హస్తం పార్టీకి ఆమాత్రం తెలియదా?

Update: 2017-11-09 16:30 GMT

ప్రజల్లో నెలకొనే భావోద్వేగాలు చాలా ప్రభావం చూపుతాయి. రాజకీయపార్టీలకు బలమైన అస్త్రాలుగా ఉపయోగపడతాయి. ఆత్మగౌరవం మొదలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల వరకూ వీటిని వినియోగించుకుని రాజకీయలబ్ధి పొందని పార్టీలంటూ లేవు. నరేంద్రమోడీ ఈవిషయంలో అందరికంటే నాలుగాకులు ఎక్కువే చదివారు. ఇప్పటికే ఉన్న సెంటిమెంట్లను వాడుకోవడానికి తోడు కొత్తగా కొన్ని సెంటిమెంట్లను ప్రయోగించి మరీ ప్రజలను తనవైపు ఆకర్షిస్తుంటారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెసు మాత్రం ఇక్కడ వెనకబడి పోతోంది. నోట్ల రద్దు వంటి కీలకాంశంలో ప్రజలు తిరగబడకుండా వారిని మలచడంలో దేశభక్తి సెంటిమెంటును రగిలించారు మోడీ. నల్లధనంతో ఎందరో కుబేరులైపోతున్నారు. వారిక రేపట్నుంచి బికారులై రోడ్డున పడిపోతారన్నట్లుగా పిక్చర్ ఇచ్చారు. తమ దరిద్రానికి ఎవరు కారణమో తెలిసి పోయింది. అది ధనవంతులే. అన్న భ్రాంతికి లోనైన కోట్లమంది పేద,మధ్యతరగతి ప్రజానీకం నోట్ల రద్దుతో ఎన్నికష్టాలెదురైనా రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేయలేదు. కూలి దొరకని కష్టాలను,చిల్లర దొరకని చికాకులను, గంటలతరబడి క్యూలైన్ల వెతలను గుండెల్లోనే దాచుకున్నారు. ప్రధానికి మద్దతుగా నిలిచారు. విదేశాల్లో లక్షల కోట్ల నల్లధనం మూలుగుతోంది. మేం అధికారంలోకి వస్తే ఒక్కొక్క పేదవాని ఖాతాలో పదిహేనులక్షల రూపాయలు వెయ్యగలం. అన్న హామీని నమ్మి బీజేపీని గద్దెనెక్కించారు. దేశంలో నల్లధనానికి చెక్ పెట్టేస్తున్నామంటే మళ్లీ మరోసారి భ్రమ పడి డబ్బుల్లేని బాధలను పంటిబిగువున ఓర్చుకున్నారు. తన మాటలు,సంకేతాలు, సందేశాల ద్వారా దేశ ప్రజల విశ్వాసాన్ని పొందడంలో మోడీ ది ఆరితేరిన నైపుణ్యం. ప్రజల సెంటిమెంటును, బలంగా పాతుకుపోయిన అసంతృప్తిని తన లక్ష్యాలకు అనుగుణంగా మలచుకోవడంలో ప్రధాని దిట్ట. అదే సమయంలో ప్రధానప్రతిపక్షం కాంగ్రెసు మాత్రం యాంటీ సెంటిమెంటుతో వెళుతూ ప్రజలకు దూరమవుతోంది. నాయకులను అదుపు చేయలేని నిస్సహాయతలో నానాటికీ అస్తిత్వాన్ని కోల్పోతోంది. చేతికి అందివచ్చిన అస్త్రాలను కూడా వినియోగించుకోవడం చేతకాక చతికిలపడుతోంది.

మన్మోహన్.. చైనా దిగుమతులు....

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. మాటల చాణక్యం, ప్రజల భావోద్వేగాలతో రాజకీయ విన్యాసాలు సాగించగల మోడీని అవే అస్త్రాలతో ఎదుర్కోవాలి. పట్టు చిక్కినప్పుడు ఊపిరిసలపకుండా దాడి చేయాలి. కానీ కాంగ్రెసుకు ఆ విద్య తెలియడం లేదు. నోట్ల రద్దు ఏడాది సందర్బంగా తూతూ మంత్రంగా బ్లాక్ డే నిర్వహించారు. అయిపోయిందనిపించారు. ప్రజల్లో ఎటువంటి స్పందనను రేకెత్తించలేకపోయారు. ఈవిషయంలో కొంతలో కొంత మీడియానే ప్రతిపక్ష పాత్ర పోషించింది. భిన్నవర్గాలను ఆహ్వానించి చర్చలు జరపడం ద్వారా డీమోనిటైజేషన్ వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదన్న భావన ప్రజల్లోకి వెళ్లడానికి దోహదం చేసింది. కానీ ప్రధానప్రతిపక్షం అట్టర్ ప్లాఫ్. దేశ ఆర్థిక రంగాన్ని మలుపుతిప్పిన మేధావి మన్మోహన్ సింగ్ చాలా కీలకమైన సమాచారాన్ని కాంగ్రెసు పార్టీకి అందచేశారు. కమ్యూనికేషన్ లో ఆయన సమర్థవక్త కాకపోవడం వల్ల ప్రధాని స్థాయిలో దానిని ప్రజలకు చేరవేయలేకపోయారు. కాంగ్రెసులోని కీలకనేతలు, అధికారప్రతినిధులు కూడా దానిని అందిపుచ్చుకోలేకపోయారు. డీమోనిటైజేషన్ ను తొలినుంచీ మన్మోహన్ వ్యతిరేకిస్తున్నారు. ఆయన పూర్తిస్థాయి రాజకీయవేత్త కాదు. దేశానికి మేలు జరుగుతుందంటే రాజకీయాలకు అతీతంగా స్పందిస్తారు. లేదంటే మౌనం వహిస్తారు. కానీ వ్యతిరేకంగా మాట్లాడరు. ఈ విషయంలో మన్మోహన్ చిత్తశుద్దిని దేశప్రజలు కూడా విశ్వసిస్తారు. నోట్ల రద్దుతో జీడీపీ రెండుశాతం మేరకు పడిపోతుందని ఆయన వేసిన అంచనా అక్షరాలా నిజమైంది. రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేరకు ఆర్థికవ్యవస్థకు నష్టం వాటిల్లింది. అసంఘటిత రంగంలోని కోట్లాదిమంది ఉపాధి కోల్పోయారు. రిజర్వు బ్యాంకు వంటి వ్యవస్థలు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారి తమ విశ్వసనీయతను కోల్పోయాయి. ఇవన్నీ సామాన్యునికి పెద్దగా పట్టని విషయాలు కానీ రాజకీయాస్త్రంగా పనికొచ్చే పనిముట్టును కూడా మన్మోహన్ అందించారు. చైనా నుంచి ఆరునెలల కాలంలో 23 శాతం దిగుమతులు పెరిగాయి. వీటివిలువ 2.4 లక్షల కోట్లకు పెరిగింది. పరిశ్రమలు మూతపడి దేశీయంగా కోట్లమంది రోడ్డున పడితే, అదే సమయంలో దీనిని అవకాశంగా మలచుకుని భారత దుస్సాహసాన్ని చైనా తన అవకాశంగా మలచుకుంది. ఈ వివరాలను ప్రభుత్వ అధికారిక నివేదికలను ఉటంకిస్తూ మన్మోహన్ సింగ్ బయటపెట్టారు.

