సీన్ రివర్స్ అయిందే

Update: 2018-03-02 15:30 GMT

చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు. తెలంగాణలో పార్టీ బతకాలంటే ఎవరో ఒకరితో అంటకాగాల్సిందే. పొత్తు అని పేరు పెట్టుకోవాలా? అవగాహన అనాలా? మైత్రీపూర్వక పోటీ అనాలా? పేరు ఏదైనా కావచ్చు. ఒక ప్రధానమైన పార్టీతో కలిసి నడవకతప్పదు. తాజాగా తెలంగాణ నేతలతో నిర్వహించిన కీలకమైన సమావేశంలో భవిష్యత్తు రాజకీయాలపై కీలకమైన వ్యాఖ్యలే చేశారు చంద్రబాబు నాయుడు. లోకేశ్, బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీయార్ వంటి తమ కుటుంబ సభ్యులు తెలంగాణలో టీడీపీని ముందుకు నడిపే ప్రసక్తి లేదని కూడా తేల్చేశారు. దీంతో టీటీడీపీ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉంటుందే తప్ప గతంలో మాదిరిగా అత్యంత ప్రభావశీలంగా పనిచేసే అవకాశాల్లేవని కూడా వాస్తవాల గుట్టు విప్పేశారు. ఇదే సీఎం 2014 లో చేసిన వ్యాఖ్యలకు ఇది పూర్తి విరుద్దం. తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తెచ్చిన తర్వాతనే తాను హైదరాబాదును విడిచిపెడతానని అప్పట్లో అనేక సందర్భాల్లో ప్రకటించారాయన. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. దానిని అధినాయకత్వం కూడా గుర్తించింది. అయితే కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఎవరితో జట్టు కట్టడం ద్వారా గరిష్ఠ ప్రయోజనాలు రాబట్టగలమన్నదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందున్న ప్రశ్న.

రేవంత్ రాం రాం చెప్పినప్పుడే...

చంద్రబాబునాయుడికి, లోకేశ్ కు అత్యంత సన్నిహితంగా మెలగుతూ అనతికాలంలోనే టీడీపీలో ఉన్నతస్థానానికి ఎదిగిన నేత రేవంత్ రెడ్డి. అదే స్పీడుతో పార్టీని, అధినేతను సైతం ఓటుకు నోటు కేసుతో ఇబ్బందులకు గురి చేసింది కూడా ఆయనే. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వ్యక్తిగతంగా తీవ్రంగా విభేదించే రేవంత్ ఫైర్ బ్రాండ్ గా టీడీపీ వర్గాల్లో గుర్తింపు పొందారు. కాంగ్రెసుతో పొత్తు కట్టడం ద్వారా టీఆర్ఎస్ ను అధికారం నుంచి దింపేయవచ్చనే దిశలో ఆయన పావులు కదిపారు. అనుభవజ్ణుడైన చంద్రబాబు నాయుడికి కాంగ్రెసు పార్టీతో వ్యక్తిగతంగా పెద్దగా విభేదాలేమీ లేవు. రాజకీయావసరాలను మాత్రమే ఆయన దృష్టిలో పెట్టుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రాష్ట్రవిభజనకు కారణమైన కాంగ్రెసు పట్ల తీవ్రమైన ద్వేషం, ఆగ్రహం కట్టలు కట్టుకుని ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ ప్రయోజనాల పేరిట హస్తంతో చేయి కలిపితే ఏపీలో టీడీపీ బోల్తా పడటం ఖాయం. అందుకే రేవంత్ రెడ్డి ఎంత ఒత్తిడి చేసినప్పటికీ చంద్రబాబు కాంగ్రెసు విషయంలో ససేమిరా అని చెప్పేశారు. కీలకమైన నాయకుడే అయినప్పటికీ రేవంత్ ను వదులుకోవడానికే సిద్దపడ్డారు. నిజానికి రేవంత్ కాంగ్రెసులోకి వెళ్లడానికి తొలుత సుముఖంగా లేరు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా టీడీపీలోనే హవా చెలాయించాలని భావించారు. ఇటు టీడీపీలోనూ, అటు కాంగ్రెసులోనూ తన మాట చెల్లుబాటవుతుందను కున్నారు. సముద్రంలాంటి కాంగ్రెసులో నెగ్గుకురావడం, తనదైన ప్రత్యేక ముద్ర వేసుకోవడం కష్టమని రేవంత్ కు తెలుసు. టీడీపీకి కాంగ్రెసుతో కలిసే యోచన లేదని అధినేత స్పష్టం చేసిన తర్వాతనే రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెసు తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ, కాంగ్రెసు కలిసే అవకాశం లేదని రేవంత్ నిష్క్రమణతోనే తేలిపోయింది.

