సీమకు మరోసారి ఢోకా ఇచ్చారా...?

Update: 2018-01-15 13:30 GMT

పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజాస్వామ్య ప్రధాన లక్షణాల్లో ముఖ్యమైనవి. వీటి ద్వారా వివిధ ప్రాంతాల మధ్య సమతూకం పాటించవచ్చు. అభివృద్ధిలోప సమగ్రత ఏర్పడుతుంది. తద్వారా వివిధ ప్రాంతాల మధ్య సమభావన, సత్సంబంధాలు ఏర్పడతాయి. విభజిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిస్థితి లేదన్న అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. అభివృద్ధి అంతా ఒక ప్రాంతంలోనే కేంద్రీకృతమవుతోందన్న వాదన విన్పిస్తోంది. నూతన రాష్ట్రంలో అభివృద్ధి అంతా రాజధాని అమరావతి నగర పరిసరాల్లోనే కేంద్రీకృతమవుతుందన్నది కాదనలేని వాస్తవం. ఈ పరిస్థితి అభిలషణీయం కాదని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని తేలిగ్గా తోసిపుచ్చలేం.

హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం.....

తాజాగా ఏపీ హైకోర్టును ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతున్నప్పటీకీ అమరావతిలో కాకుండా మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న అభిప్రాయం వినపడుతోంది. రాయలసీమలోని ఏదో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించినట్లవుతుంది. తిరుపతి లేదా కర్నూలు ఇందుకు సరైన వేదికలు. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు కర్నూలును రాజధానిగా నిర్ణయించారు. అదే సమయంలో కోస్తా ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలైన రాయలసీమ, కోస్తా ప్రాంతాల మధ్య సమతూకం పాటించినట్లియింది. ఆనాటి హేతుబద్ధత ఇప్పుడు కొరవడింది. అనంతర కాలంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసి 1956 నవంబరు 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అయినప్పటికీ కొంతకాలం హైకోర్టు గుంటూరులోనే కొనసాగింది. తర్వాత కాలంలో హైకోర్టు కూడా హైదరాబాద్ కు మారింది.

వివిధ రాష్ట్రాలను పరిశీలిస్తే.....

ఇప్పుడు కూడా హైకోర్టును రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం అవుతుంది. రాజధానిలోనే హైకోర్టు ఉండాలన్న రాజ్యాంగ నిబంధన ఏమీ లేదు. పరిపాలన వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, వెసులుబాటు పాలకులకు ఉంటుంది. దేశంలో 29 రాష్ట్రాలకు గాను 24 హైకోర్టులు ఉన్నాయి. వీటిల్లో దాదాపు సగం హైకోర్టులు ఆయా రాష్ట్రాల రాజధానుల్లో కాకుండా వేరే ప్రాంతంలో పనిచేస్తుండటం గమనించదగ్గ అంశం. దేశంలోని సెంట్రల్ ప్రావిన్స్ లను విలీనం చేస్తూ స్వాతంత్ర్యానంతరం భోపాల్ రాజధానిగా మధ్యప్రదేశ్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ రాష్ట్ర హైకోర్టు జబల్ పూర్ కేంద్రంలోనే పనిచేస్తుంది. ఎటువంటి పరిపాలన పరమైన ఇబ్బందులు ఎదురు కాలేదు. 80 లోక్ సభ స్థానాలతో దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు సంబంధించి అలహాబాద్ కేంద్రంగా హైకోర్టు పనిచేస్తుంది. రాజధాని నగరం లక్నోలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేశఆరు. వాజ్ పేయి హయాంలో ఉత్తర ప్రదేశ్ నుంచి విడగొట్టి ఏర్పాటు చేసిన ఉత్తరాఖండ్ రాజధానిగా డెహ్రాడూన్, నైనిటాల్ కేంద్రంగా హైకోర్టులు పనిచేస్తున్నాయి. అప్పట్లోనే ఏర్పాటయిన మరో కొత్త రాష్ట్రం ఛత్తీస్ ఘడ్ రాజధాని నయా రాయపూర్ ను నిర్మించినప్పటికీ అక్కడ హైకోర్టు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ హైకోర్టు బిలాస్ పూర్ లోనే కొనసాగుతుంది. బ్రిటీష్ హయాంలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో మలయాళ భాష మాట్లాడే ప్రాంతంలో తిరువనంతపురం రాజధానిగా కేరళ రాష్ట్రం ఏర్పడింది. కాని హైకోర్టు కొచ్చిలోనే కొనసాగుతోంది. రాజుల సంస్థానాల విలీనంతో ఏర్పడిన రాజస్థాన్ రాజధానిగా జైపూర్ ను నిర్ణయించారు. కాని రాజస్థాన్ హైకోర్టు జోధ్ పూర్ కేంద్రంగా నేటికీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. మహారాష్ట్ర విభజన అనంతరం ఆవిర్భవించిన గుజరాత్ అనంతరం కాలంలో కొత్త రాజధానిగా గాంధీనగర్ ను నిర్మించుకుంది. అయినప్పటికీ రాష్ట్ర హైకోర్టు అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తుండటం గమనార్హం. ఒడిశాది కూడా ఇదే పరిస్థితి. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ అయినప్పటికీ కటక్ నగరంలోనే రాష్ట్ర హైకోర్టు పనిచేస్తోంది.

సీమ హక్కు అది.....

రాజధానులు, హైకోర్టులు వేర్వేరు నగరాల్లో పనిచేస్తున్నప్పటికీ ఆ యా రాష్ట్రాల్లో పాలనాపరంగా, న్యాయపాలన పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. కార్యకలాపాలు సజావుగా నడుస్తున్నాయి. విజవంతమైన ఈ ప్రక్రియను నూతన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అనుసరించడంలో అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ విశాల థృక్ఫధంతో వ్యవహరించి వాటిని అధిగమించాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రత్యేక సంస్కృతిగల నాలుగు జిల్లాల ప్రజల మనోభావాలను గౌరవించినట్లవుతుంది. చారిత్రకంగా పరిశీలించినట్లయితే ఇది సీమ ప్రజల హక్కు. ఎవరి దయాదాక్షిణ్యాలు ఉండక్కర్లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News