సోనియా మోడల్ పాలిటిక్స్

Update: 2017-12-20 16:30 GMT

పాశ్చాత్య సంస్కృతిలో పుట్టి పెరిగిన సోనియా, భారతదేశంలో అడుగు పెట్టి ఈ సంస్కృతిలో, భావోద్వేగాల్లో, భవబంధాల్లో భాగమయ్యారు. పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలచుకోవడం ఆమెకు అప్పుడే అలవాటైంది. సాధారణంగా చిన్నవయసులో వివాహం చేసుకున్న మహిళలు సంతానం పొందడంపై తొలిదశలో పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఒకసారి తల్లయ్యాక ఆ పిల్లల ఆలనపాలన చూడటంలోనూ , వారి కోసమే తమ సర్వస్వం అర్పించడంలోనూ అమ్మతనం నిండుగా ఆస్వాదిస్తారు. అదే తన జీవితానికి, రాజకీయాలకు కూడా అనువర్తింప చేసుకున్నారు సోనియా. తన కళ్లెదుటే అత్తమ్మను,భర్తను కోల్పోవలసి రావడంతో తొలుత రాజకీయాలపై కొంత ఏవగింపు కలిగి ఉండేవారు. తప్పనిసరి స్థితిలో పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత దానిని పొదవి పట్టుకున్నారు. అమ్మలాగే ఆలించారు. లాలించారు. అక్కున చేర్చుకుని ఆదరించారు. పార్టీతోనే కష్టం సుఖం పంచుకున్నారు. ఇందిరకు, సోనియాకు ఈ విషయంలో ఒక తేడా ఉంది. ఇందిర చిన్ననాటి నుంచి పార్టీ పొత్తిళ్లలో ఎదుగుతూ వచ్చారు. కానీ పార్టీ మొఖమే తెలియని సోనియా చెంతకే కాంగ్రెసు వచ్చి చేరింది. దానిని కాపాడి తర్వాత తరానికి అందచేయాల్సిన బాధ్యతను ఆమె స్వీకరించారు.

