ఛల్ మోహన్ రంగ మూవీ రివ్యూ

Update: 2018-04-05 09:08 GMT

బ్యానర్: పవన్ క్రియేటివ్ వర్క్స్

నటీనటులు: నితిన్, మేఘా ఆకాష్, సీనియర్ నరేష్, ప్రగతి, మధునందన్, రావు రమేష్, సత్య, ప్రభాస్ శ్రీను

సంగీతం: థమన్. ఎస్

కథ: త్రివిక్రమ్ శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ: నటరాజన్ సుబ్రమణియమ్

ప్రొడ్యూసర్స్: పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృష్ణ చైతన్య

'ఇష్క్, గుండెజారి గల్లంతైంది' సినిమాలతో నితిన్ ఫుల్ ఫామ్ లోకి రావడమే కాదు మంచి మార్కెట్ ని సెట్ చేసుకున్నాడు. మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్ ని మలుచుకుంటున్నాడు. మధ్యలో చిన్న మిస్టేక్స్ చేసినా మళ్ళీ ఫామ్ లోకొచ్చేస్తున్నాడు నితిన్. 'అ... ఆ' సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టిన నితిన్ హను రాఘవపూడి డైరెక్షన్ లో చేసిన 'లై' సినిమాతో ఘోరంగానే దెబ్బతిన్నాడు. ఆ సినిమాలో కలిసి నటించిన మేఘ ఆకాష్ తో కలిసి కృష్ణ చైతన్య అనే కొత్త దర్శకుడితో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ల నిర్మాణంలో 'ఛల్ మోహన్ రంగా' అనే ప్రేమ కథా చిత్రంలో నటించాడు నితిన్. 'అ..... ఆ' సినిమాతో హిట్ అందించిన త్రివిక్రమ్ ఈ సినిమాకి కథ అందించడంతో పాటు నిర్మాణంలో భాగస్వామ్యుడిగా ఉండడమే కాదు... నితిన్ కి దేవుడు వంటి వాడైనా పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పవన్ క్రియేటివ్ వర్క్స్ లో ఈ సినిమాని సమర్పించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందులోను నితిన్ సెంటిమెంట్ కూడా ఈ సినిమా విజయానికి దోహదపడుతుంది అనే ఆసక్తి కూడా అందరిలో కలిగింది. నితిన్ సినిమాల ఈవెంట్స్ కి పవన్ కళ్యాణ్ అతిధిగా వస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని నితిన్ నమ్మడం.. నితిన్ నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు నిలబెట్టి నితిన్ కి విషెస్ చెప్పడం వంటి విషయాలతో 'ఛల్ మోహన్ రంగ' సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే 'ఛల్ మోహన రంగ' సినిమా ట్రైలర్ లో మంచి కామెడీ పంచ్ లతో పాటు, మేఘ ఆకాష్ - నితిన్ ల కెమిస్ట్రీ కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచడానికి కారణమయ్యాయి. సక్సెస్ ఫుల్ మాటల రచయిత, డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ ఈ సినిమా కి అందించిన కథ ఎంత ఆసక్తిగా ఉంటుందో అని ప్రేక్షకులు ఈ సినిమా విడుదలకు ఎదురు చూసేలా చేసింది. మరి నితిన్ సెంటిమెంట్, నితిన్ గురువు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కత్తిలాంటి డైలాగ్స్. అలాగే త్రివిక్రమ్ ఆశీస్సులతో 'ఛల్ మోహన్ రంగ' సినిమా ఎలాంటి విజయం సాధించిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

