అమ్మ సేఫ్ : మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే

Update: 2016-10-02 15:19 GMT

పురట్చి తలైవి జయలలిత క్షేమంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి రెండు రోజులుగా చెలరేగుతున్న పుకార్లలో నిజం లేదు. ఈవిషయంలో తమిళనాడు మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాల్లో కూడా తీవ్రమైన ఆందోళనకు గురవుతున్న అభిమానులకు అందరికీ ఊరట కలిగించేలా.. చెన్నైలోని అపోలో ఆస్పత్రి వర్గాలు ఆదివారం సాయంత్రం పొద్దు పోయిన తర్వాత బులెటిన్ విడుదల చేశాయి. జయలలిత ఆరోగ్యం కుదురుగా.. ఉన్నదని, ఆమె చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

లండన్ నుంచి ప్రత్యేకంగా పిలిపించిన.. వైద్యుడు జాన్ రిచర్ట్స్ బాలే ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు చికిత్స చేస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. జయలలిత కు ఇన్ఫెక్షన్ సోకినట్లుగా తెలుస్తోంది. సంబంధిత రంగంలో డాక్టర్ బాలే నిపుణులు కావడంతో ఆయన సూచన మేరకు వైద్యం చేశామని.. జయలలిత ఇప్పుడు చక్కగా చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పారు.

అయితే ఆరోగ్య సమస్య ఇన్ఫెక్షన్ కు సంబంధించినది అయినందువల్ల.. ఆమె మరికొన్నాళ్లు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందని కూడా వైద్యులు ప్రకటించారు. ఈ వార్తలతో రెండురోజులుగా ఆమె ఆరోగ్యం కోసం అభిమానులు చేస్తున్న పూజలన్నీ ఫలించినట్లయింది. అభిమానులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. హర్షాతిరేకాల్లో మునిగిపోయారు.

Similar News