పార్టీకి సై.. ప్రభుత్వానికి జై

అధిష్ఠానం నిర్ణయాలకు, ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సాధారణంగా కుటుంబస్వామ్యపార్టీల్లోనూ, ప్రాంతీయపార్టీల్లోనూ మనుగడ కష్టం. అధినేతలు సహించరు. ఈవిషయంలో కాంగ్రెసు కూడా మినహాయింపు కాదు. ఇందిర, సంజయ్, రాజీవ్ లు ఈ ధోరణిని పెంచిపోషించారు. సోనియా ఈ తరహా వైఖరికి వీడ్కోలు పలికారు. ప్రజాస్వామ్య పద్ధతికి పెద్ద పీట వేశారు. జాతీయ సలహా మండలి రూపంలో కేంద్రప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నప్పటికీ తన మాటే నెగ్గాలని ఏనాడూ భావించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకసారి అధికార పీఠం పై కూర్చోబెట్టిన తర్వాత వారి పనిని వారే చేసుకొనేలా ప్రోత్సహించాలనేది ఆమె పద్ధతి. తెలుగు రాష్ట్రాలనే ఆమె నిర్ణయాలకు నిదర్శనగా చెప్పుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీని ధిక్కరించారు. అనుచరులను రెచ్చగొట్టారు. పార్టీకి పరువు నష్టం తెచ్చిపెట్టారు. అయినా అతనిపై చర్యలు తీసుకోలేదు. కనీసం నియంత్రించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇందిర,రాజీవ్ ల హయాంలో అయితే ఇంతటి స్వేచ్ఛను కనీసం ఊహించడం కూడా సాధ్యంకాదు. ఎవరి ప్రాంతీయ ప్రయోజనాలకు అనుకూలంగా వారు వ్యవహరిస్తారనే నిజాన్ని గ్రహించండంతో ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాల నాయకులకు సోనియా స్వేచ్ఛ ఇచ్చారు. అదే ఇందిర అయితే పార్టీని కాదన్నందుకు సీఎం ను తక్షణం మార్చేసి ఉండేవారు. సీఎం పీఠం దిగిన తర్వాత రోశయ్య అందించిన సేవలకు గుర్తింపుగా గవర్నర్ గిరీ కట్టబెట్టారు. పార్టీకి సేవ చేసిన వారిని కాపాడుకోవటంతోపాటు వారికి ఉజ్వల భవిష్యత్తు అందించాలనే తపన సోనియా ప్రతి మాటలోనూ, నిర్ణయంలోనూ తొంగి చూసేదని సన్నిహితులు చెబుతుంటారు. ప్రభుత్వాధికారానికి, పార్టీకి మధ్య సున్నితమైన బాలెన్సు పాటిస్తూ కాంగ్రెసులో కొంత ప్రజాస్వామిక వాతావరణం నెలకొనేందుకు సోనియా దోహదం చేశారని చెబుతారు. రాజకీయ నిర్ణయాలు మినహాయించి పాలన పరమైన విషయాల్లో మన్మోహన్ సింగ్ కు సోనియా సంపూర్ణ స్వేచ్ఛ కల్పించారని కూడా ప్రభుత్వంలో కేబినెట్ మంత్రులు చెప్పేవారు. ఆయన మాటకు విలువ ఇవ్వడమే కాదు, సీపీఎం వంటి ప్రధాన మద్దతు దారు దూరమవుతున్నప్పటికీ యూఎస్ సంబంధాల విషయంలో మన్మోహన్ మాటకే విలువ నివ్వడం సోనియా చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పుకోవాలి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడకుండా దేశ ప్రయోజనాల కోణంలోనే ఆలోచించారు. రాజకీయ సంక్షోభానికి వెరవక ప్రదానికి బాసటగా నిలవడం సోనియా నాయకత్వ పటిమకు నగిషీలు అద్దింది.

కంట్రోల్ ..కన్సోల్ ...

క్రమశిక్షణ కట్టుతప్పుతున్న స్థితి ఏర్పడితే నియంత్రించే విషయంలో సోనియాగాంధీ కఠినంగానే వ్యవహరించేవారు. విలాస్ రావ్ దేశ్ ముఖ్ వంటి బలమైన ముఖ్యమంత్రులను మార్చాల్సి వచ్చినప్పుడు సోనియా వెనకంజ వేయలేదు. విధాన పరమైన అంశాల్లో మమతా బెనర్జీ వంటి ప్రజాదరణ కలిగిన నాయకుల విషయంలోనూ ఇదే పంథాను అనుసరించారు. డీఎంకే విశ్వాసపాత్రమైన మిత్రపక్షమే అయినప్పటికీ ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రులు, సాక్షాత్తు కరుణానిధి కుమార్తె కణిమొణి వంటివారు కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసి వారిని రక్షించేందుకు ప్రయత్నించిన ఉదంతాలు కూడా లేవు. అదే సమయంలో ఆయా పార్టీల నేతలతో సత్సంబంధాలను నెరిపేవారు. పరిపాలన పరమైన నిర్ణయాల విషయంలో యంత్రాంగానికి స్వేచ్ఛనివ్వడం ద్వారా విచ్చలవిడిగా మిత్రపక్షాలు రెచ్చిపోకుండా నియంత్రించారు. వ్యక్తిగత, రాజకీయ సంబంధాలను కాపాడుకొంటూ ప్రభుత్వాధికారాన్ని పరిరక్షించారు. ఈ తులనాత్మక వైఖరి కారణంగానే సంకీర్ణ ప్రభుత్వానికి తీవ్రమైన సంక్షోభాలు ఏర్పడకుండా బ్యాలెన్సు చేయగలిగారు.

మాటే శాసనం...

