బ్రోచేవారెవరురా మూవీ రివ్యూ (3/5)

బ్రోచేవారెవరురా మూవీ రివ్యూ బ్యానర్: సురేశ్‌ ప్రొడక్షన్స్‌ నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, నివేదా థామస్, నివేదా పేతురాజ్, రాహుల్‌ రామకృష్ణ, సత్యదేవ్‌, శివాజీ రాజా తదితరులు [more]

Update: 2019-06-28 11:24 GMT

బ్రోచేవారెవరురా మూవీ రివ్యూ
బ్యానర్: సురేశ్‌ ప్రొడక్షన్స్‌
నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, నివేదా థామస్, నివేదా పేతురాజ్, రాహుల్‌ రామకృష్ణ, సత్యదేవ్‌, శివాజీ రాజా తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: వివేక్‌ సాగర్‌
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌
నిర్మాత: విజయ్‌ కుమార్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ

సినిమా ఇండస్ట్రీలోకి నారా రోహిత్ ఫ్రెండ్ గా అడుగుపెట్టిన.. శ్రీ విష్ణు మొదట్లో హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో నారా రోహిత్ సినిమాలోనే నటించాడు. ఇక తర్వాతరవాత మెంటల్ మదిలో, నీది నది ఒకటే కథ సినిమాల్తో హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు శ్రీ విష్ణు. నేచురల్ నటనతో అందరి మనసులను దోచేసిన శ్రీ విష్ణు తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో బ్రోచేవారెవరురా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో నటించాడు. బ్రోచేవారెవరురా అనే టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడం….. ఈసినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లాంటి కమెడియన్స్ ఉండడం, అలాగే నేచురల్ నటనతో హీరోయిన్ గా మంచి పేరున్న నివేత థామస్ శ్రీవిష్ణు కి జోడిగా నటించడం తో పాటుగా.. సినిమా ప్రమోషన్స్ కూడా బ్రోచేవారెవరురా మీద అందరిలో ఆసక్తి ఆకలిగించాయి. ఇక బ్రోచేవారెవరురా పోస్టర్స్ తో పాటుగా ట్రైలర్ కూడా సినిమా మీద అంచనాలు పెంచాయి. మరి శ్రీ విష్ణు ఈ సినిమాతో కూడా సాలిడ్ అందుకున్నాడా? దర్శకుడు వివేక్ స్టామినా ఈ సినిమా తో ఎంతవరకు నిలబడుతుందో? హీరోయిన్ నివేత మళ్ళీ తన నటనతో అందరిని మెస్మరైజ్ చేసిందా? అసలు ఈసినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
సత్యదేవ్ ఓ పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని కలలు కనే ఓ యువకుడు, ఆ క్రమంలో తను ఎన్నో ఇబ్బందులు వడిదుడుకులు ఎదుర్కొంటాడు, చివరికి ఒక స్టార్ హీరోయిన్ షాలిని(నివేదా పేతురాజ్)కి తన కథ వినిపించే అవకాశం దక్కుతుంది. ఇదే కథకు సమాంతరంగా మరో నలుగురు టీనేజ్ యువత కథ కూడా కనిపిస్తుంది. మిత్ర(నివేదా థామస్‌)కు భరతనాట్యం అంటే ఇష్టం. చిన్నప్పుడే అమ్మానాన్నవిడిపోతారు. దీంతో తల్లి దగ్గర పెరుగుతుంది. ఆమె చనిపోవడంతో ఇష్టం లేకపోయినా తండ్రి దగ్గరకు వచ్చి ఉంటుంది. మిత్ర తండ్రి కాలేజ్‌ ప్రిన్స్‌పల్‌. దీంతో అదేకాలేజ్‌లో మిత్ర ఇంటర్‌లో చేరుతుంది. అయితే, చదువంటే అస్సలు ఇష్టం ఉండదు. మరోపక్క తండ్రి క్రమశిక్షణ పేరుతో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. అలాంటి సమయంలో ముగ్గురు యువకులు ఫ్రెండ్స్‌ అవుతారు. అందులో రాహుల్‌ (శ్రీవిష్ణు) చాలా అల్లరి కుర్రాడు. చదువంటే అతనికీ ఇష్టం ఉండదు. తండ్రి క్రమశిక్షణ తట్టుకోలేక ఇల్లు వదలి పారిపోవాలనుకుంటుంది మిత్ర. ఆ క్రమంలో శ్రీవిష్ణు బ్యాచ్ మిత్రకి ఎలా సాయం చేశారు ? మిత్రకి చేసిన సాయం కారణంగా శ్రీవిష్ణు బ్యాచ్ ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారు ? ఆ సమస్యల నుండి వాళ్లు బయటపడే క్రమంలో ఏ తప్పు చేశారు ? అనేది బ్రోచేవారెవరురా మిగతా కథ.

