆసక్తి కలగడానికి మరో కారణం ఈ ఏడాది న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు తెలుగు నుంచి ఎంపికైన చిత్రం కావడం... అలాగే ఈ చిత్రం మీద సెలబ్రిటీస్ ట్వీట్స్ సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేలా చేశాయి. చిత్ర బృందానికి సినిమాపై ఉన్న నమ్మకంతో హైదరాబాద్‌లో రామానాయుడు స్టూడియోస్ లో ఒక వారం ముందు నుండే ప్రిమియర్ షోల ప్రదర్శించారు. అలాగే వైజాగ్‌‌లో కూడా కంచెర‌పాలెం ప్రీమియర్ షోస్ ప్రదర్శించడం.. సినిమా విడుదలకు ముందు మంచి ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిన్న సినిమాని ప్రేక్షకులు ఏమేర ఆదరిస్తారో అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

వైజాగ్ లోని కంచరపాలెం అనే ఊరిలో నలుగురు విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన ప్రేమజంటల కథే C/O కంచరపాలెం కథ.

1 .తన కన్నా పెద్ద వయసులో ఉన్న రాధ(రాధా బెస్సి)ని హోదాలో సైతం సీనియర్ అయినా ప్రేమిస్తాడు ఓ గవర్నమెంట్ అటెండర్ రాజు(సుబ్బారావు). అదే టైమ్‌లో రాజు ప్రవర్తన నచ్చి అతని ప్రేమలో పడుతుంది రాధ. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం కూడా తీసుకుంటారు.

2. పనీపాటా లేక తిరిగే జోసెఫ్(కార్తీక్ రత్నం) కంచరపాలెంలో అమ్మోరు జిమ్ ఓనర్‌ దగ్గర పనిచేస్తూ.. సెటిల్ మెంట్‌ల పేరుతో గొడవలకు వెళ్తుంటాడు. ఒకొనొక టైం లో బ్రాహ్మణ కులానికి చెందిన భార్గవి(ప్రణీత పట్నాయక్)ను ప్రేమిస్తాడు.

3. గెడ్డం (మోహన్ భగత్), సలీమా(విజయ ప్రవీణ). అనాధ అయిన గెడ్డం కంచరపాలెం వైన్ షాప్‌లో బాయ్‌గా పనిచేస్తుంటాడు. అదే షాప్‌కి ప్రతి రోజు వచ్చి మందు కొంటుంది సలీమా అనే వేశ్య. ఆమె మొహం చూడకుండానే ఆమె కళ్లతోనే ప్రేమలో పడతాడు గెడ్డం. అలాగే సలీమా కూడా గెడ్డం ప్రేమలో పడుతుంది.

4. సుందరం (కేశవ కర్రి), సునీత (నిత్య శ్రీ). వీళ్లది చిన్ననాటి ప్రేమకథ. ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకుంటూ ఉంటారు. అలా వారు ప్రేమలో పడతారు.సామాజికంగా చాలా క్లిష్టంగా అనిపించే ఈ నాలుగు జంటల ప్రేమాయణాలు ఎలాంటి మలుపులు తిరిగాయి, ఎక్కడికి చేరుకున్నాడు అనేదే కేరాఫ్ కంచరపాలెం కథ.

నటీనటుల నటన:

