స్వతంత్రతకు చెల్లు చీటి...?

Update: 2018-01-15 16:30 GMT

సుప్రీం కోర్టులో చోటు చేసుకున్న పరిణామాలు సర్వోన్నత న్యాయస్థానం స్వతంత్రతపై ప్రభావం చూపుతాయని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందుచూపుతో మనదేశ న్యాయవ్యవస్థకు కీలకమైన బాధ్యతలు అప్పగించారు. అధికారం కోసం వెంపర్లాడే రాజకీయపార్టీలు కొన్ని సందర్బాల్లో దేశంలో ఘర్షణలకు, విచ్ఛిన్నానికి కూడా పూనుకోవచ్చనే భావనతో సుప్రీంకోర్టుకు విస్తృతమైన అధికారాలను అప్పగించారు. కుల,మత,ప్రాంత విభేదాలను రాజకీయ వ్యవస్థలు సృష్టిస్తుంటాయి. తాత్కాలికంగా ఒక ఎన్నిక గెలుపుకోసం దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసే విషయంలోనూ వెనకాడవు. వీటిని నియంత్రించి అదుపు చేసే బాధ్యత సుప్రీం కోర్టుదే. భారీ మెజార్టీతో గెలుపు సాధించే కార్యనిర్వాహక వర్గాలు విచ్చలవిడిగా రెచ్చిపోయి నిర్ణయాలు తీసుకోకుండా బ్రేకులు వేసే అధికారం కూడా సుప్రీంకు అప్పగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సుప్రీం కోర్టులు, హైకోర్టులు తోసిపుచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చట్టాలను సైతం కొట్టేసిన ఉదంతాలకూ కొదవ లేదు. ప్రజాస్వామ్యంలో చట్టసభలు తీసుకున్న నిర్ణయాలను న్యాయస్థానాలు తోసిపుచ్చడం సమంజసం కాదేమోనన్న చర్చలు కూడా గతంలో జరిగాయి. అధికారమే పరమావధిగా కొనసాగే ప్రభుత్వాలు, పార్టీలు వివిధ వర్గాల ఒత్తిడికి గురై నిర్ణయాలు తీసుకుంటుంటాయి. అటువంటి సందర్బాల్లో దేశమౌలిక స్వరూపం, సమగ్రత, స్వేచ్ఛ, సహజన్యాయాలకు భంగం వాటిల్లకుండా బృహత్తర కర్తవ్యం నిర్వహిస్తుంటాయి న్యాయస్థానాలు. ప్రజల నుంచి ఎన్నిక కాకపోయినప్పటికీ రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి కాలమానపరిస్థితులకు వర్తించే న్యాయసూత్రాలను ప్రాతిపదికగా చేసుకుని తీర్పులు చెబుతుంటారు. దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రం మధ్య విభేదాలు , వివాదాలు అనేకం చోటు చేసుకుంటున్నప్పటికీ అంతర్గత సంఘర్షణ ఏర్పడకుండా రక్షణ కవచంగా సుప్రీం కోర్టు పనిచేస్తుందని చెప్పవచ్చు. అందుకే ఈ వ్యవస్థ కు ఒక పవిత్రత ఆపాదించారు. విభేదాలు, కుమ్ములాటలు బయటకు వస్తే ఇతర వ్యవస్థల మాదిరిగానే తూష్ణీభావానికి గురికాకతప్పకపోవచ్చు. రాన్రానూ స్వతంత్ర ప్రతిపత్తి కూడా ప్రశ్నార్థకం కావచ్చు.

కొలీజియంపై కత్తి....

సుప్రీం కోర్టు కొలీజియం పై దాదాపు అన్ని పార్టీలు కత్తి కట్టి కూర్చున్నాయి. బీజేపీ కావొచ్చు. కాంగ్రెసు కావొచ్చు. హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జిల నియామకాలు, బదిలీలు, పదోన్నతులు అన్నీ కొలీజియం చేతిలోనే ఉన్నాయి. చిట్టాను సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం ఖరారు చేసుకున్న తర్వాత కేంద్రం, రాష్ట్రాలతో సంప్రతింపులు జరుపుతుంది. కానీ ప్రభుత్వాల మాటకు పెద్దగా విలువ లేదు. కొలీజియం అనుకున్నదే ఫైనల్. దీంతో న్యాయమూర్తుల నియామకాల్లో దేశాన్నేలుతున్న తమ మాట చెల్లుబాటు కావడం లేదనే దుగ్ధతో రాజకీయ పక్షాలు రగిలిపోతున్నాయి. ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో సైతం లేని స్వేచ్ఛను మనదేశంలో సుప్రీంకోర్టు అనుభవిస్తోంది. దీనికి కొర్రీ వేసి తమ మాట నెగ్గించుకోవాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ సుప్రీం కోర్టు సంఘటితం గా ఉండటం వల్ల ప్రభుత్వాల ఆటలు చెల్లుబాటు కావడం లేదు. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ నియామకాన్ని తోసిపుచ్చడంలోనూ ఈ సంఘీభావం ప్రదర్శితమైంది. పరిపాలన, కేసుల విషయంలో సుప్రీం సీనియర్లు రెండుగా చీలి, విభేదాలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో కొలీజియంపై మరోసారి ప్రభుత్వ కత్తి వేలాడుతున్నట్లేనంటున్నారు న్యాయనిపుణులు.