బాజపాకు గుబులు రేపే ..బ్రహ్మాస్త్రం

పాకిస్తాన్ బూచిని చూపించి, చైనా డ్రాగన్ కదలికలను పెద్దవి చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందడం బీజేపీకి బాగా తెలుసు. మతపరమైన భావనలకు తోడు దాయాదుల పట్ల అసహన భావనలను నూరిపోయడంలోనూ బీజేపీ సందర్భోచితంగా, సమయోచితంగా వ్యవహరిస్తుంటుంది. సహజంగానే ప్రజల్లో నేను, నాదేశము అన్న భావోద్వేగం ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే దేశాన్ని , ప్రజలను ఏకతాటిపై నడపడానికి ఇటువంటి భావనలు ఉపయోగపడతాయి. చైనా విషయంలోనూ ప్రజలు ఇదే విధంగా స్పందిస్తుంటారు. ఇప్పటికే మూడు సార్లు యుద్ధం చేసిన పాకిస్థాన్ పై ఒంటికాలిపై లేవని భారతీయుడు ఉండడు. అయినప్పటికీ జమ్ముకాశ్మీర్ విషయంలో పాక్ పాత్ర తెలిసి కూడా చిదంబరం వంటి సీనియర్ నాయకులు వేర్పాటువాదానికి మద్దతుగా మాట్టాడి కాంగ్రెసు పార్టీకి తీవ్రమైన డ్యామేజీ తెచ్చిపెట్టారు. పరిపాలించడం తెలియక, శాంతిభద్రతలను పరిరక్షించలేక సతమతమవుతున్న పీడీపీ,బీజేపీ ప్రబుత్వానికి రాజకీయాస్త్రాన్నిచ్చారు. కేవలం బీజేపీనే కాకుండా దేశమంతా చిదంబరం ధోరణిని దుయ్యబట్టారు. రాష్ట్రప్రభుత్వం రాజకీయంగా సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. ప్రజల ఆలోచనలు, భావనలకు వ్యతిరేకంగా మాట్లాడేంతటి మూర్ఖపు స్వేచ్ఛ కాంగ్రెసు నాయకులకు తప్ప మరెవరికీ ఉండదు. గతంలో 1962లో నెహ్రూ హయాంలో చైనా నుంచి దేశానికి జరిగిన నష్టానికి కాంగ్రెసు పార్టీయే కారణమని బలంగా నమ్ముతుంటారు దేశ ప్రజలు. ఇటీవల డోక్లాం లోనూ చైనా దూకుడు మనమెరిగిందే. మోడీ నోట్ల రద్దు చర్య చైనాకు భారీగా లాభించిందంటే దేశప్రజలు ఒక రకంగా తట్టుకోలేరు. నిజానికి నోట్లరద్దుతో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలకంటే కూడా ఈ సెంటిమెంటే బీజేపీకి వ్యతిరేకంగా బలంగా పనిచేస్తుంది. మోడీ ప్రభుత్వానికి ఉద్దేశాలను ఆపాదించే రాజకీయ బ్రహ్మాస్ర్తంగా దీనిని వినియోగించుకుని ఉండవచ్చు. కానీ కాంగ్రెసు నాయకులెవరూ అసలు ఈ అంశాన్నే గుర్తించినట్లు లేరు. మోడీ ఏదైనా చెబితే దానిని మిషనరీ జీల్ తో ప్రజల్లోకి తీసుకెళ్లాయి సంఘ్ పరివార్ శక్తులు. పదేళ్లు ప్రధానిగా చేసిన వ్యక్తి ఇచ్చిన సాధికార సమాచారం కూడా ప్రచారానికి నోచుకోకపోవడం ప్రధానప్రతిపక్షం దౌర్భాగ్యం. అధికారపక్షానికి వరం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News