Hyderabad : దోమతెర కప్పుకుని వచ్చిన ఎమ్మెల్యే
హైదరాబాద్ ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విన్నూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు
హైదరాబాద్ ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విన్నూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. దోమతెర ఒంటిపై కప్పుకుని అసెంబ్లీకి వచ్చారు. ఫాగింగ్ మిషన్ తోనూ సుధీర్ రెడ్డి శాసనసభకు వచ్చారు. హైదరాబాద్ లో దోమల బెడద ఎక్కువయిందని, ప్రజలు అనారోగ్యం పడుతున్నా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సుధీర్ రెడ్డి ఆరోపించారు.
ఫాగింగ్ మిషన్ తోనూ..
హైదరాబాద్ మహానగరంలో దోమలను అరికట్టాలని కోరుతున్నానని అన్నారు. దోమల బాధ నుంచి హైదరాబాద్ వాసులకు విముక్తి కల్పించాలంటూ ఆయన అసెంబ్లీకి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ప్రజలు చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులతో పాటు అనేక రకమైన ఆరోగ్య ఇబ్బందులు తలెత్తుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సుధీర్ రెడ్డి తన నిరసనను వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ నగరంలో దోమలు విచ్చలవిడిగా పెరిగిపోయాయన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆయిల్ బాల్స్ వదిలి, డ్రోన్స్ ద్వారా, చేపలను వదిలి లార్వాను అరికట్టేవాళ్ళమని, ఈ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయడంలేదని, దాంతో దోమలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఆరోపించారు. దోమల వల్ల ప్రజలు రోగాల బారిన పడి, ఆసుపత్రులకు లక్షల బిల్లులు కడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వం లాగా చర్యలు తీసుకుని, దోమల బెడద నుండి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు.