రంగ‌స్థ‌లం సినిమా.. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌ విశ్లేష‌ణ‌

Update: 2018-03-31 06:20 GMT

సినిమా.. క‌మ్యూనికేష‌న్ విభాగంలో అత్యంత శ‌క్తివంత‌మైంది. సినిమాలు అనేకం వ‌స్తుంటాయి. పోతుంటాయి. కొన్ని మాత్ర‌మే ప్రేక్ష‌కుల మ‌నసులు గెలుచుకుంటాయి. గోదావ‌రి ప‌ల్లె సంస్కృంతిని 1985 ప్రాంతం నాటికి ఎలా తీర్చిదిద్దారోన‌న్న ఆస‌క్తితో నా మిత్రుడు బ‌రాటం చిరంజీవి తో క‌లిసి ఈ రంగ‌స్థ‌లం సినిమా చూశాను. సినిమా చూస్తున్నంత‌సేపు ఏదో తెలియ‌ని ఉద్వేగం క‌లిగింది..ఒక సినిమా.. న‌టులు.. పాత్ర‌లు.. ఇవన్నీ క‌ల్పితం అని తెలుసు.. భావోద్వేగ‌పూరితంగా సాగే పాత్ర‌లు చూసిన‌ప్పుడు కొన్నిసార్లు క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగాయి.ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్ర‌తిభ‌ని మెచ్చుకోవాలి.

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లో ఇంత అద్భుత న‌టుడు ఉన్నాడా? అని మొద‌టిసారి అనిపించింది. ఆది.. స‌మంత‌తో పాటు ఆర్ట్ డైరెక్ట‌ర్ రామ‌కృష్ణ గారు, సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ ప్ర‌సాద్‌, ఇత‌ర సాంకేతిక బృందానికి విశ్వ‌మాన‌వ‌వేదిక త‌ర‌పు నుంచి అభినంద‌న‌లు.. రంగ స్థ‌లం సినిమా చూస్తున్న‌ప్పుడు క‌చ్ఛితంగా ఈ సినిమాని విశ్లేషించాల‌నిపించింది.

అస‌లు రంగ‌స్థ‌లంలో ఏముంది..?

గోదావ‌రి ప‌ల్లెల్లో క‌నిపించే జీవ‌న వ్య‌థ‌లు ఉన్నాయి.

మ‌ట్టి మ‌నుషుల మ‌మ‌తానురాగాలు ఉన్నాయి.

అన్న‌ద‌మ్ముల అనుబంధం ఉంది.

గ్రామాల్లో నియంత‌ల అవ‌తారం ఎత్తిన‌ భూస్వామ్య‌పు పెత్తందారీ రాజ‌కీయ వికృతం ఉంది.

అంద‌మైన గోదారి ఉంది.

అమామ‌క‌పు ప‌ల్లె ప‌డుచులు ఉన్నారు.

లుంగీలు క‌ట్టుకుని గ్రామాల్లో మోటు స‌ర‌సం ఆడే కుర్రాళ్లు ఉన్నారు.

వెలిసిన గోడలు ఉన్నాయి.

గోదావ‌రి జిల్లాల బ్రాండ్‌ని తెలిపే పెంకిటిళ్లు ఉన్నాయి.

క్షుద్ర రాజ‌కీయం ఉంది.

న‌మ్మించి వంచించే వెన్నుపోట్లు ఉన్నాయి.

క‌క్ష‌లు ఉన్నాయి.

స్వ‌చ్ఛ‌మైన ప్రేమ ఉంది.

మ‌ట్టి వాస‌న‌లు ఉన్నాయి.

సైకిళ్లు.. ఐస్ బ‌ళ్లు..మ‌ట్టి పాత్ర‌లు.. కొల్గేట్ టూత్ పౌడ‌ర్ వ‌ర‌కు అన్నీ ఉన్నాయి.. 1985 ప్రాంతంలో గోదావ‌రి ప‌ల్లెల్లో జీవ‌న సంస్కృతి ఉంది. కాలం 30 ఏళ్లు వెన‌క్కి వెళ్లిన‌ట్లు క‌నిపించింది. ఇదంతా సినిమా.. అందుకే ఇవ‌న్నీ ఉన్నాయ‌నుకోవ‌చ్చు.. సాధార‌ణ సినిమాలకు.. రంగ‌స్థ‌లం సినిమాకు ఒక్క‌చోట తేడా క‌నిపిస్తోంది.

