Fact check : ఆ విమాన ప్రమాదానికి చెందిన వీడియోకు.. బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఉందా..?

హెలికాఫ్టర్ ప్రమాదం కారణంగా భారత సీడీఎస్ బిపిన్ రావత్ దుర్మరణం పాలయ్యారు. బుధవారం నాడు భారత చీఫ్....

Update: 2021-12-12 06:09 GMT

హెలికాఫ్టర్ ప్రమాదం కారణంగా భారత సీడీఎస్ బిపిన్ రావత్ దుర్మరణం పాలయ్యారు. బుధవారం నాడు భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరియు మరో 12 మంది హెలికాప్టర్ క్రాష్‌ కారణంగా మరణించారు. తమిళనాడులోని కూనూర్ ప్రాంతంలో కుప్పకూలడంతో ఆయన మరణించారనే వార్త వచ్చిన కొన్ని నిమిషాల్లో ఎన్నో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ వచ్చాయి. బిపిన్ రావత్ వెల్లింగ్‌టన్ స్టాఫ్ కాలేజీలో మాట్లాడేందుకు వెళుతుండగా విమానం క్రాష్ అయింది. హెలికాప్టర్‌లో ఉన్న మొత్తం 14 మందిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు ఐఏఎఫ్ తెలిపింది. ఈ ప్రమాదంపై భారత వైమానిక దళం విచారణకు ఆదేశించింది.

అయితే ఓ హెలీకాఫ్టర్ గాల్లో ఉన్న సమయంలో మంటలు అంటుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఒరిజినల్ ఫుటేజ్ కొద్ది సేపటికి బయటపడగా.. క్రాష్‌కు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. ఎలాంటి ఆడియో లేకుండానే క్లిప్ షేర్ చేయబడుతోంది.

"Bipin Rawat Helicopter Crashed In Tamil Nadu Video." అంటూ ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు.

నిజ నిర్ధారణ:

ఇది భారత్ కు చెందిన హెలీకాఫ్టర్ కానే కాదు. సిరియాలో చోటు చేసుకున్న ఘటన అని తేలింది.

2020 ఫిబ్రవరి నాటి వీడియో అని మేము కనుగొన్నాము. గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇది సిరియాకు చెందినదని సూచించే అనేక నివేదికలు ఉన్నాయి.

వైరల్ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సంఘటన గురించి ఫిబ్రవరి 18, 2020న ప్రచురించబడిన డిఫెన్స్ న్యూస్ వెబ్‌సైట్ - Overtdefense లో ఒక నివేదికను కనుగొన్నాము.

Overtdefense ప్రకారం "ఇడ్లిబ్ గవర్నరేట్‌పై దాడి సమయంలో సిరియన్ వైమానిక దళం ఉపయోగించే రెండు Mi-8/17 హెలికాప్టర్లు కూల్చివేయబడ్డాయి. మొదటి హెలికాప్టర్ ఫిబ్రవరి 11న దక్షిణ ఇడ్లిబ్ మీదుగా కూల్చివేయబడింది, రెండవది.. ఫిబ్రవరి 14న పశ్చిమ అలెప్పో మీదుగా కూలిపోయింది. రెండు హెలికాప్టర్లలోని సిబ్బందిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు." అని ఉంది.

అదే వైరల్ వీడియో నుండి స్క్రీన్ గ్రాబ్‌లను కలిగి ఉన్న అనేక ట్వీట్లను నివేదిక కలిగి ఉంది. హెలికాప్టర్ సిరియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందినది అని, దేశంలోని దక్షిణ ఇడ్లిబ్ ప్రాంతంలో తిరుగుబాటు గ్రూపులు కాల్చివేసినట్లు ట్వీట్ టెక్స్ట్ పేర్కొంది.
Full View

'రెబెల్స్ షూట్ డౌన్ హెలికాప్టర్ ఇన్ ఇడ్లిబ్ సిరియా' అనే కీలక పదాలను ఉపయోగించి, మేము యూట్యూబ్‌లో వెతకగా, అదే వీడియోతో న్యూస్ అవుట్‌లెట్ 'ది టెలిగ్రాఫ్' ప్రచురించిన కథనాన్ని కనుగొన్నాము.

ఫిబ్రవరి 11, 2020న ప్రచురించబడిన వీడియో కథనం ప్రకారం.. 'సిరియన్ హెలికాప్టర్‌ను ఇడ్లిబ్‌లో తిరుగుబాటుదారులు కూల్చివేసారు' అని శీర్షిక పెట్టారు. వైరల్ వీడియోలో జరిగిన సంఘటనల క్రమాన్ని చూపుతుంది. క్లిప్‌లోని వ్యక్తులు అరబిక్‌లో అరుస్తున్న ఆడియో కూడా ఉంది. వారిలో ఒక వ్యక్తి "అల్లా-హు-అక్బర్" అనడం వినవచ్చు.

కాబట్టి.. ఈ వైరల్ వీడియోకు సీడీఎస్ బిపిన్ రావత్ మరణానికి ఎటువంటి సంబంధం లేదు.


Claim :  ఆ విమాన ప్రమాదానికి చెందిన వీడియోకు.. బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఉందా..?
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News