ఫ్లాప్‌లని ఒప్పుకోవడంలో అచ్చం తండ్రి బాటే!

Update: 2016-11-09 03:49 GMT

కిందపడ్డా సరే.. పై చేయి నాదే అని వాదించే మొండి ధోరణి సినిమా ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే సినిమాలు బాక్సాఫీసు వద్ద దారుణంగా ఫ్లాప్ అయినా సరే.. సినిమా యూనిట్ సభ్యులు మాత్రం విజయ యాత్రలు అంటూ ఆత్మవంచన చేసుకుంటూ ఊర్లు తిరిగేస్తుంటారు. కానీ కొందరు హీరోలు మాత్రం అచ్చంగా తమ చిత్రాల ఫ్లాప్ ల విషయంలో ఒప్పేసుకుంటూ ఉంటారు. అలాంటి కోవకు చెందుతారు హీరో అక్కినేని నాగార్జున. శివ, గీతాంజలి సీజన్ లో ఆ చిత్రాల తర్వాత నాగార్జున ను వరుస ఫ్లాప్ లు పలకరించాయి. అప్పట్లో ప్రజలు నన్ను తిరస్కరించారు.. అంటూ ఫ్లాప్ ల గురించి నాగార్జున ఇప్పటికీ నిజాయితీగా ఒప్పుకుంటూ ఉంటారు. అదే అలవాటు , ధైర్యం అక్కినేని నాగచైతన్య కు కూడా వచ్చినట్లుంది.

ప్రజలు తనను యాక్షన్ చిత్రాల్లో చూడడానికి సిద్ధంగా లేరనే సంగతిని గుర్తించకుండా చేసిన ఆటోనగర్ సూర్య, దడ వంటి చిత్రాలు దెబ్బతిన్నాయని చైతూ చెబుతున్నాడు. ప్రస్తుతం తాను చేస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్న నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో యాక్షన్ జోనర్ లో ప్రేక్షకులు తనను రిసీవ్ చేసుకోవడం లేదనే అభిప్రాయం వెల్లడించాడు. భవిష్యత్తులో యాక్షన్ చిత్రాలు చేసినా సరే.. అందులో తప్పకుండా ప్రేమ కథల యాంగిల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటానంటున్నాడు.

పెళ్లి కబుర్ల విషయానికి వస్తే.. తన పెళ్లి బహుశా చర్చిలో, ఆతర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే అవకాశం ఉందంటున్నాడు చైతూ.

తమిళ మార్కెట్ కూడా క్యాప్చర్ చేయడానికి ఇకమీదట చేసే చిత్రాలు ఉభయభాషా చిత్రాలుగా, తమిళంలో కూడా తానే ఉండేలా చేస్తానంటున్నాడు చైతన్య. సినిమాలు బాక్సాఫీసు వద్ద సక్సెస్ కావడం లేదుగానీ.. సక్సెస్ అయితే.. వాటిని డబ్బుగా మార్చుకోవడం ఎలాగో.. అప్పుడే చాలా తెలివితేటలు అబ్బినట్లుగా ఉన్నాయి.

Similar News