అంబులెన్స్, హాస్పిటల్ సీన్ తో మొదలైన ఛల్ మోహన్ రంగ సినిమా... హీరో నితిన్ తన కథను చెప్పడంతో మొదలవుతుంది. హైదరాబాద్‌కు చెందిన మోహన్‌రంగ (నితిన్) మిడిల్ క్లాస్ లో పుట్టినా... చిన్నప్పటి నుండే అమెరికా వెళ్లాలని కలలు కంటుంటాడు. అమెరికా వెళ్ళాలి అంటే.. 10th పాసవ్వాలి, అలాగే ఇంటర్, డిగ్రీ పాస్ కావాలని మోహన్ రంగకి తండ్రి నరేష్ చెబుతాడు. ఇక అమెరికా వెళ్లాలన్న ఆతృతలో ఉన్న మోహన్ రంగా కి వీసా మాత్రం దొరకదు. మూడు సార్లు విఫలయత్నం తరవాత మోహన్ రంగాకి అమెరికా వీసా వస్తుంది. అమెరికా వెళ్లిన తరవాత మోహన్‌రంగకు చిన్నప్పుడు తాను పడిపోతే లేపి సహాయం చేసిన మేఘా (మేఘా ఆకాష్).. మోహన్ రంగ అమెరికా వెళితే అక్కడ పరిచయమవుతుంది. మేఘాని మోహన్‌రంగ ఇష్టపడతాడు. మేఘా కూడా మోహన్ రంగాని ఇష్టపడుతుంది. అమెరికాలోనే ఉన్న ఇద్దరూ ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరుచుకోవాలని అనుకుంటారు. అదేసమయంలో మేఘా తన కుటుంబంతో కలసి అకస్మాత్తుగా ఊటీ దగ్గరలోని సొంతూరు కూనూర్‌కు వచ్చేస్తుంది. అయితే మేఘ ను వెతుక్కుంటూ మోహన్‌రంగ కూడా అమెరికా నుండి ఊటీ వస్తాడు. ఊటీకి వచ్చిన మోహన్ రంగాకి మేఘ పెళ్లి కూతురులా కనబడి షాక్ ఇస్తుంది. మేఘ పెళ్లి చేసుకుంటుంది అని తెలిసి మోహన్ రంగా తాగుడుకు బానిస అవుతాడు. మరి నిజంగానే వేరెవరితోనో మేఘ పెళ్లి జరుగుతుందా..? అసలు మోహన్‌రంగకి మేఘాకి పెళ్లి జరుగుతుందా...? అమెరికాలో ఇద్దరు ప్రేమను వ్యక్తపరచకపోవడానికి కారణాలు ఏమిటి? అసలు సినిమా మొదలయ్యేటప్పుడు ఆ హాస్పిటల్ బెడ్స్ మీద మోహన్ రంగ, మేఘాలు ఎందుకుంటారు? చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారా? అనేది మిగతా కథ.

నటీనటుల నటన:

మోహన్ రంగ పాత్రలో నితిన్ తన టాలెంట్ మొత్తం చూపించాడు. మిడిల్ క్లాస్ కుర్రాడిలా సింపుల్ డైలాగ్స్ ని అలవోకగా చెప్పేస్తూ తన పాత్రకు జీవం పోసాడు. చిన్నప్పటినుండి అమెరికా వెళ్లాలని ఆత్రుత పడే పాత్రలో నితిన్ నటన అద్భుతం. లవర్ బోయ్ లా నితిన్ ఛల్ మోహన్ రంగాలో నటించాడు. ప్రేమ కోసం కష్టాలు పడుతుండే కుర్రాడిగా... అమెరికాలో ఎలాంటి పని చెయ్యాలో తెలియని కన్ఫ్యూషన్ లో పడే యువకుడి పాత్రలో నితిన్ నటన సూపర్బ్. మేఘ తల్లిని యాక్సిడెంట్ చేసే సీన్, తన కారుతోనే మేఘ ఆకాష్ కారు గుద్దేసే సీన్లో నితిన్ నటన బావుంది. అలాగే ప్రేమ ఫెయిల్ అయ్యిందని తాగేసి చెప్పే సీన్స్ ని నితిన్ అద్భుతంగా పండించాడు. ఇక మేఘా ఆకాష్ తో కలిసి నటించిన రొమాంటిక్ సీన్స్ లో నితిన్ జీవించాడు. వారి మధ్యన వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక రెండోసారి నితిన్ సరసన అవకాశం దక్కించుకున్న మేఘ ఆకాష్ సెటిల్డ్ పెరఫార్మెన్స్ చేసింది. నితిన్ స్థాయిలో కాకపోయినా మేఘ ఆకాష్ కూడా బాగానే నటించింది. పద్దతిగల అమ్మాయిలా, అమాయకపు చూపులతో ఆకట్టుకుంది. నితిన్ తో రొమాంటిక్ సీన్స్ లో మాత్రం బాగా ఆకట్టుకుంది. నితిన్ తల్లితండ్రులుగా సీనియర్ నరేష్, తల్లిగా ప్రగతి తమ పరిధిమేర ఆకట్టుకున్నారు. నితిన్ ఫ్రెండ్ గా మధు నందన్, రావు రమేష్ ఆకట్టుకునే డైలాగ్స్ తో బాగా నటించారు. సత్య, ప్రభాస్ శ్రీను ఇంకా మిగతా నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

