సద్దుల బతుకమ్మ సుద్దులు నేర్పేనా?

Update: 2017-09-20 13:30 GMT

రాజకీయ అసహనం తెలంగాణను పట్టి కుదిపేస్తోంది. అటు విపక్షాలు, ఇటు అధికారపక్షం చెలరేగిపోతున్నాయి. ఏ చిన్న అంశం దొరికినా రాజకీయరంగు పులుముతూ విద్వేషపూరిత వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. దిగ్విజయ్ సింగ్ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జిగా ఉన్నప్పటి నుంచీ కాంగ్రెసు పార్టీది ఇదే ధోరణి. పోలీసు నేర పరిశోధన మొదలు తెలంగాణలో ఏ కుంభకోణం చోటు చేసుకున్నా ప్రభుత్వ ముఖ్యుల పాత్ర ఉందన్న కోణంలో ఆయన ట్వీట్లు చేస్తుండేవారు. ఇందుకు తగిన ఆధారాలు ఉండేవి కావు. తర్వాత తన ట్వీట్లను సవరించుకోవడమో లేకపోతే న్యాయస్థానంలో తేల్చుకోండి, కేసులు పెట్టుకోండి అంటూ ఎదురుతిరగడమో దిగ్విజయ్ ధోరణిగా ఉంటుండేది. ఆయన పనితీరువల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదని గ్రహించిన అధిష్టానం చివరికి ఇన్ ఛార్జి బాధ్యతలనుంచి తప్పించేసింది. దాంతో అడ్డగోలు ఆరోపణల బాధ అధికారపక్షమైన తెలంగాణ రాష్ట్రసమితికి కొంతమేరకు తప్పిపోయింది.

విపక్షాలపై విరుచుకుపడితే తప్పు...ఒప్పవుతుందా?

తెలంగాణలో అస్తిత్వం కోసం పోరు సలుపుతున్న తెలుగుదేశం పార్టీకి ఫైర్ బ్రాండ్ రేవంత్ ఒక ప్రధాన అస్త్రమై పోయారు. ఆయన పదునైన, సూటి విమర్శలకు పెట్టింది పేరు. కానీ పరిధులు దాటి శృతిమించిన వివాదాలను సృష్టిస్తుంటారు. ఫలితంగా విధానాలపై విమర్శకంటే వ్యక్తిగతమైన టార్గెట్ లకు రేవంత్ పరిమితమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఫలితంగా తెలుగుదేశం పార్టీకి లభించే ప్రయోజనం శూన్యంగానే ఉంటోంది. పండ్లు కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటుంటారు. సంక్షేమ ఫలాలను అందించాల్సిన ప్రభుత్వమే విమర్శలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే అధికారపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రతిపక్షాలు ఎన్నైనా విమర్శలు, ఆరోపణలు చేయవచ్చు. రాజకీయ దుమారాలు రేకెత్తించవచ్చు. కానీ వాటిలో ఎంతమేరకు నిజముంది? ఎంతమేరకు సరిదిద్దుకోవాల్సి ఉంది? అన్న విషయాలను తేల్చుకోవాల్సింది అధికారపక్షమే. విపక్షాలు వీరంగం చేసినంతమాత్రాన పరిపాలన పగ్గాలు చేపట్టిన ప్రభుత్వం విరుచుకుపడాల్సిన అవసరం లేదు. తమ ఉద్దేశాలను, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే చాలు. ప్రతిపక్ష విమర్శల్లోని డొల్లతనాన్ని బయటపెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ విషయంలో కేసీఆర్ ఒకింత దూకుడు ప్రదర్శిస్తారు. ప్రతిపక్షాల నాయకులను సన్నాసులు అని తీసిపారేయడమే కాదు. బూతులు తిట్టేందుకు కూడా ఆయన వెనకాడరు. ఒక ఉద్యమనాయకునిగా రాష్ట్రసాధన వరకూ చేసిన ప్రసంగాలు ప్రజలను ఉత్తేజపరచడానికి, అదే సందర్భంలో తమ డిమాండ్ పట్ల నిబద్ధతను చాటేందుకు ఎటువంటి భాషను ఉపయోగించినా చెల్లుబాటు అవుతుండేది. ఇప్పుడు ప్రభుత్వ అదినేత. తెలంగాణకు దశ-దిశ, మార్గనిర్దేశకుడు ఆయనే. అయినప్పటికీ మాట తీరులో మార్పు లేదు.

