సిద్ధూ...ఎంత అదృష్టవంతుడో కదా....!

Update: 2018-02-18 16:30 GMT

సిద్ధరామయ్య.... కాంగ్రెసేతర పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ, కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు బాగా వంటబట్టించుకున్న నాయకుడు. అందువల్లే సుదీర్ఘకాలం పార్టీని అంటిపెపట్టుకున్నా అందని అత్యున్నత ముఖ్యమంత్రి పదవిని అనాయాసంగా అందుకున్నారు. అయిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఎదురులేని పాలన సాగించారు. తద్వారా అయిదేళ్ల పూర్తి కాలం పదవిలో కొనసాగిన మూడో కర్ణాటక ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. గతంలో ఎస్ నిజలింగప్ప,దేవరాజ్ అర్స్ మాత్రమే ఈ అరుదైన ఘనతనున సొంతం చేసుకోవడం గమనార్హం. ముఖ్యమంత్రిగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నిజలింగప్ప ఐదేల్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. 1962 జూన్ 21న అధికార పగ్గాలు అందుకున్న ఆయన 1965 మే 28 వరకూ పదవిలో కొనసాగారు. అయిదేళ్లకు పైగా అధికారంలో కొనసాగిన తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. అనంతరం 70వ దశకంలో దేవరాజ్ అర్స్ ఈ ఘనతను సాధించారు. అర్స్ 1972 మార్చి 20 నుంచి 1977 డిసెంబరు 31 వరకూ పదవిలో కొనసాగారు. అనంతరం సీఎంగా అధికారం చేపట్టి 1980 వరకూ కొనసాగారు. ఇప్పుడు సిద్ధరామయ్య ఈ ఘనతను అందుకున్నారు. 2013 మేలో ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య అయిదేళ్ల పాటు తిరుగులేని నాయకుడిగా సత్తా నిరూపించుకున్నారు. వచ్చే ఏప్రిల్, మే నెలలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావడం ఖాయం. గతంలో నిజలింగప్ప, దేవరాజ్ అర్స్ కూడా రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

సిద్ధూకు కలసి వచ్చిందేంటంటే....

సహజంగా కాంగ్రెస్ పార్టీలో అయిదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగడమంటే ఆషామాషీ విషయం కాదు. అసమ్మతులు, అంతర్గత కలహాలు, అధిష్టానం నిఘా తదితర కారణాల వల్ల ఏ ముఖ్యమంత్రీ గుండెపై చేయివేసుకుని నిద్రపోలేడు. ఆయన మెడపై కత్తి ఎప్పుడూ వేలాడుతూనే ఉంటుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఈ ప్రమాదం మరీ ఎక్కువ. అంతా బాగున్నప్పటికీ ముఖ్యమంత్రి బలపడితే ఎక్కడ ఏకు మేకవుతాడన్న భయంతో అధిష్టానమే అసమ్మతిని రాజేస్తుంది. ఈ విషయంలో సిద్ధరామయ్య అదృష్టవంతుడనే చెప్పాలి. 2013 మేలో ఆయన అధికారం చేపట్టేనాటికి కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల్లో మునిగి తేలుతోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను గమనించే తీరిక, ఓపిక అధిష్టానానికి లేదు. 2014 లోక్ సభ ఎన్నికల్లో కుదేలైన కాంగ్రెస్ పార్టీ ఆ దెబ్బ నుంచి కోలుకునేందుకు చాలా కాలమే పట్టింది. అసలు పార్టీ అస్తిత్వానికే ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో కర్ణాటక వ్యవహారాలపై దృష్టి సారించే పరిస్థితి ఉత్పన్నం కాలేదు. ఫలితంగా సిద్ధరామయ్యకు ఎదురు లేకుండా పోయింది. పరిస్థితులు సానుకూలంగా మారడంతో సిద్ధరామయ్య ఐదేళ్ల పదవీకాలం ప్రశాంతంగా సాగిపోయింది. ఆయన రాజకీయ చతురత కూడా కొంతవరకూ దోహదపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అపర చాణక్యుడే.....

సిద్ధరామయ్య రాజకీయంగా ఒకింత అదృష్టవంతుడే. ఒక్కలింగ, లింగాయత్ వంటి రెండు బలమైన సామాజిక వర్గాలను పక్కన పెట్టి కురుబ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు సీఎంగా అవకాశం రావడమే విశేషం. దానిని నిలబెట్టుకోవడం చాణక్యానికి నిదర్శనం. సుమారు 15 శాతం గల లింగాయత్ లు బీజేపీ వైపు మొగ్గు చూపగా, రమారమి 17 శాతం గల ఒక్కలింగలు దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్ (ఎస్) వైపు నిలుస్తున్నారు. ఈ రెండు వర్గాల అండ లేకపోయినా దళితులు, ముస్లింలు, ఓబీసీల మద్దతు కూడగట్టిన కురు బసవ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కలింగ, లింగాయత్ లు పోను రాష్ట్రంలో 23 శాతం మంది దళితులు, 10 శాతం మంది ముస్లింలు, సిద్ధరామయ్య సామాజిక వర్గం అయిన కురుబలు 8 శాతం మంది ఉన్నట్లు అంచనా. వీరికి తోడు సంప్రదాయంగా ఉండే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఉండనే ఉంది.

అంచెలంచెలుగా ఎదుగుతూ...

మైసూరు జిల్లాలో 1949 ఆగస్టు 12న జన్మించిన సిద్ధరామయ్య న్యాయవాది. 1983లో తొలిసారిగా జనతాపార్టీ అభ్యర్థిగా చాముండేశ్వరి నగర్ నుంచి ఏడో శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి మధ్యలో అప్పుడప్పుడు ఓడిపోయినప్పటికీ రాజకీయాలను వీడలేదు. రామకృష్ణ హెగ్డే, దేవెగౌడ మంత్రివర్గాల్లో పనిచేశారు. 1996లో జేహెచ్ పటేల్ జనతాదళ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2005లో దేవెగౌడతో విభేదాల కారణంగా బెంగళూరులో సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ధరమ్ సింగ్ హయాంలో కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రిగా రెండోసారి పనిచేశారు. 2013లో ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా పరిస్థితులు ఆయనకు అనుకూలంగా ఉన్నాయనే అంటున్నారు విశ్లేషకులు. పార్టీలో తనకు దీటైన నాయకుడు లేకపోవడం సానుకూల అంశం. కావేరీ వివాదంలో కర్ణాటకకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం రాజకీయంగా ప్రయోజనం కలిగించేదే. తాజాగా ప్రజాహిత కార్యక్రమాలతో సమర్పించిన బడ్జెట్ కూడా కలిసి వచ్చేదే. అయినప్పటికీ ఆయన జీవితంలో పెద్దలోటుంది. బెల్జియం విహారయాత్రకు వెళ్లిన కుమారుడు అనారోగ్యానికి గురై మరణించడం సిద్ధరామయ్యకు జీవితాంతం కుంగదీసే పరిణామం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News