సమర్థ రథి...సంకీర్ణ సారథి

Update: 2017-12-18 16:30 GMT

కాంగ్రెసు పార్టీ చరిత్రలోనే అత్యధిక కాలం అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన సోనియా గాంధీ పార్టీని ఏకతాటిపై నడపటంలో విజయం సాధించారు. ఒక నాయకురాలిగా తన పార్టీని ముందుకు నడిపారు. విభిన్న రాజకీయ పక్షాల కూటమికి సారథిగా సంకీర్ణ ప్రభుత్వానికి చక్కని మార్గనిర్దేశం చేశారు. భారత రాజకీయాల్లో సవ్యసాచిగా తనను తాను నిరూపించుకున్నారు. కఠినమైన నిర్ణయాలకు ఇందిరా గాంధీ పెట్టింది పేరు. ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న ఇందిర మూడు అంశాల్లో తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు. ఒకటి పాకిస్తాన్ పై యుద్దం చేసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేయించారు. తన ఎన్నిక చెల్లదన్న న్యాయస్థానం తీర్పు కారణంగా దేశంలో అస్థిరత్వం నెలకొనే ప్రమాదం ఉందని గ్రహించి ఎమర్జెన్సీ విధించడం ద్వారా పార్టీపైన, దేశంపైన పట్టు నిరూపించుకున్నారు. రాజకీయ క్రమశిక్షణ కట్టు తప్పకుండా నియంత్రించారు. ప్రజాస్వామ్య చరిత్రలోనే చీకటిరోజులుగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఇందిర వెనకడగు వేయలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చే తీర్పు కంటే ఒక కోణంలో మాత్రమే చూసే న్యాయస్థానాల నిర్ణయం గొప్పదేమీ కాదని ఎమర్జెన్సీ ద్వారా ఆమె ప్రకటించారు. సిక్కు తీవ్రవాదం పెరిగి దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే పరిస్థితుల్లో ఆపరేషన్ బ్లూస్టార్ తో స్వర్ణ దేవాలయం నుంచి తీవ్రవాదులను తరిమికొట్టారు. ఇందిర తరహాలో బహిరంగంగా కనిపించకపోయినా అంతటి ద్రుఢ సంకల్పాన్ని సోనియా కూడా పార్టీని నడపటంలో, ప్రభుత్వానికి మార్గదర్శకత్వం వహించడంలో కనబరిచారనే చెప్పుకోవాలి.

ప్రాంతీయ నేతలకు పగ్గాలు...

ఇందిర హయాం నుంచి కాంగ్రెసు పార్టీలో ఒక సంస్కృతి వేళ్లూనుకుంది . పార్టీలో ప్రజాస్వామిక విధానాలకు ప్రత్యామ్నాయంగా నియంతృత్వ ధోరణులను ఇందిర ప్రవేశపెట్టారు. తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా పార్టీని పూర్తిగా గుప్పెట పట్టారు. మొదట్లో పార్టీలో సీనియర్ నేతల సిండికేట్ ఆమెకు అడుగడుగునా అడ్డు తగిలేవారు. ఆత్మ ప్రబోధం పేరిట పార్టీ అధికారిక అభ్యర్థిని సైతం రాష్ట్రపతి ఎన్నికల్లో ఇందిర ఓడించారు. తన నిర్ణయాన్ని పార్టీలో ఇతరులు కాదనకుండా చేసుకోవడానికి గాను తన పేరిటనే ఇందిర కాంగ్రెసు ను స్థాపించి నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకొన్నారు. ఆ తర్వాత నుంచి ఆమె పూర్తిస్థాయి నియంతగా మారారు. రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయనేతలకు పూచిక పుల్లపాటి విలువ నిచ్చేవారు కాదు. తన అడుగులకు మడుగులొత్తే భజన పరులను ప్రోత్సహించేవారు. కోటరీకి పెద్దపీట వేసేవారు. వెన్నెముక లేని ప్రాంతీయ నాయకులే పదవులు పొందేవారు. ఓట్ల కోసం, సీట్ల కోసం పార్టీ మొత్తం తన మీదనే ఆదారపడేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయ నాయకత్వాన్ని నిర్వీర్యం చేసేశారు. ఎవ్వరినీ నాయకత్వంలో స్థిరపడనిచ్చేవారు కాదు. ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రులను, పీసీసీ అధ్యక్షులను మారుస్తూ ఉక్కుపిడికిలి బిగించేవారు. రాజీవ్ గాంధీ కూడా అమ్మ అడుగుజాడల్లోనే నడిచారు. ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రం ముఖ్యమంత్రి అంజయ్యను కేవలం పార్టీ పదవిలో ఉన్న రాజీవ్ అవమానించడం ఇందులో భాగంగానే చూడాలి. తెలుగు దేశం పార్టీ ఘనవిజయం సాధించడానికి ఆంధ్రుల ఆత్మాభిమానం నినాదం ఎత్తుకోవడానికి ఇది కూడా ఒక కారణంగా నిలిచింది. సోనియా గాంధీ పార్టీలో ఈ ట్రెండును రివర్సు చేయడానికి ప్రయత్నించారు. ప్రాంతీయ నాయకులకు స్వేచ్ఛ నివ్వడమే కాకుండా వారు బలపడటానికి అవసరమైన మద్దతు ఇచ్చారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి, గులాం నబీ అజాద్, షీలాదీక్షిత్, అమరేందర్ సింగ్, సిద్ధరామయ్య వంటి వారు పార్టీలో స్వతంత్ర నేతలుగా ఎదిగేంత స్వేచ్ఛ లభించింది. పాలన పరమైన నిర్ణయాల విషయంలో వారికి సోనియా నేత్రుత్వంలోని అధిష్టానం అండగా నిలిచిందే తప్ప అడ్డు చెప్పలేదు. ఇందిర, రాజీవ్ లు నెలకొల్పిన కాంగ్రెసు సంస్క్రుతికి ఇది పూర్తి విరుద్దం. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా ప్రవర్తించకుండా ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పిన విషయాలను కూడా ఆలకించి నిర్ణయాలు తీసుకునేవారు. పార్టీలో ప్రజాస్వామ్య వైభవ పునరుద్ధరణకు సోనియా నిర్ణయాలు ఎంతగానో దోహదపడ్డాయి.

