చెక్ మూవీ రివ్యూ

చెక్ మూవీ రివ్యూ బ్యానేర్: భవ్య క్రియేషన్స్నటీనటులు: నితిన్, ప్రియా ప్రకాష్ వారియర్, రకుల్ ప్రీత్, మురళి శర్మ, సంపత్, పోసాని కృష్ణ మురళి, హర్షవర్ధన్ తదితరులుమ్యూజిక్ డైరెక్టర్: [more]

Update: 2021-02-26 13:32 GMT

చెక్ మూవీ రివ్యూ 
బ్యానేర్: భవ్య క్రియేషన్స్
నటీనటులు: నితిన్, ప్రియా ప్రకాష్ వారియర్, రకుల్ ప్రీత్, మురళి శర్మ, సంపత్, పోసాని కృష్ణ మురళి, హర్షవర్ధన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: కళ్యాణి మాలిక్ 
సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవన్ 
ఎడిటర్: అనల్ అనిరుద్ధన్ 
నిర్మాతలు: ఆనంద్ ప్రసాద్ 
దర్శకత్వం: చంద్ర శేఖర్ యేలేటి
ఎక్కువగా లవర్ బాయ్ పాత్రలతో హిట్ కొట్టిన నితిన్ గత ఏడాది ఇదే టైం కి ఇదే నెలలో భీష్మ లాంటి భారీ హిట్ అందుకున్నాడు. కరోనా క్రైసిస్ లేకపోతె భీష్మ బ్రహ్మాండమైన కలెక్షన్స్  తో బ్లాక్ బస్టర్ అయ్యేది. భీష్మ తర్వాత కూడా రంగ్ దే అంటూ ప్రేమ కథనే ఎంచుకున్న నితిన్ మధ్యలో చంద్ర శేఖర్ ఏలేటి తో చెక్ చెప్పాడు. చంద్ర శేఖర్ ఏలేటి మేకింగ్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. మనమంతా లాంటి అద్భుతమైన సినిమా చేసిన చంద్ర శేఖర్ యేలేటి – నితిన్ కాంబోలో చెస్ నేపథ్యంలో తెరకెక్కిన చెక్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ మొత్తం సీరియస్ నెస్ గా కనబడుతున్న మధ్యలో ప్రియా ప్రకాష్ వారియర్ గ్లామర్, రకుల్ లాయర్ కోటు అన్ని సినిమాపై అంచనాలు పెంచాయి. మరి భీష్మ హిట్ తో ఉత్సాహంగా ఉన్న నితిన్ అదే సక్సెస్ కొనసాగించాడో లేదో చెక్ సమీక్షలో చూద్దాం.
కథ:
ఆదిత్య(నితిన్) ఉరి శిక్ష పడిన ఖైదీ. ఉగ్రవాదిగా ముద్రపడిన ఆదిత్య తో పాటు మరికొంత మందికి ఈ కేసులో ఉరి శిక్ష వేస్తుంది కోర్టు. అయితే విపరీతమైన తెలివితేటలున్న ఆదిత్య తనకు ఈ నేరం చేయలేదంటూ కోర్టులో పిటిషన్ వేస్తాడు. ఇలాంటి కేసులు వాదించడం వలన మంచి పేరు వస్తుంది అని తండ్రి చెప్పడంతో మానస(రకుల్ ప్రీత్) అనే న్యాయవాది ఆదిత్య కేసుని వాదిస్తుంది. ఆదిత్య అటు కోర్టు కేసు తో పాటుగా ఆ జైలులో తన సహచర ఖైదీగా చెస్ ఆటలో ప్రావీణ్యం కలిగిన శ్రీమన్నారాయణ (సాయి చంద్) దగ్గర చెస్ నేర్చుకుంటాడు. మరోపక్క ఆదిత్య కోర్టులో ఓడిపోయి.. మరణశిక్ష కి సిద్దమవ్వాల్సి వస్తుంది. అసలు ఆదిత్య చేసిన నేరం ఏంటి? రాష్ట్రపతి నుండి కూడా క్షమాబిక్ష ఎందుకు దొరకదు? అసలు ఆదిత్యకి యాత్ర(ప్రియా ప్రకాష్) కి ఉన్న సంబంధం ఏమిటి?  అలాగే మానస కథని ఎలాంటి మలుపులు తిప్పింది?  ఆదిత్య కి చెస్ ఏ విధంగా సహాయపడింది? అసలు ఆదిత్య ఉరి శిక్ష నుండి తప్పించుకున్నాడా? అనేది మిగతా చెక్ కథ.  
పెరఫార్మెన్సు:
