సంక్షేమ రథమా? సమూల మార్పులా?

Update: 2018-01-31 15:30 GMT

రాజకీయాల్లో అల్టిమేట్ గోల్ అధికార సాధన, అధికార పరిరక్షణ. ఇందుకు మనమెంచుకున్న ప్రక్రియ ప్రజాస్వామ్యం. ప్రజలిచ్చే తీర్పుతోనే అధికార సాధన సాధ్యమవుతుంది. అందుకే నిరంతరం ప్రజలను సంతృప్తి పరుస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటాయి రాజకీయ పార్టీలు. రాయితీలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధికార్యక్రమాల పేరిట గరిష్టంగా ప్రజల ఆదరణ పొందే ప్రయత్నం చేస్తుంటాయి. అయినప్పటికీ ప్రజలు ఎప్పటికప్పుడు అయిదేళ్లకో, పదేళ్లకో ఇంకా మంచి పాలన కోరుకుంటూ అధికార కేంద్రాలను మార్చేస్తూ ఉంటారు. మ్యూజికల్ ఛైర్స్ తరహాలో ఎప్పటికప్పుడు అయిదేళ్లకోసారి పవర్ మారిపోతున్న రాష్ట్రాలను కూడా మనం చూస్తుంటాం. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రజల చేతిలోని ఓటు అనే అధికారాస్త్రం శక్తి తెలిసి ఉండటం వల్ల రాజకీయ పార్టీలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుంటాయి. అధికారంలో ఉన్న పార్టీ సకల శక్తియుక్తులు కేంద్రీకరించి ప్రజలను ప్రలోభపరచాలని చూస్తుంది. సంక్షేమపథకాలు ఇందులో మొదటి ఆకర్షక మంత్రంగా చెప్పుకోవాలి. ప్రతిపక్షాలకు అంతటి అవకాశం ఉండదు కాబట్టి తాము పవర్ లోకి వస్తే చేపట్టే పథకాలపై ఎన్నికల ప్రణాళికలతో ఆకట్టుకోవాలని చూస్తుంటాయి.

అప్పు చేసి పప్పు కూడు...రద్దేనా?

ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంది భారతదేశం. మానవ వనరులు, యువశక్తిలో ప్రపంచంలోనే అద్వితీయమైన స్థానం. అందువల్లనే రానున్న రెండు దశాబ్దాల్లో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అభివ్రుద్ధి సాధించడం ఖాయమని ప్రపంచ ప్రఖ్యాత ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే రాజకీయ స్థిరత్వం, సమర్థమైన పాలనతో ముందడుగు వేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. 140 లక్షల కోట్ల భారీ ఆర్థిక వ్యవస్థ మనది . అందులో ఆరోవంతుకు పైగా కేంద్ర బడ్జెట్ ఉంటూ వస్తోంది. అప్పులపై వడ్డీలు, అసలు వాయిదాలు చెల్లింపులకు ఆదాయంలో 25 శాతానికి పైగా చెల్లిపోతోంది. ఉద్యోగుల జీత,భత్యాలు, రక్షణ, రాష్ట్రప్రభుత్వాలకు గ్రాంట్లు, రాయితీలు, సంక్షేమ పథకాలు పోను అభివృద్ధి పనులపై పెట్టే మొత్తం నామమాత్రమే. నిజానికి భారత్ సుసంపన్నంగా మారాలంటే మౌలిక వసతులకు భారీగా నిధులు అవసరం. బడ్జెట్ లో కనీసం అయిదారు లక్షల కోట్ల రూపాయలు మౌలిక వసతులపై వెచ్చించగలిగితే మరో 20 లక్షల కోట్లరూపాయల మేరకు విదేశీ రుణాల ద్వారా సమీకరించేందుకు వెసులుబాటు ఉంటుంది. అదే జరిగితే రానున్న పదేళ్లలోనే సంపన్నత విషయంలో భారత్ మూడో స్థానానికి ఎగబాకగలుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కానీ సామ్యవాద సంక్షేమ రాజ్యంగా వేసుకున్న ముద్ర కారణంగా కొన్ని దశాబ్దాలుగా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులకు పెట్టుబడి నిధులు కేటాయించలేకపోతున్నారు. ప్రాంతీయ డిమాండ్లు, పాపులిస్టు స్కీములు రాజ్యం చేస్తున్నాయి. అప్పు చేసి పప్పు కూడు పెట్టే పద్ధతిని పాలకులు అనుసరిస్తున్నారు. విదేశాల నుంచి తెచ్చిన నిధులను సైతం ఏదో రూపంలో సంక్షేమం వైపు మళ్లిస్తున్నారు. ఈ ఏడాది ఈ రకమైన పద్ధతి కనిపించకపోవచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవచ్చనేది డిల్లీ రాజకీయవేత్తల సమాచారం.

మోడీనామిక్స్ ..నమ్మదగ్గ అస్త్రమేనా?

