Telangana Elections : కారు జోరు పెరిగిందా? తగ్గిందా? గ్రౌండ్ లెవెల్లో మాత్రం.. కాస్త తేడాగానే కనిపిస్తుందే?

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. పదిహేడు స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి

Update: 2024-05-16 05:58 GMT

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. పదిహేడు స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ శాతం మంది ఓటర్లు పోలింగ్ లో పాల్గొన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి వస్తామని భావించి రాలేకపోయిన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు చావోరేవో లాంటివి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే, అధికార మార్పిడి జరిగిన తర్వాత కీలకమైన నేతలు కూడా పార్టీని వీడి వెళ్లారు. చాలా మంది నమ్మకమైన నేతలే వెళ్లిపోవడం గులాబీ బాస్ కు షాక్ ఇచ్చింది. వీళ్లకా? తాను పదవులు ఇచ్చి అందలం ఎక్కించింది అని అనుకున్నప్పటికీ అప్పటికే ఆలస్యమయిపోయింది. వెళ్లిన వాళ్లు వెళ్లిపోతున్నారు. ఆపేందుకు కూడా సాహించలేదు.

బలగం ఇదీ అని...
ఎందుకంటే ఆపినా ఆగరని తెలుసు. ఐదేళ్లు అధికారం ఉండే పార్టీలో చేరేందుకు నేతలు వెళ్లిపోతుంటారు. గతంలో తాము అనుసరించిన పంథానే నేతలు ఇప్పుడు తమకు అదే దారి అని చెప్పకనే చెప్పి వెళ్లిపోతున్నారు. అయితే గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం కొత్త నాయకులు పుట్టుకొస్తారన్న నమ్మకంతో ఉన్నారు. తమది బలమైన పార్టీ అని, క్షేత్రస్థాయిలో బలగం ఉన్న తమకు నాయకత్వం అనేది సమస్య కాబోదని భావించి ఆయన లోక్ సభ ఎన్నికలకు రెడీ అయిపోయారు. బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టి వచ్చారు. బస్సు యాత్రకు జనం నుంచి మంచి స్పందన రావడంతో గులాబీ నేతల్లోనూ జోష్ కనిపించింది. కొంత వెళ్లడం ఆగినట్లే కనపడింది. నేతలు వెళ్లకుండా ఉండేందుకే తన బలం క్షేత్రస్థాయిలో ఎలా ఉంటుందో చూపాలనే కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు.
కనీసం ఎనిమిది అయినా...
జనం బాగా రావడంతో నేతలు కూడా కాస్త వెనక్కు తగ్గినట్లే కనిపిస్తుంది. అయితే అసలు సమస్య పార్లమెంటు ఎన్నికల ఫలితాలు. ఈ ఎన్నికల్లో కనీస స్థానాలను సాధించుకోలేకపోతే పార్టీలో మళ్లీ వలసలు ప్రారంభమవుతాయన్న కలవరం మొదలయింది. అందుకే డబుల్ డిజిట్ రాకపోయినా కనీసం ఎనిమిది స్థానాలకు తగ్గకుండా సాధించగలిగితే సక్సెస్ అయినట్లేనని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే దాదాపు ఇరవై రోజులు జనంలోనే ఉండి వచ్చారు. గతలో ఎన్నడూ లేని విధంగా జనంతో మమేకమయ్యారు. చిన్నా పెద్దాను పలకరించారు. అందరితో కలసిపోయారు. కానీ ఇవన్నీ వర్క్ అవుట్ అయ్యాయా? అంటే మాత్రంచెప్పలేం. కానీ కేేసీఆర్ కు మాత్రం ఖచ్చితంగా ఒక హోప్ అయితే ఉంది. ఈ ఎన్నికల్లో తాను సక్సెస్ అవుతానని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అదే విషయాన్ని సన్నిహితుల వద్ద చెబుతున్నారు.
అనేక కారణాలు...
కాంగ్రెస్ అలివి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకపోవడంతో జనం గుర్రుగా ఉన్నారంటున్నారు. అదే సమయంలో కరవు, చేతికొచ్చిన పంటలు నీరందక ఎండిపోవడం, విద్యుత్తు అంతరాయం, పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం, అకాల వర్షాలతో నష్టపోవడంతో పాటు రైతు బంధు, రైతు బీమా, పింఛను వంటి పధకాలు అమలులో కొంత జాప్యం జరగడం కూడ తమకు కలసి వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. అందుకే కేసీఆర్ ఎనిమిది స్థానాలకు తగ్గవని చెబుతున్నారట. బీజేపీ, కాంగ్రెస్ లను నమ్మని జనం తమను ఈసారి గట్టిగా విశ్వసిస్తున్నారని సీనియర్ నేతల వద్ద వ్యాఖ్యానించడం తో ఆయన పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై పెద్దగా హోప్స్ పెట్టుకున్నారు. మరి జూన్ 4వ తేదీన ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News