పదోన్నతుల్లో భంగపాట్లు...

న్యాయమూర్తులు లేవనెత్తిన అభ్యంతరాలు వాస్తవమైనవేనని దేశంలోని మెజార్టీ న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వారు లేవనెత్తిన తీరు, వేదిక అంశాలపైనే కొందరిలో అభ్యంతరాలున్నాయి. అంటే సుప్రీం పనితీరులో లోపాలున్నట్లుగా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా ఈ తీరుపై అసంత్రుప్తి న్యాయమూర్తుల్లో రగులుతున్నప్పటికీ బయటికి చెప్పేందుకు ఎవరూ సాహసించలేదు. చీఫ్ జస్టిస్ తర్వాత సీనియర్ మోస్టు న్యాయమూర్తిగా ఉన్న చలమేశ్వర్ కే అన్యాయం జరిగిందన్న వాదన ఉంది. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడాన్ని కొలీజియం గతంలో తొక్కిపట్టడంతో కొంత ఆలస్యంగా ఆయన సుప్రీంకు రావాల్సి వచ్చింది. అందువల్లనే చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశాన్ని కూడా కోల్పోయారంటారు. లేకపోతే ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా కంటే ముందుగా చలమేశ్వర్ కు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం దక్కేదట. అంటే కొలీజియం నిర్ణయాల్లో వివక్ష కొనసాగుతున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. అందుకే ఈ వ్యవస్థపై చలమేశ్వర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో కొలీజియం నిర్ణయాలను బహిర్గత పరిచేందుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. పారదర్శకత లేకపోవడం, ప్రశ్నించే అథారిటీ కూడా లేకపోవడంతో సామర్థ్యం, అర్హత కలిగిన అనేకమంది న్యాయమూర్తులు హైకోర్టు చీఫ్ జస్టిస్ లు కాకుండానే పదవీ విరమణ చేయాల్సి న సందర్భాలు, సుప్రీం కోర్టుకు రాకుండానే పదవీ కాలం ముగిసిన సందర్భాలు ఉన్నాయనేది న్యాయనిపుణుల మాట. ఇటువంటి ఉదంతాలు అనేకం చోటు చేసుకున్న కారణంగానే న్యాయవ్యవస్థ ఏకమొత్తంగా కొలీజియం లోపాలను వేలెత్తి చూపుతోంది. చీఫ్ జస్టిస్ కు నిరంకుశ అధికారాలు తగవనే వాదనకూ మద్దతు లభిస్తోంది.

రాజ్యం రంగ ప్రవేశం...

రాజ్యం నిరంకుశమైనది. సామూహిక హింస, అణచివేతలతో అయినా సరే అధికారాన్ని కాపాడుకుంటుంది. అన్నివ్యవస్థలపైనా పెత్తనం చెలాయించాలని చూస్తుంది. అందుకే ప్రజాస్వామ్య దేశాల్లో రాజ్యం అధికారాలను భాగాలుగా చేసి చెక్స్ అండ్ బ్యాలెన్స్ తరహాలో మూడు నాలుగు వ్యవస్థలకు అప్పగించడం జరుగుతుంది. ఒకదానిపై మరొక వ్యవస్థ నిఘా, నిలదీత ఉంటుంది. ప్రభుత్వం, పార్లమెంటు, సుప్రీం కోర్టు ఈ తరహాలో అధికార విభజనతో కూడిన రాజ్యాంగ వ్యవస్థలు. నేరుగా ప్రజలతో డీల్ చేసే ప్రభుత్వం, పార్లమెంటు అనేక రకాల ఒత్తిడులకు గురవుతూ ఉంటాయి. వీటన్నిటికీ అతీతంగా రుజుమార్గంలో రాజ్యాంగ ప్రమాణం, దేశయోగక్షేమాలే ప్రాతిపదికగా వ్యవహరించేందుకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది సుప్రీం కోర్టుకు. వ్యక్తులు, వ్యవస్థలు, ప్రభుత్వం ఏ రకమైన ఒత్తిడికి పాల్పడినా కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకొనే అధికారాలు కూడా ఉన్నాయి. రాజ్యానికి ప్రతినిధిగా వ్యవహరించే ప్రభుత్వం ఏమాత్రం అవకాశం దొరికినా మిగిలిన వ్యవస్థలను కబళించి వేసేందుకు ప్రయత్నిస్తుంది. బలమైన నాయకత్వం ఉన్న సందర్భాల్లో పార్లమెంటును గుప్పెట్లో పెట్టుకొని ఆడింది ఆటగా చెలామణి చేస్తుంది సర్కారు. మోడీ, అమిత్ షా ల ల సారథ్యంలోని బీజేపీ విస్తృతమైన, విశృంఖలమైన అధికారాలతో కూడిన నాయకత్వంగా మారింది. మోడీ చెప్పిందే శాసనమన్నట్లుగా మారింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సుప్రీం లోని లొసుగులను కేంద్రం దొరకబుచ్చుకుని న్యాయవ్యవస్థలో రాజ్యాంగపరమైన మార్పులకు పూనుకొనే ప్రమాదం పొంచి ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు న్యాయకోవిదులు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News