ఆ ఒక్క తేడా ఏమిటంటే...

మ‌నుషుల భావోద్వేగాలు..

అన్యాయంపై తిరుగుబాటు..

వికృతంగా అణిచివేసే నియంతృత్వ‌పు విధానాల‌పై ఉక్కు పిడికిలి..

ఒక్క‌రిగా మొద‌లైన తిరుగుబాటు.. ఊరు మొత్తం క‌దిలి పోరాడేంత తిరుగుబాటు.. కులాలు.. వీధులు వారీగా విడిపోయిన ఒక ప‌ల్లెలో మ‌ట్టి మ‌నుషులు ఏక‌మైన తీరు ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది. పెత్తందారీ.. భూస్వామ్య‌పు విధానాల‌తో ప‌ల్లెల్ని శాసించే వ్య‌క్తుల క్రూర మ‌న‌స్త‌త్వాన్ని డైరెక్ట‌ర్ సుకుమార్ అద్భుతంగా ఆవిష్క‌రించారు.. రామ్‌చ‌ర‌ణ్ త‌న పాత్ర‌కి ప్రాణం పోశారు. కొద్దిపాటి చెవుడు.. అమాయ‌క‌త్వం.. ప‌ల్లెత‌న‌పు దూకుడు.. కొంటెత‌నం.. మొర‌టు స‌ర‌సంతో ఒక న‌టుడుగా.. ముఖ్యంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా న‌ట విశ్వ‌రూపం చూపించాడు.

ఊరు మొతుబ‌రి క‌నిపిస్తే చెప్పులు తీసి చేతుల‌తో ప‌ట్టుకుని న‌డ‌వ‌డం.. లుంగీలు కింద‌కు వ‌దిలి న‌డ‌వ‌డం..

సైకిళ్ల మీద నుంచి హ‌ఠాత్తుగా దిగి న‌డిపించుకుని వెళ్ల‌డం.. ఇవ‌న్నీ మ‌న పెద్ద‌లు చాలా చోట్ల అనుభ‌వించారు..

ఇంకా కొన్నిచోట్లా నియంతృత్వ‌పు ఆన‌వాళ్లు అలాగే ఉన్నాయి..

ఉద్యోగాలు కోసం.. పొట్ట కూటి కోసం విదేశాల‌కు వెళ్లే ఇంటి య‌జ‌మాని కుటుంబాల ప‌ట్ల చూసే కోణం మారాల‌న్న విష‌యాన్ని సుతిమెత్త‌గా చెప్పాడు.. ఏడాది పాటు భూమిని న‌మ్ముకుని పంట పండిస్తే దోచుకెళ్లే ద‌ళారులు.. గ్రామాధికారుల నీచ‌నైజాన్ని ఆవిష్క‌రించారు. ఇది ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న దుర్మార్గం..

రంగ‌స్థ‌లం అనే ప‌ల్లెని క‌థాంశంగా తీసుకుని చూపించిన సినిమాని చూస్తుంటే ప్ర‌తీ ప‌ల్లెలో క‌నిపించిన‌, క‌నిపిస్తున్న యధార్థ గాథ‌లు మ‌న‌కు గుర్తుకు వ‌స్తుంటాయి. ఒక్కరిగా కాకుండా.. అందరూ ఒక్కటై తమ తమ ప్రాంతాల్లో దుర్మార్గలపై పోరాడే శక్తిని.. చైతన్యాన్ని కూడగట్టుకున్నప్పుడే మనం అనుకున్న మార్పు సాధ్యం అవుతుంది.

రచయిత (మల్లుల సురేష్ గారు) సీనియర్ జర్నలిస్ట్ మరియు విశ్వమానవ వేదిక అధ్యక్షుడు. పైన వ్యక్తపరచిన అభిప్రాయలు రచయిత వ్యక్తిగతం

 

రంగస్థలం పై తెలుగు పోస్ట్ ఇతర విశ్లేషనలు ఇక్కడ చదవండి..

రంగస్థలం మూవీ రివ్యూ - 3 ( నటి నటుల పెర్ఫార్మన్స్ పై విశ్లేషణ )

ర‌ంగ‌స్థ‌లం - రివ్యూ-2

రంగ‌స్థ‌లం షార్ట్ & స్వీట్ రివ్యూ

Similar News