చీదరించిన వారినే ఆదరించి...

పార్టీ అధ్యక్ష పదవికి సోనియా అనర్హురాలని బెదిరించి సొంతపార్టీ ఎన్సీపీని పెట్టుకున్నారు శరద్ పవార్. మహారాష్ట్రలోనూ, కేంద్రంలోనూ అధికార భాగస్వామ్యం కోసం తిరిగి సోనియా గాంధీనే ఆశ్రయించాల్సి వచ్చింది. ఇందిర, రాజీవ్ లు తమతో విభేదించిన వారి రాజకీయ పతనం చూసేలా పావులు కదిపేవారు. కానీ సోనియా గాంధీ, శరద్ పవార్ ను యూపీఏ లో భాగస్వామిని చేశారు. కేంద్రంలో ఆయనకు కీలక మంత్రి పదవులు ఇచ్చారు. కాంగ్రెసు నుంచి విడిపోయి వేరుకుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీని సైతం కేంద్రంలో మంత్రిని చేశారు. పశ్చిమ బంగలో మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి కాంగ్రెసు అధినేత్రి సోనియా అందించిన నైతిక తోడ్పాటు అంతా ఇంతా కాదు. వామపక్షాలు అమెరికాతో న్యూక్లియర్ ఒప్పందంతో విభేదించి కేంద్రప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాయి. అయినప్పటికీ పశ్చిమ బంగ ఎన్నికల్లో మమత ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతూ విలవిల్లాడుతున్న వామపక్షాలకు ఎన్నికల్లో స్నేహహస్తం అందించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరన్న రాజనీతి ధర్మాన్ని ఆచరించి చూపించారు.

పెత్తందార్లకు పెద్ద దిక్కుగా...

వాజపేయి వంటి అనుభవజ్ణులే సంకీర్ణ ప్రభుత్వాల రాజకీయ కూటమికి నాయకత్వం వహించడంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ సోనియా మాత్రం చాకచక్యంగా తనకంటే రాజకీయంగా ఎంతో సీనియర్లయిన, పెత్తందార్లయిన పార్టీల నాయకులను ఒకే మాటపై నిలిపి, ఒకే బాటలో నడపటంలో విజయం సాధించారు. లాలూ ప్రసాద్ యాదవ్ వంటి సీజన్డ్ పొలిటీషియన్ ను డీల్ చేయడం సాధారణ విషయం కాదు. అదే విధంగా క్షణక్షణం నిర్ణయాలు మార్చుకుంటూ దేశంలోని అందరు నేతలకంటే తానే అధికురాలిననే భావనలో ఉండే మమతా బెనర్జీ వంటి చంచల నాయకురాలిని నియంత్రించడమూ చిన్న పని కాదు. అవినీతి ఊబిలో కూరుకుని కుటుంబ పాలనకు చిరునామాగా మారిన డీఎంకే వంటి శక్తుల వాటాలు, కోటాల డిమాండ్లు తీర్చడమూ తలనొప్పే. సంకీర్ణంలో భాగస్వాములైన 15 పార్టీలవీ ప్రత్యేక మార్గాలే. అయినప్పటికీ వారందరినీ నొప్పించకుండా ఒప్పించి పెత్తందార్లకే పెద్ద దిక్కుగా నిలిచారు సోనియా. వయోభేదంతో , అనుభవంతో సంబంధం లేకుండా ఆమె మాటకు అన్ని పక్షాలు విలువ నివ్వడం, గౌరవించడం కాంగ్రెసు రాజకీయాల్లో కొత్త శకంగా నే చెప్పుకోవాలి. గతంలో కాంగ్రెసు వర్సస్ సకల పక్షాలన్న ధోరణి భారత రాజకీయాల్లో కనిపించేది. ఇప్పుడు బీజేపీ వర్సస్ అఖిల పక్షాలన్న రీతిలో రాజకీయం రూపుదిద్దుకుంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో అందరి ఆదరాభిమానాలు పొందిన సోనియా గాంధీ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలిగా తప్పుకున్నప్పటికీ జాతీయ రాజకీయాలలో ప్రతిపక్షాలకు పెద్ద దిక్కుగా మార్గదర్శకత్వం వహించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది.

-ఎడిటోరియల్ డెస్క్

 

సోనియా రాజకీయప్రస్థానం పార్ట్ -3 రేపు చూద్దాం….

Similar News