Fact check: 500 రూపాయల నోటులో గాంధీకి దగ్గరగా గ్రీన్ కలర్ స్ట్రిప్ ఉంటే తీసుకోకూడదా..?

మహాత్మా గాంధీ చిత్రపటం దగ్గర ఆకుపచ్చ స్ట్రిప్, RBI గవర్నర్ సంతకం ఉంటే అది నకిలీ నోటు అని చెబుతూ పోస్టులు పెట్టారు.

Update: 2021-12-09 10:49 GMT

కొత్తగా 500 రూపాయల నోట్లను తీసుకుని వచ్చిన సమయంలో వాటి గురించి ఎన్నో వదంతులు వ్యాపించాయి. నిజమేనని నమ్మిన వాళ్లు కూడా లేకపోలేదు. నోటుపై గీత ఉంటే తీసుకోరు.. నోటుపై సింబల్స్ కొన్ని ఉంటే తీసుకోకూడదంటూ ఒకప్పుడు భారీగా ప్రచారం సాగింది.

ఇంకా కరెన్సీ నోట్లు ఇలా ఉంటే అంగీకరించకూడదు అనే పుకార్లు మనం వింటూనే ఉంటాము. ఇటీవలి కాలంలో మరో పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. కొందరు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. మహాత్మా గాంధీ చిత్రపటం దగ్గర ఆకుపచ్చ స్ట్రిప్, RBI గవర్నర్ సంతకం ఉంటే అది నకిలీ నోటు అని చెబుతూ పోస్టులు పెట్టారు. ఇది నిజమేనని నమ్మి చాలా మంది తీసుకోవడం మానేశారు. వ్యాపారులు, విక్రేతలను గందరగోళానికి గురి చేస్తోంది. అలాంటి నోట్లను స్వీకరించడంలో సంకోచించడం మొదలైంది. ప్రతి నోటును మరింత జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించారు.

నిజమేమిటంటే:

ఈ వదంతులలో ఎటువంటి నిజం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలను కొందరు తప్పుద్రోవ పట్టించేందుకు ఇలాంటి పోస్టులు చేస్తూ ఉన్నారు.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లో ఇలా నోట్ల విషయంలో ఏదైనా అప్డేట్ ఉందేమోనని చూశాము కానీ ఎటువంటి వార్తను కూడా చూడలేదు. అలాగే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను వెతకగా కొత్త 500 రూపాయల చెల్లుబాటులకు సంబంధించిన వార్తలను చూడలేదు. అలాగే ఆర్బీఐకి చెందిన ప్రముఖుల నుండి కూడా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

ఈ పోస్టులు కేవలం వదంతులు మాత్రమేనని తేలింది. అలాంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదని పిఐబి సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తెలిపింది.

గవర్నర్ సంతకానికి దగ్గరగా ఆకుపచ్చ స్ట్రిప్ ఉన్నా, మహాత్మాగాంధీకి దగ్గరగా ఆకుపచ్చ స్ట్రిప్ ఉన్నా చెల్లుబాటు అవుతాయని నిశ్చింతగా తీసుకోవచ్చని తెలిపింది. రెండు రకాల నోట్లు ఫేక్ వి కాదని చెప్పింది. ఒకదానికొకటి భిన్నంగా కనిపించడానికి ప్రభుత్వం వైపు నుండి ఉద్దేశపూర్వక ప్రయత్నం లేదని.. వాటి విలువల్లో ఎటువంటి తేడా లేదని స్పష్టం చేసింది.

కాబట్టి ఇలాంటి వదంతులను నమ్మకండి. 500 రూపాయల నోటులో గాంధీకి దగ్గరగా గ్రీన్ కలర్ స్ట్రిప్ ఉంటే ఫేక్ నోటు అనే పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Claim :  500 రూపాయల నోటులో గాంధీకి దగ్గరగా గ్రీన్ కలర్ స్ట్రిప్ ఉంటే తీసుకోకూడదా..?
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News