దర్శకుడు కృష్ణ చైతన్య కొత్త వాడు... అయినా త్రివిక్రమ్ రాసిన కథతో కృష్ణ చైతన్య సినిమాని అద్భుతంగా తెరకెక్కించాలనుకున్నాడు. అయితే త్రివిక్రమ్ అందించిన కథ ఓ అన్నంత కొత్తదేమీ కాదు. చాలా సినిమాల్లో మనం చూసిన కథే.... ఈ ఛల్ మోహన్ రంగా కథ. హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం.. దానిని బయటికి చెప్పే లోపే కొన్ని అనుకోని కారణాలతో విడిపోయి చివరకి మళ్ళీ కలుసుకోవడం అనే కథ బోలెడన్ని సినిమాల్లో చూసేసాం. అయితే కథ పాతదయినా దర్శకుడు కృష్ణ చైతన్య ఈ కథకు కామెడీ ని జోడించాడు. ఫ్లాట్ నేరేషన్ తోనే కథ నడిచినప్పటికీ కామెడీ సన్నివేశంతో ఫస్ట్ హాఫ్ మొత్తం మేనేజ్ చేసేసాడు. అయితే కథ విషయంలో తప్పు చేసినా... ఆకట్టుకునే డైలాగ్స్ తో త్రివిక్రమ్ మార్క్ ఈ సినిమాలో అడుగడుగునా కనబడుతుంది. పంచ్ డైలాగ్స్ మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఇక ఫస్ట్ హాఫ్ మొదట్లో సీనియర్ నరేష్ కొడుకు నితిన్ ని ఉద్దేశించి కుక్కపిల్లకి పెడిగ్రీ పెట్టె స్తొమత లేదు.. ఒకవేళ దానికి పెడిగ్రీ పెడితే నీ చదువుకు డబ్బు కట్టలేను అనే డైలాగ్స్, నితిన్ అమెరికా వీసా కోసం పడే తపన వంటివాటితో ఫస్ట్ హాఫ్ మొత్తం సాగిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఎక్కువగా బోర్ కొట్టించే సీన్స్ ఉన్నాయి. అంతేకాకుండా సెకండ్ హాఫ్ మొత్తం చాలా నెమ్మదిగా సాగుతుంది. మేఘ ని వెతికే క్రమంలో నితిన్ చేసే జర్నీ మాత్రం ప్రేక్షకుడికి బోర్ కొట్టించేస్తుంది. కానీ మేఘ ఊరికి నితిన్ వచ్చాక మళ్ళీ సినిమాలో ఊపు వస్తుంది. అప్పుడు కూడా కామెడీ ట్రాక్ తో దర్శకుడు ప్రేక్షకులను కట్టిపడేసాడు. ఇక ఈ సినిమాలో వచ్చే పార్టీ సీన్స్ మాత్రం సినిమాకి కాస్త హైలెట్ గా నిలుస్తాయి. కానీ కథ రొటీన్ కావడం సినిమాకే అతి పెద్ద మైనస్. మరి ఈ కథ చూస్తుంటే త్రివిక్రమ్ పెన్నులో పస తగ్గిందా అనిపించక మానదు. ఎందుకంటే అజ్ఞాతవాసి సినిమా విషయంలో త్రివిక్రమ్ ఫెయిల్ అయినట్లే.. ఛల్ మోహన్ రంగ కథ విషయంలోనూ త్రివిక్రమ్ ఫెయిల్యూర్ స్పష్టంగా తెలుస్తుంది. ఇక కామెడీతో బండి లాగించినా... కథ లో కొత్తదనం లేకపోవడం, అసలు ట్విస్ట్ లు లేకపోవడం తో సినిమా చూస్తున్నంత సేపు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. దర్శకుడు కృష్ణ చైతన్య ఫస్ట్ హాఫ్ ని కామెడీతో కట్టిపడేసి.. సెకండ్ హాఫ్ ని గాలికొదిలేశారు. సెకండ్ హాఫ్ ని హ్యాండిల్ చెయ్యడంలో పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి.

సాంకేతిక వర్గం పనితీరు:

నటరాజన్ సుబ్రమణియమ్ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్. సినిమాలోని ప్రతి లొకేషన్ ని నటరాజన్ సుబ్రమణియమ్ చాలా అద్భుతంగా చూపించాడు. అమెరికా అందాలను, ఊటీ అందాలను అన్ని అంటే అన్నిటిని నటరాజన్ సుబ్రమణియమ్ సినిమాటోగ్రఫీ సూపర్. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన థమన్ ఎప్పటిలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని దంచేసాడు. అలాగే పాటల విషయంలో కూడా థమన్ తన మార్క్ చూపించాడు. తొలిప్రేమతో మళ్ళీ ఫామ్ లోకొచ్చిన థమన్ ఈ సినిమాతోనూ అదరగొట్టాడు. వారం, మేఘ.. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక పవన్ క్రియేటివ్ వర్క్స్ తో పాటు, శ్రేష్ట్ మూవీస్ వారు అందించిన నిర్మాణ విలువలు సినిమాకి రిచ్ నెస్ ని తీసుకొచ్చాయి.

పాజిటివ్ పాయింట్స్: కామెడీ సీన్స్, డైలాగ్స్, నితిన్ నటన, ఎడిటింగ్ , స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ

నెగటివ్ పాయింట్స్: కథ, ఫ్లాట్ నేరేషన్, డైరెక్షన్, ట్విస్ట్ లు లేకపోవడం

రేటింగ్: 3.0/5

Similar News