వర్మకు ఫత్వా : రవి అంత సాఫీగా వంగవీటి కథ ముగియదా!

Update: 2016-12-03 20:11 GMT

ఒక వివాదాస్పద వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా తయారవుతున్నదంటే ముందు ఆయన అభిమానులు, ప్రత్యర్థులు అలర్ట్ అవుతారు. తమ తమ పాత్రలు ఎలా చిత్రీకరింపబడ్డాయో అని ఆరాటపడతారు. ఆ కొలమానం మీద చూసినప్పుడు పరిటాల రవి జీవితం ఆధారంగా చేసిన రక్తచరిత్ర చిత్రానికి, వంగవీటి మోహనరంగా జీవితం ఆధారంగా చేస్తున్న ‘వంగవీటి’ చిత్రానికి పెద్ద తేడా లేదు. అయితే పరిటాల రవి జీవితం చిత్రీకరించే విషయంలో మంచి-చెడులు ఏ పక్షంలో ఉన్నాయనే సంగతి తానై తేల్చకుండా ముగించి.. ఎవ్వరికీ అసంతృప్తి లేకుండా సినిమాటిక్ గా లాభపడ్డారు వర్మ. కానీ ‘వంగవీటి’ చిత్రం పర్యవసానాలు అంత సాఫీగా ముగిసేలా కనిపించడం లేదు. రంగా కుమారుడు రాధా తో వర్మ సున్నం పెట్టుకున్నట్లే వాతావరణం ముదురుతోంది.

ఆడియో విడుదల కోసం శనివారం విజయవాడకు వచ్చిన రాంగోపాల్ వర్మ.. అటు వంగవీటి మోహన రంగా, దేవినేని నెహ్రూ కుటుంబాలతో సమావేశం అయ్యారు. రాధాతో భేటీ సంతృప్తికరంగా సాగకపోగా, రాధా ఇప్పటికీ వర్మ సినిమాను సీరియస్ గానే హెచ్చరిస్తున్నారు.

‘‘ఆయన చెప్పేది ఆయన చెప్పాడు.. మేం చెప్పేది మేం చెప్పాం.. ఆయన చేసేది ఆయన చేస్తాడు.. మేం చేసేది మేం చేస్తాం...’’ అని రాధా అంటున్న వ్యాఖ్యలు సాధారణమైనవి కాదు. అమీతుమీ తేల్చుకుందాం అన్నట్లుగానే ఉన్నాయి. ఇప్పటికే రాధా ఈ విషయాన్ని హైకోర్టులో కూడా కేసుగా నడుపుతున్నారు. ఆయన కేసు పుణ్యమాని ట్రైలర్ ను ఉపసంహరించుకున్నారు. సినిమా విడుదలయ్యాక మళ్లీ రాధా ఎలా ప్రొసీడ్ అవుతాడనేది కీలకం.

ఈ నేపథ్యంలో ఇరువురి రాజీచర్చలకు కొడాలి నాని సంధానకర్త పాత్ర పోషించారు. ‘‘వర్మ గానీ, రంగా గానీ.. రాధా గానీ.. ఇద్దరూ ఒకరు చెబితే వినే రకాలు కాదు’’ అంటూ నాని భేటీ అనంతరం వ్యాఖ్యానించడం విశేషం. అయితే పరిస్థితులు సర్దుకోవడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చునని ఆయన అంటున్నారు. ఈ వాతావరణం గమనిస్తోంటే.. ఇంకా పెద్దతలకాయలు ఎవరైనా రాజీకి జోక్యం చేసుకుంటారేమో అనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. ఎలాంటి వివాదాలు లేకుండా పరిటాల రవి కుటుంబంతో ఎపిసోడ్ ముగిసినట్లుగా, వంగవీటి చిత్రం విషయంలో ఆ కుటుంబంతో ఎపిసోడ్ ముగియకపోవచ్చు.

Similar News