సౌరాష్ట్రలో కమలానికి కష్టకాలమే...!

Update: 2017-11-30 16:30 GMT

సౌరాష్ట్ర... గుజరాత్ కు పశ్చిమాన గల ఈ ప్రాంతం కరువుకు మారుపేరు. అరేబియా సముద్రతీరాన, పాకిస్థాన్ సరిహద్దుల్లో భౌగోళికంగా ఇది ఉంది. 11 జిల్లాలు, 48 అసెంబ్లీ నియోజకవర్గాలు గల ఈ ప్రాంతంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారాన్ని మోతెక్కిస్తున్నారు. పరస్పర విమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ప్రధానమైన సోమనాధ్ దేవాలయం ఇక్కడే ఉంది. అరేబియా సముద్ర తీరాన అలరారుతున్న ఈ ఆలయాన్ని రాహుల్ సందర్శించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గత మూడేళ్లుగా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోసం ఉద్యమం చేస్తున్న పాటీదార్ల ప్రాబల్యం ఈ ప్రాంతంలో స్పష్టంగా కన్పిస్తుంది. మరోవైపు బీజేపీ హిందుత్వ వాదానికి కూడా ఈ ప్రాంతం పుట్టినిల్లు. మోడీ అభిమానులు, వ్యతిరేకులూ ఇక్కడ ఉన్నారు. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ ప్రాంతంలోని రాజ్ కోట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంతో రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రనిల్ రాజ్ గురు ఆయనను ఢీకొంటున్నారు. రాజగురు సంపన్నుడు. తన అఫడవిట్ లో వంద కోట్లకు పైగా ఆస్తులను చూపించారు.

గత ఎన్నికల్లో విజయం సాధించినా....

ఆమ్రేలి, భావ్ నగర్, జామ్ నగర్, జునాఘడ్, మోర్జీ, ద్వారక, సురేంద్రనగర్, బోటడ్, పోర్ బందర్, గిరిసోమ్ నాధ్, రాజ్ కోట్ జిల్లాలు గల ఈ ప్రాంతంలో 48 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో ఈ 48 నియోజకవర్గాల్లో బీజేపీ 32 స్థానాల్లో గెలుచుకుంది. 13 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. గుజరాత్ పరివర్తన్ పార్టీ రెండు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒకస్థానాన్ని కైవసం చేసుకున్నాయి. పాటీదార్ల ప్రాబల్యం ఈ ప్రాంతంలో ఎక్కువ. వీరిలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో పాటీదార్లు 12 శాతం ఉండవచ్చని అంచనా. హార్థిక్ పటేల్ రిజర్వేషన్ల ఆందోళనల నేపథ్యంలో బీజేపీ ఒకింత సంకట పరిస్థితిని ఎదుర్కొంటోందని రాజకీయ విశ్లేషకుల అంచనా. అందుకేపాటీదార్లూ ఎక్కువగా ఉన్న మోర్బీలో మోడీ రెండో దశ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గత ఎన్నికల్లో పాటీదార్లు మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ ఆధ్వర్యంలోని గుజరాత్ పరివర్తన్ పార్టీకి మద్దతు తెలిపినా బీజేపీ ఘన విజయం సాధించడం విశేషం. హార్థిక్ పటేల్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడం, జీఎస్టీ, నోట్ల రద్దు నేపథ్యంలో కాంగ్రెస్ తన విజయావకాశాలు మెరుగుపడ్డాయని భావిస్తోంది. అందుకే రాహుల్ ఈ ప్రాంతంపై దృష్టి కేంద్రీకరించి తరచూ పర్యటనలు చేస్తున్నారు.

ఇక్కడ అనేక ఆందోళనలు...

2012 నాటి కన్నా బీజేపీ సౌరాష్ట్రలో ఒకింత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న మాట వాస్తవం. పాటీదార్ల ఆందోళనతో పాటు, రైతుల ఆందోళన, నర్మదా జలాలు బీజేపీకి ప్రతికూలంగా మారాయన్న వాదన వినబడుతోంది. పాటీ దార్ల ఆందోళన పాతవిషయమే అయినప్పటికీ మిగిలిన అంశాలు బీజేపీని ఇరకాటంలో పెడుతున్నాయి. పత్తి, వేరుశెనగ రైతులు గిట్టుబాటు ధరలు లేక ఆందోళన చెందుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే 20 కిలోల వేరెశెనగ బస్తాకు రూ.900 ల ధరను ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఏ మాత్రం సరిపోదని రైతులు భావిస్తున్నారు. గత ఏడాది ధర రూ.844లు ఉండేదని, ప్రస్తుతం పెరిగింది 56 రూపాయలు మాత్రమేనని, ఇది తమకు గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. ఇక పత్తిరైతుల పరిస్థితి సరేసరి. వీరికి ఏనాడూ సరైన ధర లభించలేదు. ఇక ఇదే ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజకీయంగా శక్తిమంతుడు కాదు. ప్రజల్లో ఆయనకున్న పట్టు పరిమితమే. పూర్తిగా కేంద్ర నాయకత్వంపైనే ఆయన ఆధారపడుతున్నారు.

నర్మదా జలాలు.....

నర్మదా జలాలు కూడా బీజేపీకి తలనొప్పిగా మారాయి. నర్మదా ప్రాజెక్టుకు సంబంధించిన కాల్వలు, ఉప కాల్వల పనులు అసంపూర్తిగా ఉండటంతో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ నర్మదా జలాల ప్రస్తావన వస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆ కల సాకారం కాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లోని మూడువేల గ్రామాలకు తాగునీరు, 18.45 హెక్టార్లకు సాగునీరు అందించాల్సి ఉంది. సరైన డిజైన లేకపోవడం తదితర కారణాల వల్ల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో తమ సమస్యలను పరిష్కరించలేకపోతుందని భావ్ నగర్, సురేంద్ర నగర్, బొటాడ్ ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ అంశం రాజీకీయంగా ప్రభావితం చేస్తుందేమోనని బీజేపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 2015లో జరిగిన జిల్లా, బ్లాక్ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోయింది. పార్టీ సంస్థాగతంగా ఇక్కడ బలంగా ఉన్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలన్న ఆందోళన బీజేపీలో నెలకొంది. మొత్తానికి 2012 నాటి పరిస్థితి సౌరాష్ట్ర ప్రాంతంలో బీజేపీకి లేదన్నది వాస్తవం.

 

-గుజరాత్ నుంచి ‘తెలుగుపోస్ట్’ ప్రత్యేక ప్రతినిధి

Similar News