ఈ సినిమాలో నటించిన నటీనటులెవ్వరూ తెలుగు ప్రేక్షకులకు అస్సలు ముఖ పరిచయం లేని ముఖాలు కావడం.. సినిమాలో నటించిన నటులంతా తమ పాత్రల్లో జీవించడం.... అసలు ఈ సినిమాలో నటించిన వారంతా కంచరపాలెం ఊరి వాల్లే కావడంతో.. సినిమాలో సహజత్వం కొట్టొచ్చినట్టుగా కనబడింది. ఎవరికి వారే తమ పాత్రల్లో చెలరేగిపోయి నటించారు. ఇక వెండితెరకు కొత్తయిన... ఎవరూ కెమెరా ముందు ఆ బెరుకు చూపించలేదు. అందుకే సినిమాలో వారి పాత్రలు చాలా సహజంగా కనబడ్డాయి. రాజు పాత్రలో సుబ్బారావు చెలరేగిపోయి నటించాడు. ముస్లిం వేశ్య పాత్ర చేసిన నిర్మాతల్లో ఒకరైన ప్రవీణ పరుచూరి పాత్ర కూడా సహజంగా నటించి మెప్పిస్తుంది. కేశవ కర్రి కూడా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. రాధా బెస్సి చేసిన పాత్ర ఆధునిక మహిళ ఆలోచనలకు ప్రతిరూపంగా కనిపిస్తుంది. వివాహం పట్ల సమాజ ఆలోచనా ధోరణిలో రావాల్సిన మార్పు గురించి దర్శకుడు ఈమె ద్వారా అద్భుతంగా ఆవిష్కరించాడు. అమ్మోరు పాత్రలో ఉమా మహేష్ రావు ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోతాడు. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అన్నట్టుగా లేకుండా అంతా తమ తమ పాత్రలకు 100 పెర్సెంట్ న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు:

యువ సంగీత దర్శకుడు స్వీకర్ అగ‌స్తి అద్భుతమైన మ్యూజిక్‌తో సినిమా స్థాయిని పెంచడమే కాదు అద్భుతంగా ఆకట్టుకున్నాడు. సంగీతం అంటే ఏదో నాలుగైదు డ్యుయెట్స్, ఓ ఇంట్రో, ఓ ఐటమ్ సాంగ్ అంటూ సినిమాని... కచ్చిబిచ్చి చేయకుండా... ఈ సినిమాలో వచ్చే పాట కథలో లీనమై ఉంటుంది. ఇక సినిమాకి నేపధ్య సంగీతం కూడా ప్రాణం పోసింది. ఫీల్ కి తగ్గ.. సన్నివేశానికి తగ్గ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. ఆదిత్య జవ్వాడి మరియు వరుణ్‌ ఛాపేకర్ అందించిన సినిమాటోగ్రఫీ కంచెరపాలెం సినిమాకే హైలైట్. ప్రతి ప్రేమ్‌ను ఎంతో అందంగా చూపెట్టాడు. విదేశీ లొకేషన్ల కోసం వెంపర్లాడకుండా సినిమా మొత్తంలో 80 శాతం కంచరపాలెం‌ ఊరిలోనే అందమైన లొకేషన్లు వెతికిపట్టి మరి అంతే అందంగా చూపించారు. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే... రవితేజ గిరజాల ఎడిటింగ్ చాలా షార్ప్ గా పని చేశారు. ఎడిటింగ్ వర్క్ లో బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాకి ఓ అన్నంత బడ్జెట్ పెట్టకపోయినా.. సినిమాకి కావాల్సిన బడ్జెట్ తో నిర్మాతలు కూడా ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