మోత్కుపల్లి సూచనకు మోడిఫికేషన్...

ఉన్నది ఉన్నట్టుగా మొఖం మీద కొట్టినట్లు మాట్టాడే టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కొంచెం తొందరపడ్డారు. కానీ వాస్తవం అదే. తెలంగాణలో తెలుగుదేశం దిక్కులేని అనాథగా మారిపోయింది. అధినేత పట్టించుకోరు. నియోజకవర్గాల్లో ముందుండి నడిపే నాయకులు కరవైపోయారు. కార్యకర్తలు వేర్వేరు పార్టీలను వెదుక్కుంటున్నారు. అందుకే టీఆర్ఎస్ లో కలిపేస్తే బాగుంటుందని మనసులోని మాటను బయటపెట్టారు మోత్కుపల్లి. ఇదే జరిగితే చంద్రబాబు నాయుడు తెలంగాణపై తన ముద్రను పూర్తిగా వదిలేసుకున్నట్లవుతుంది. ఇక్కడికొస్తే పలకరించే నాథుడు కూడా ఉండడు. పైపెచ్చు ఇంత బ్రతుకూ బ్రతికి..ఇంతటి హీనస్థితా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. అందుకే గౌరవప్రదంగా , కనీస సీట్లను తెచ్చుకున్నప్పటికీ ఎవరో ఒకరితో కలిసి నడవడం ద్వారా పార్టీని బతికించుకోవాలని చంద్రబాబు సూచించారు. పార్టీని విలీనం చేసి పరువు పోగొట్టుకోకుండా, అదే సమయంలో ఒంటరిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలవకుండా మధ్యేమార్గంగా పొత్తు ఆలోచనను బయట పెట్టారు. ఒక రకంగా చూస్తే మోత్కుపల్లి చేసిన సూచనకు దీనిని దిద్దుబాటుగా చూడాల్సి ఉంటుంది.

కామన్ ఎనిమీస్...

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెసు పార్టీ ప్రస్తుతానికి బద్ధశత్రువు. అధికారపక్షమైన టీడీపీ కూడా కాంగ్రెసు ను ఆ రకంగానే చూడాల్సిన రాజకీయ అవసరం. విభజనచట్టంలో ఇచ్చిన హామీలను మూలన పెడుతున్న బీజేపీని కూడా విరోధిగానే చూడాల్సిన తప్పనిసరి పరిస్థితి. ఈరకంగా టీడీపీకి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెసులు రెండూ వైరిపక్షాలుగానే మారుతున్నాయి. ఇటు తెలంగాణలో కాంగ్రెసు పార్టీ బలం పుంజుకొంటోంది. తెలంగాణ ఆవిర్బావానికి తామే కారణమంటూ టీఆర్ఎస్ కు సవాల్ విసురుతోంది. దీంతో సహజంగానే టీఆర్ఎస్ ప్రధాన శత్రువుగా చూస్తోంది. మతపరమైన అజెండాతో బీజేపీ ఓట్ల సమీకరణకు పాల్పడుతుందేమోననే అనుమానంతో బీజేపీని సందేహాస్పదంగా చూస్తోంది టీఆర్ఎస్. బీజేపీపై సిద్ధాంతపరంగా , రాష్ట్రప్రయోజనాల రీత్యా దాడి చేయకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన కేసీఆర్ ఆ దిశలోనే కదులుతున్నారు. దీంతో తెలుగు ముఖ్యమంత్రులకు బీజేపీ, కాంగ్రెసులు కామన్ శత్రువులుగా కనిపిస్తున్నాయి. ఆయా పార్టీలను దూరంగా పెట్టి తాము చేతులు కలిపితే ఎలా ఉంటుందనే యోచన కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. అనంతపురం వెళ్లిన సందర్బంలో పయ్యావుల కేశవ్ తో కేసీఆర్ చర్చలు, కేసీఆర్ ను కలిసిన సందర్బంలో మోత్కుపల్లి ఆంతరంగిక సంభాషణలు మధ్యవర్తిత్వానికి మార్గాలు సుగమం చేస్తున్న ప్రయత్నాలే అనేది రాజకీయ వర్గాల సమాచారం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News