నితిన్ ఆదిత్య గా వన్ మ్యాన్ షో చేసాడు. ఉరి శిక్ష పడిన ఖైదీగా నేచురల్ గా అద్భుతంగా నటించాడు. ఎమోషనల్ గాను నితిన్ కేరెక్టర్ ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతుంది. హీరోయిన్స్ లో రకుల్ లాయర్ పాత్రలో సెట్ అయినా.. అంతగా ప్రాధాన్యత లేని పాత్ర రకుల్ ది. బలహీనమైన లాయర్ పాత్రలో తేలిపోయింది. యాత్ర పాత్రలో ప్రియా ప్రకాష్ కథను మలుతిప్పే చిన్న పాత్ర. నితిన్ తో కలిసి ఓ సాంగ్ లో గ్లామర్ గా ఆకట్టుకుంది. సాయి చంద్, పోసాని, సంపత్, మురళి శర్మ ఇలా ఎవరి పాత్రకి వారు న్యాయం చేసారు.  
విశ్లేషణ:
ఐతే లాంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు దర్శకుడిగా వచ్చిన చంద్ర శేఖర్ యేలేటి.. తర్వాత ఛార్మి తో అనుకోకుండా ఒక రోజు తర్వాత మనమంతా లాంటి చిత్రాలతో సత్తా చాటారు చంద్ర శేఖర్ యేలేటి. ఆయన చిత్రాలు కమర్షియల్ హిట్స్ అనిపించుకోకపోయినా.. ఆ చిత్రాలకు ఓ స్పెషల్ కేటగిరి ఆడియన్స్ ఉంటారు. ఇక మాస్ చిత్రాల కన్నా క్లాస్ గా లవర్ బాయ్ గానే ఎక్కువగా హిట్ అందుకున్న నితిన్ – చంద్ర శేఖర్ యేలేటి కాంబోలో చెక్ సినిమా రావడం ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించింది. సినిమా మొదలు కావడమే జైలు, చెస్ అంటూ ప్రేక్షకుడిని డైరెక్ట్ గా కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ కాస్త ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది. ఆదిత్య చెయ్యని నేరానికి ఉరి శిక్ష పడిన ఖైదీగా పరిస్థితులన్నీ మారిపోయి అన్ని దారులూ మూసుకుపోయినట్లు చూపించినా.. దానిలో చెస్ ఆటని ఇన్వాల్వ్ చెయ్యడంతో ప్రేక్షకులు కథలో ఇన్వాల్వ్ అవుతారు. ఆదిత్య కి చెస్ మీద ఇంట్రెస్ట్ కలగడమే కాదు ఆటలో నైపుణ్యం సాధించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చెస్ గురించి తెలియని వారికీ చెస్ ఆట గురించి మాటలతో పరిచయం చేస్తూ కథని ముందుకు నడిపించాడు దర్శకుడు. ముఖ్యంగా ఆదిత్యని చీకటి గదిలో వేస్తే, కిటికీ గళ్ల ప్రతిబింబాన్నే చెస్ బోర్డుగా ఊహించుకుని అతను ఆటలో నేర్పు సాధించే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాకపోతే అసలు చెస్ గురించి తెలియని ఓ నేరస్తుడు ఆటలో పట్టు సాధిస్తూ గ్రాండ్ మాస్టర్స్ నే ఓడించడం అనేది అంత లాజికల్ గా అనిపించదు. అలాగే ఉరిశిక్ష పడిన ఖైదీ క్షమా భిక్షతో అయినా బయటికి వస్తే బావుంటుంది అనుకున్న ప్రేక్షకులకి.. ఆ సన్నివేశాలు అంతగా  ఎమోషనల్ గా అనిపించలేదు.హీరో ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ తేలిపోయినా..  క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చెస్ ఆట మీదున్న అవగాహన స్టోరీకి కనెక్ట్ చేద్దామనుకుని విఫలమయ్యాడు దర్శకుడు. యేలేటి సినిమాలంటే బిగి తప్పని స్క్రీన్ ప్లేని ఆశిస్తాం. కానీ ఆ స్క్రీన్ ప్లే చెక్ లో మిస్ అయ్యింది.  
సాంకేతికంగా: ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ నేపధ్య సంగీతం అద్భుతం అనే చెప్పాలి. ప్రతి సన్నివేశాన్నీ నేపధ్య సంగీతంతో ఎలివేట్ చేయడానికి అతను ప్రయత్నించాడు. మూవీ లో ఉన్న ఒకే ఒక్క పాట పర్వాలేదనిపిస్తుంది. రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. భవ్య వారి నిర్మాణ విలువలు మాములుగా ఉన్నాయి.
రేటింగ్: 2.25 /5

Tags:    

Similar News