చందమామ కథలు, మనమంతా సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా... ఆ దర్శకులకు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ఆ రెండు సినిమాల్లోనూ విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు అనేది మనసుకు, కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇప్పుడు కూడా C/O కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా కూడా ఆ రెండు సినిమాల వలే ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇలాంటి కథలు కాగితం మీద కథలుగా చాలా బాగుంటాయి. కానీ వెండి తెరమీదకు తీసుకువచ్చి సినిమాగా చేసి మెప్పించాలంటే మాత్రం చాలా గట్స్ కావాలి. కానీ వెంకటేష్ మహా ఈ కథను సినిమాగా మలిచి ప్రేక్షకుల మనసుకు దగ్గరగా వచ్చేసాడు. దర్శకుడు రాసుకున్న పాత్రల్లో.. హీరో తెలియదు.. హీరోయిన్ తెలియదు.. పవర్ క్యాస్టింగ్ లేదు.. కమర్షియల్ హంగులు లేవు.. ఐటమ్ సాంగ్స్ ఆర్భాటాలు అంతకంటే లేవు. కానీ సినిమా మొత్తం కంచరపాలెం అనే ఊరు మాత్రమే కనిపిస్తుంది. అందులో నాలుగు నిజ జీవితాలు ప్రతిబింబిస్తాయి. రాజు ప్రేమ‌క‌థ‌తో పాటు మ‌రో మూడు ప్రేమ‌క‌థ‌ల‌ను కూడా ఏ మాత్రం ఆస‌క్తి త‌గ్గ‌కుండా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. ఇక ఇంట‌ర్వెల్ త‌ర్వాత జోరు మ‌రింత పెరిగింది. ప్ర‌తీ ప్రేమ‌క‌థ‌లోనూ ఓ సామాజిక కోణాన్ని చూపించాడు ద‌ర్శ‌కుడు. చిన్న‌పిల్ల‌ల‌కు దేవుడు అడ్డు ప‌డిన‌ట్లు.. పాతికేళ్ల ప్రేమ‌కు కులం.. 30 ఏళ్ల ప్రేమ‌కు మతం.. ఇలా ప్ర‌తీ ఒక్కో ప్రేమ‌క‌థ‌కు ఒక్కో అడ్డంకి పెట్టాడు ద‌ర్శ‌కుడు. స‌మాజంలో జ‌రుగుతున్న ప్ర‌తీ ఇష్యూను కూడా త‌న సినిమాతో చూపించాడు మ‌హా. ముఖ్యంగా రామ్మూర్తి అనే పాత్ర‌తో దేవుడు గొప్ప‌త‌నం చూపిస్తూనే.. అత‌డి కొడుకుతో ఆ న‌మ్మ‌కం ఎంత గుడ్డిగా ఉంటుందో చూపించాడు. ఇక రాజు పాత్ర‌తో న‌మ్మ‌కాన్ని.. రాధా పాత్ర‌తో మ‌నోధైర్యాన్ని చూపించాడు. స‌లీమా పాత్ర‌లో వ్య‌భిచారం చూపిస్తూనే స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ను కూడా ఆవిష్క‌రించాడు. దర్శకుడిగా తొలి చిత్రంతోనే తెలుగు సినిమా స్థాయిని ఒక మెట్టు ఎక్కించే ప్రయోగాత్మక చిత్రం చేసి అందరిని మెప్పించాడు. దర్శకుడు ఒక్కో పాత్రను పరిచయం చేసేందుకు కాస్త టైం తీసుకున్నా.. ఆ పాత్రలను దగ్గరుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా చూస్తున్నంత సేపు నటిస్తున్నారా.. లేక కంచరపాలెం ఊరిని లైవ్‌లో చూపిస్తున్నారా... అన్నంతగా పాత్రల్లో ఒదిగిపోయారు. కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్, రొమాన్స్ ఏది ఎంత ఉండాలో అంతే కొలతల ప్రకారం రాసుకుని మరీ తీసిన తీరు హృదయాలను కదిలిస్తుంది. అందరూ కొత్తవాళ్లే కావడంతో అక్కడడక్కడా నాటకీయత ఉన్నట్టు అనిపించినా.. కంచరపాలెం యాసలో అవి కొట్టుకుపోతాయి. మేకప్ లేకుండా సహజసిద్ధమైన క్యాస్ట్యూమ్స్‌ తో నటీనటులంతా పాత్రలకు జీవం పోశారు. ఇక కొత్తదనం అనే మాటకు సరైన నిర్వచనం ఇస్తూ తీసిన చిన్న సినిమాకు సురేష్ బాబు, రానా లాంటి సెలబ్రిటీస్ అండగా నిలవడం ఆహ్వానించదగ్గ పరిణామం.

ప్లస్ పాయింట్స్: నటీనటుల నటన, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, కథ, కథనం, దర్శకత్వం, కొన్ని కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్: కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, అందరు కొత్త మొహాలే కావడం

రేటింగ్: 3.0/5

Similar News