నిజానికి సోనియా గాంధీ నేటి రాజకీయాలకు భిన్నమైన శైలిని అవలంబించారనే చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రసమితితో పొత్తు కుదుర్చుకున్న 2004 ఎన్నికల్లో కరీంనగర్ బహిరంగ సభలో మీ ఆశలు నాకు తెలుసు అంటూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని నామమాత్రంగా ప్రస్తావించారామె. వై.ఎస్. హయాంలోనే తెలంగాణ ఏర్పాటు చేయాలని చూశారు. ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని నియమించారు. వై.ఎస్. వివిధకారణాలతో నివేదిక రాకుండా ఆపు చేయించగలిగారు. రాజకీయ సమీకరణలకు ప్రాధాన్యమిచ్చే ప్రణబ్ ముఖర్జీ సైతం తెలంగాణ అంశాన్ని అటకెక్కించేశారు. 2009 లో వై.ఎస్. మరణానంతరం కేసీఆర్ దీక్ష చేపట్టారు. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో ఆత్మాహుతులకు పాల్పడుతున్నారన్న వార్తల నేపథ్యంలో పట్టుబట్టి మరీ తానిచ్చిన మాటను నిలుపుకునే ప్రయత్నం చేసి విజయం సాధించారు సోనియా. రాజకీయ కారణాలతో ఇందిర గాంధీ ఈ డిమాండును పక్కనపెట్టి రాష్ట్ర విభజనకు ఫుల్ స్టాప్ పెట్టిన విషయాన్ని అనేకమంది రాజకీయ నాయకులు ఆమెకు చెప్పి చూశారు. కాంగ్రెసు పార్టీపై పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని జ్ఞానబోధ చేశారు. అయినా వెనకడుగు వేయలేదు. మైనారిటీలో పడిన కేంద్రప్రభుత్వమే కుప్పకూలిపోతుందని యాగీ చేసినా లెక్క చేయలేదు. రాష్ట్ర ఏర్పాటు డిమాండును యూపీఏ మొదటి పాలనలో అటకెక్కించిన అదే ప్రణబ్ ముఖర్జీతో రాష్ట్రపతి హోదాలో సంతకం చేయించి తెలంగాణ కల సాకారం చేశారు. రాజకీయ నేతలు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తారు. రాజనీతిజ్ణులు వచ్చే తరం గురించి ఆలోచిస్తారంటారు. విశ్వసనీయత పార్టీకి, నాయకత్వానికి వన్నె తెస్తాయి. ఇందిర కోడలిగా ఇంటి నుంచి నేర్చుకున్న అమ్మతనం, పాశ్చాత్య సంస్కృతి లోని ప్రజాస్వామ్య విలువలు, చిన్ననాడే అలవరచుకున్న మధ్యతరగతి మానవీయ విలువల సమ్మేళనంగా 19 సంవత్సరాల పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెసుకు నేతృత్వం వహించి ..శభాష్ అనిపించుకున్నారు సోనియా. పారినర్ ప్రధాని పదవికి పనికి రాదని సన్నాయి నొక్కులు నొక్కిన నోళ్లే సాహో అంటూ జేజేలు పలికే విధంగా వీడ్కోలు తీసుకున్నారు. అధికారం అయస్కాంతం వంటిది. దాని ఆకర్షణ నుంచి దూరంగా ఉండటం సీజన్డ్ రాజకీయ వేత్తలకు సాధ్యం కాదు. అన్ సీజన్డ్ నేతగా ప్రవేశించి అన్నీ తానై అధినేత్రిగా అనుశాసించారు. దీర్ఘకాలం పార్టీ, ప్రభుత్వం కనుసన్నల్లో దాగి ఉన్నా.. యుక్తాయుక్త విచక్షణతో సంయమనం పాటించడమే ఆమె సక్సెస్. ఇదే సోనియా మోడల్ పాలిటిక్స్.

 

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News