తండ్రిని అనుకరిస్తే సరిపోతుందా?

కొత్తతరం నాయకుడు, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా తాజా ప్రసంగాల్లో , ప్రతిస్పందిస్తున్న తీరులో తండ్రిని అనుకరిస్తూ అదే దూకుడును కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ పైచేయి సాధించేందుకు కేటీఆర్ ఈ శైలిని అనుసరిస్తున్నారా? లేకపోతే పార్టీలోని వారసత్వ పోరులో ప్రత్యర్థులుగా ఉన్న హరీష్, కవితల కంటే తానే ప్రతిపక్షాలను బలంగా నిరోధించగలనని ఆధిక్యాన్ని నిరూపించుకునే క్రమంలో భాగంగా స్పీడు పెంచారా? అన్న సందేహాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తాజాగా బతుకమ్మ చీరల పంపిణీ పెనువివాదంగా మారింది. ప్రజల్లో నానాటికీ పట్టుపెంచుకుంటున్న టీఆర్ఎస్ పై విరుచుకుపడేందుకు ప్రతిపక్షాలకు ఒక అస్త్రం దొరికింది. చేనేత చీరల స్థానంలో నాసిరకం సిల్క్ చీరలు పంచుతున్నారంటూ కొన్ని చోట్ల మహిళలు నిరసన వ్యక్తం చేశారు. విపక్షాలు అగ్నికి ఆజ్యం పోశాయి. చీరల మంటలను ఎగదోశాయి. తెలంగాణ ఆడపడుచులందరికీ చీరలు అందాలనే ఉద్దేశంతో 222 కోట్ల రూపాయల వ్యయంతో కోటీ 4 లక్షల చీరలు పంచాలనేది సర్కారు సంకల్పం.

అధికారులు తప్పుదోవ పట్టించారా?

చేనేత చీరలు సరిపడగా సేకరించలేక సూరత్ చీరలపై ఆధారపడటం, కొంతమేరకు అవినీతి చోటు చేసుకోవడంతో మొత్తం కార్యక్రమంపైనే ఆ ప్రభావం పడింది. మరమగ్గాలు, చేనేత చీరలను 45 లక్షల వరకే ప్రభుత్వం సేకరించగలిగింది. మిగిలిన చీరలు సూరత్ చీరలు. తెలంగాణలో సూరత్ చీరలంటే 70-80 రూపాయలకే వేలంలో దొరుకుతుంటాయి. అప్పుడప్పుడూ రాష్ట్రంలోని పట్టణాల్లో వీటిని తూకానికి కూడా అమ్ముతుంటారు. చేనేత చీరలంటూ విస్తృతంగా ప్రచారం చేసిన ప్రభుత్వం సూరత్ చీరలను అంటకట్టడంపై ఆగ్రహం సహజమే. పక్కన ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో కూడా లక్షల సంఖ్యలో చేనేత కార్మికులు ఉన్నారు. సహకార సంఘాలు కూడా ఉన్నాయి. చీరల పంపిణీకి నిర్ణయం మూడు నెలల క్రితమే తీసుకున్నారు. అవసరమైన మేరకు ఆయా రాష్ట్రాలకు ఆర్డర్లు ఇచ్చినా నేత చీరలు దొరికేవి. కానీ సూరత్ చీరల కొనుగోళ్లలో కమీషన్లు భారీగా ముడతాయి. అందువల్ల ప్రభుత్వాన్ని అధికారులు తప్పుదారిపట్టించారు. ప్రతిపక్షాల రభసతో మొత్తం వ్యవహారం కంపు కొట్టింది. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపించాల్సిన కేటీఆర్ విపక్షాలపై విరుచుకుపడి శాపనార్థాలు పెట్టారు. అసలు విషయం బయటకు రాకపోతే ప్రభుత్వానికే మచ్చ. వచ్చే సంవత్సరం కూడా పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల లోపం ఎక్కడ జరిగిందనే అంశంపై దృష్టి సారిస్తే నాయకునిగా కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు మంచిది. ఎన్నియో రాజకీయ యుద్ధముల ఆరితేరిన తండ్రితో పోల్చుకుని అదే పంథాను అనుసరించి అన్ని విషయాలు ప్రతిపక్షాల కుట్రే అని చేతులు దులిపేసుకుంటే పార్టీకి, ప్రభుత్వానికి కూడా నష్టదాయకం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News