Telangana : ఎవరీ కళారెడ్డి.. తెలంగాణ నుంచి వెళ్లి ఉత్తర్‌ప్రదేశ్ ఎంపీగా పోటీ చేస్తున్నారంటే?

ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన మహిళ శ్రీకళారెడ్డి పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు

Update: 2024-04-18 06:55 GMT

ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన మహిళ శ్రీకళారెడ్డి పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీకళా రెడ్డి ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన ధనుంజయ్ సింగ్ ను వివాహమాడారు. ధనుంజయ్ సింగ్ గతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. అయితే ధనుంజయ్ సింగ్ కు శ్రీకళారెడ్డి మూడో భార్య. అయితే ధనుంజయ్ సింగ్ కేసుల కారణంగా ఇప్పుడు జరిగే ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో తన భార్య శ్రీకళారెడ్డిని రంగంలోకి దించారు. ఆమె ఉత్తర్‌ప్రదేశ్ లోని జాన్‌పుర్ లోక్‌సభ నుంచి బరిలోకి దిగనున్నారు. బీఎస్పీ తరుపున ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

నిప్పో బ్యాటరీ...
అయితే శ్రీకళారెడ్డి కుటుంబం పారిశ్రామిక నేపథ్యం ఉన్న కుటుంబం. నిప్పు బ్యాటరీ సంస్థ అధినేతగా ఆమె తండ్రి జితేందర్ రెడ్డి అందరికీ సుపరిచితుడే. వీళ్లది నల్లగొండ జిల్లా. జితేందర్ రెడ్డి గతంలో హుజూర్ నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. శ్రీకళారెడ్డి తల్లి లలితా రెడ్డి కూడా గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. శ్రీకళారెడ్డి ప్రాధమిక విద్య చెన్నైలో సాగినప్పటికీ బీకాం మాత్రం హైదరాబాద్ లో పూర్తి చేశారు.తర్వాత అమెరికా కు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారు. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేసిన తర్వాత భారత్ కు వచ్చి తమ కుటుంబ వ్యాపారాలను శ్రీకళారెడ్డి చూసుకునే వారు.
మూడో వివాహమాడి...
అయితే ధనుంజయ్ సింగ్ తో పరిచయంతో ఆమె ఆయనను వివాహమాడారు. అప్పటికే ధనుంజయ్ సింగ్ కు రెండు పెళ్లిళ్లు అయినా మూడో భార్యగా ఆయన ను పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల క్రితం ఉత్తర్‌ప్రదేశ్ లో శ్రీకళారెడ్డి జడ్పీ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆర్థికంగా బలమైనకుటుంబం కావడంతో పాటు రాజకీయ నేపథ్యం ఉండటంతో బీఎస్పీ అధినేత్రి మాయావతి శ్రీకళారెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. ఆమె పేరిట దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆస్తున్నాయి. బీజేపీ, ఎస్పీ అభ్యర్థులతో ఆమె తలపడనున్నారు. మొత్తం మీద తెలంగాణ గడ్డ మీద పుట్టి ఉత్తర్‌ప్రదేశ్ లో ఎంపీ స్థానానికి పోటీ చేయడం అంటే ఆషామాషీ కాదు. మరి ఆమె గెలుపు అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయన్నది జూన్ 4వ తేదీన తెలియనుంది.


Tags:    

Similar News