పది రోజులు ఇంటిముఖం చూడని కొత్త పెళ్ళికొడుకు

Update: 2016-11-28 08:02 GMT

రానున్న సంక్రాంతి పండుగకి బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అనేట్టుగా గట్టి పోటీ నెలకొననుంది. మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 150 వ చిత్రం ఖైదీ నెం.150 ఆయన కమ్ బ్యాక్ మూవీగా తెరకెక్కటం, మరోపక్క నందమూరి బాల కృష్ణ 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి నిర్మాణాంతర కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసుకుంటూ సంక్రాంతి బరిలో దిగటానికి సిద్దమవుతుండటం. ఇప్పటికే గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రీకరణతో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి అయిపోయి ఉండాలి. కానీ షెడ్యూల్ మధ్యలో దర్శకుడు క్రిష్ వివాహ వేడుక రావటంతో చిత్రీకరణకు కొంత అంతరాయం కలిగింది.

అయినప్పటికీ సంక్రాంతికి విడుదల చేసి తీరాలని, అదే సమయంలో సినిమా నాణ్యత కోల్పోకుండా జాగ్రత్తలు వహిస్తూ నిర్మాణాంతర కార్యక్రమాలు చేపడుతున్నారు గౌతమీ పుత్ర శాతకర్ణి బృందం. "పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ దశలో మాకు వున్న చిన్న చిన్న సందేహాలకు కూడా ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చి మాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం. దర్శకుడు క్రిష్ అయితే పది రోజులకి ఒక సారి ఇంటికి వెళ్తున్నారు. ఆయన ఒంటరిగా లాగుతున్న పెద్ద రథానికి మేము అందరం కలిసి చిన్న పాటి సహాయం మాత్రమే అందిస్తున్నాం. క్రిష్ ఇంటికి వెళ్లకుండా దగ్గర ఉండి తన పర్యవేక్షణలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేపట్టడానికి ఆయన భార్య రమ్య అందిస్తున్న తోడ్పాటు అనిర్వచనీయం." అని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేతల్లో ఒకరైన నిర్మాత రాజీవ్ రెడ్డి తన అనుభూతిని పంచుకున్నారు.

Similar News