నటీనటుల నటన:
ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామ కృష్ణ తమ నటనతో సినిమా స్థాయిని పెంచారు. శ్రీ విష్ణు చాలా చలాకీగా నటించాడు. అల్లరి పిల్లాడిగా అతని నటన ఆకట్టుకుంటుంది. తన సహజ నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు శ్రీవిష్ణు. విష్ణు, రాహుల్, ప్రియదర్శి తమ తమ బెస్ట్ అవుట్ ఫుట్ అందించారు. ఇక ప్రియదర్శి, రాహుల్ పై తెరకెక్కిన హాస్యసన్నివేశాలు థియేటర్లో చక్కగా పేలాయి. నివేదా థామస్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సెకండ్ హాఫ్ లో ఆమె పాత్రను కట్టేసినప్పటికీ ఫస్ట్ హాఫ్ లో తను కూడా ఉత్సాహంగా కనిపించింది. నివేదా థామ‌స్ కూడా అల్ల‌రి చేసింది. ఇక సెకండ్ హాఫ్ లో త‌ను కిడ్నాప్ అయిపోయింది కాబ‌ట్టి… ఆ పాత్ర‌కు అంత స్కోప్ లేకుండాపోయింది. సత్య, నివేదా పేతురాజ్‌లది మరో ట్రాక్‌. అది కూడా కథలో భాగమై ఉండటం వల్ల ఈ రెండు పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. సత్య చాలా సహజంగా నటించాడు. అమాయకపు ఎస్సైగా హర్షవర్థన్‌ నటన మెప్పిస్తుంది. ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ప్రతీ నటుడు తన పాత్రకు న్యాయం చేశాడు.

విశ్లేషణ:
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఎంచుకున్న కథ కొత్తగా అనిపించకపోయినా కూడా, చక్కని స్క్రీన్ ప్లే తో చిత్రాన్ని రక్తికట్టించారు. సస్పెన్సు సన్నివేశాలను కామెడీ తో మిక్స్ చేసి తెరకెక్కించడంలో విజయం సాధించాడు. దర్శకుడు కథను కామెడీగా మొదలు పెట్టాడు. కాలేజ్‌లో క్వశ్చన్‌ పేపర్లు దొంగిలించే సన్నివేశం ప్రేక్షకులను హాయిగా నవ్విస్తుంది. కిడ్నాప్‌ డ్రామా, అందుకోసం వేసిన స్కెచ్‌లు చాలా సరదాగా అనిపిస్తాయి. ఈ కిడ్నాప్‌ డ్రామాను ఒక దర్శకుడి కథకు, ముడిపెట్టడం కూడా తమాషాగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే కీలకపాత్ర పోషించే చిత్రమిది. ఫస్ట్ హాఫ్ ఎంత సరదాగా సాగుతుందో… సెకండ్ హాఫ్ అంత ఉత్కంఠ కలిగిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే సెకండ్ తెరపై చూపించడం కత్తిమీద సాములాంటిది. దర్శకుడికి ఇక్కడే పూర్తి మార్కులు పడతాయి. కథనం ఉత్కంఠత కలిగిస్తూనే…. వినోదపు పాళ్లు ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. సినిమాలో దర్శకుడు టాలెంట్ సత్య దేవ్ – నివేత పేతురేజ్, శ్రీ విష్ణు – నివేత థామస్ – రాహుల్ – ప్రియదర్శల రెండు కథల్ని ముడి పెట్టిన విధానం బాగుంది. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ఛేజింగ్ సీన్స్ స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. అదే విధంగా పాత కాలపు మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో నవ్వించినా…. ఇప్పటికే చాలా సినిమాల్లో ఇలాంటి కామెడీని చూసేసాం కదా భావన కలుగుతుంది. అయితే ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా సినిమాలో చాలా సార్లు నవ్వుకుంటారు. సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ లో వచ్చే ఛేజింగ్ సీన్స్ స్లోగా సాగుతాయి. కాకపోతే ఈ సినిమాని చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

సాకేతికంగా… విశాల్‌ భరద్వాజ్‌ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కథలో మిళితం అయిపోయి ఉంటాయి. . ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. స్క్రీన్‌ప్లేలో మలుపులు గమ్మత్తుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమాలోని చాలా సన్నివేశాలను సాయి శ్రీరామ్ చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. రవితేజ గిరజాల ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాత విజయ్ కుమార్ మాన్యం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే, కామెడీ, ఫస్ట్ హాఫ్, సినిమాటోగ్రఫీ, కథలో ట్విస్టులు, నేపధ్య సంగీతం, శ్రీ విష్ణు నటన, నివేత థామస్
మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ లో స్లోగా సాగె సన్నివేశాలు, కథలో బలం లేకపోవడం

రేటింగ్: 3.0/5

Tags:    

Similar News