ప్రధాని మోడీ మొండి వ్యక్తి. నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను అమలు వంటి విధానపరమైన అంశాలతో తానేమిటో నిరూపించుకున్నారు. ఎంతగా వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ, పార్టీలో సైతం భిన్నాభిప్రాయాలు వెల్లడైనప్పటికీ వెనకడుగు వేయలేదు. తాను అమలు చేయాలనుకుంటున్న ఆర్థిక సంస్కరణలకు ప్రజామోదం పొందేందుకు తెలివైన ఎత్తుగడలను ప్రయోగిస్తున్నారు. వ్యూహాత్మకంగా ప్రజలను తన దారి వైపు మళ్లిస్తూ పథక రచన చేస్తున్నారు. నోట్ల రద్దును నల్లధనం తో ముడిపెట్టడం, జీఎస్టీ ని నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యంగా ప్రకటించడం వంటివన్నీ ప్రజలను సెంటిమెంట్ తో ముడిపెట్టే ఎత్తుగడలే. దేశ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టే సంస్కరణలను సైతం అమలు చేసి తీరాల్సిందేననేది మోడీ పట్టుదల. మంచి జరుగుతుందంటే ప్రజలే కాలక్రమంలో అర్థం చేసుకుంటారు. ఇదే ప్రధాని నమ్మకం. కొంత వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఇంతవరకూ మోడీనామిక్స్ వర్కవుట్ అవుతున్నట్లే కనిపించింది. ప్రజాక్షేత్రంలో ఘోరపరాజయాలు ఎదురుకాకుండా గట్టెక్కడమే ఇందుకు నిదర్శనం. పార్టీకి ఎదురయ్యే పరాజయాలకు తాను బాధ్యత తీసుకుంటానని భరోసానిచ్చి ఇతర నాయకులు సైతం తన నిర్ణయాలకు ఆమోదముద్ర వేసేలా ప్రధాని చూసుకుంటున్నారు. అందుకనే మోడీపై భారం వేసి బీజేపీ చేతులు దులిపేసుకొంటోంది.

సంక్షేమానికి చెల్లుచీటీ సాధ్యమేనా?

2018 -19 ఆర్థిక సంవత్సర ఆదాయవ్యయ పద్దును ఎన్నికల బడ్జెట్ గా చెప్పుకోవాలి. దీని తర్వాత మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ ను 2019-20 సంవత్సరంలో కొత్త ప్రభుత్వానికి మాత్రమే అవకాశం దక్కుతుంది. అందువల్ల ఈ ఏడాది ప్రభుత్వాలు వివిధ వర్గాలకు రాయితీల వర్షం కురిపిస్తాయి. సంక్షేమపథకాల పేరట నిధులను పప్పుబెల్లాలుగా పంచిపెట్టే ప్రయత్నాలు చేస్తాయి. ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రభుత్వ నోట్లను వెదజల్లడానికి ఉన్న అన్ని అవకాశాలను వినియోగించు కుంటుంటాయి. కానీ మోడీ రూటే సెపరేటు. ప్రజలు సంక్షేమ పథకాలను కోరుకోవడం లేదు. ఉచితంగా వచ్చే వాటికోసం ఆశపడటం లేదంటూ తన మనసులోని భావాలను మోడీ ఇటీవలనే బయటపెట్టారు. సంక్షేమం అనేది బడ్జెట్ లో ప్రధానాంశం కాబోవడం లేదని తేల్చేశారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వంటి సీనియర్లు కొంతమేరకు ప్రధానికి నచ్చచెప్పగలిగితే కొంతమేరకు ప్రజలకు వరాల జల్లు కురవవచ్చు. ప్రదాని మాత్రం ఇందుకు సుముఖంగా లేరు. మనకెందుకొచ్చిందిలే అన్నట్లుగా సీనియర్లు మౌనం వహిస్తే మోడీ ధోరణి, విధానాన్నే బడ్జెట్ ప్రతిబింబించవచ్చు. గడచిన డెబ్భై సంవత్సరాలుగా సంక్షేమం , రాజకీయం జోడుగుర్రాలుగా ప్రభుత్వ పాలన సాగుతోంది. భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం సాగుతున్నప్పటికీ సంక్షేమ పథకాల పేరిట లక్షల కోట్ల కేటాయింపులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. గడచిన రెండు దశాబ్దాలుగా ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు వచ్చాయి. మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల సంఖ్య బాగా పెరిగింది. ఆహార సబ్సిడీలు, ఉచిత పంపిణీలను వినియోగించుకుంటున్న ప్రజల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆయా పథకాల కేటాయింపులు పక్కదారి పట్టి దుర్వినియోగమవుతున్నాయి. ఈ స్థితిలో మెజార్టీ ప్రజలు విద్య,వైద్యం, మౌలిక వసతులపై సర్కారీ వ్యయం పెరగాలని కోరుకుంటున్నారు. భారత్ సంపన్నదేశాల జాబితాలో చేరడానికి కూడా ఇది ఎంతైనా అవసరం. సంక్షేమ పథకాలకు కోత పెట్టి ప్రజల జీవనప్రమాణాలను ద్రుష్టిలో పెట్టుకుని వారికి చేయూతనిచ్చేలా బడ్జెట్ కు పునర్నిర్వచనం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటారా? లేక మూస పద్ధతిలో ఎన్నికల జనాకర్షణనే ఎంచుకుంటారా? కొన్ని గంటల వ్యవధిలోనే ఈ చిక్కుముడి విడిపోనుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News