సంకేతమా?... సంక్షోభమా?

Update: 2018-01-24 15:30 GMT

‘నేను రెడీ. మీరు రెడీయేనా? కలిసి నడుద్దాం. కాదంటే ఎన్నికల తర్వాతైనా సరే. ముందైతే ఒకమాట చెప్పాలి. హామీ ఇవ్వాలి. ఎన్నికల తర్వాత అయితే పరిస్థితులే తేల్చి చెప్పాలి. ’ ఇదీ జగన్ మోహన్ రెడ్డి మనసులోని మాట. బీజేపీతో పొత్తు కట్టేందుకు తహతహలాడుతున్న తీరు ఆయన మాటల్లో తొంగిచూస్తోంది. ఒకే ఒక షరతు అంగీకరిస్తే మేమూ, మీరు ఒకటే అంటూ కమలనాథులకు కన్నుగీటుతున్నారు. పాదయాత్ర ను చేపడుతూ ఒకవైపు ప్రజల్లోకి వెళుతున్న జగన్ ఆత్మస్థైర్యాన్ని సంతరించుకోవాల్సింది పోయి జాతీయ పార్టీ ముందు దేబిరిల్లే పరిస్థితికి కారణాలేమిటనే చర్చ మొదలైంది. దళిత, మైనారిటీ ఓటు బ్యాంకు వెన్నుదన్నుగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి బీజేపీ గుదిబండగానే రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయినప్పటికీ రిస్కు చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే బీజేపీతో జట్టుకడతామని జగన్ చేసిన ప్రకటనలోని ఆంతర్యం ఆ పార్టీ నేతలనే అయోమయానికి గురి చేస్తోంది.

సెల్ఫ్ గోల్.....

2014 ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ విజయం సాధించినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ధీటైన పోటీనిచ్చింది. ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, రెడ్డి ఓట్లలో మెజారిటీ భాగం ఈ పార్టీ కిట్టీలోనే పడ్డాయి. అయితే వెనకబడిన తరగతులు, కమ్మ, కాపు, బ్రాహ్మణ, వైశ్య వర్గాలు బలంగా తెలుగుదేశం, బీజేపీ సంకీర్ణానికి అండగా నిలవడంతో మెజార్టీ సాధించగలిగాయి. అంతేకాకుండా రాష్ట్రవిభజనతో కాంగ్రెసుపై బాగా వ్యతిరేకత ప్రబలిన స్థితిలో బీజేపీ, మోడీతో జట్టుకట్టిన టీడీపీని అందలమెక్కించాలని ప్రజలు భావించారు. మరోవైపు కొత్త రాష్ట్రానికి చంద్రబాబు నాయుడి వంటి అనుభవజ్ఞుడి అవసరం ఉందని మధ్యతరగతి, విద్యావర్గాల ప్రజలు ఓట్లేశారు.ఇన్ని రకాల సమీకరణలతో టీడీపీ కాంబో విజయం సాధ్యమైంది. వైసీపీ పరాజయానికి కూడా అనేక కారణాలున్నాయి. పొత్తుకు బీజేపీ ముందుకొచ్చినా వైసీపీ తిరస్కరించింది. రైతు రుణమాఫీ వంటి హామీలు ఇచ్చేందుకు నిరాకరించింది. అన్నిటికంటే ప్రధానమైనది జగన్ అనుభవరాహిత్యం. ఈ బలహీనతల కారణంగానే గెలుపు ముంగిట్లో పరాజయం పాలైంది. తాజాగా ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలుస్తామంటూ స్వయంగా ప్రకటన చేయడం రాజకీయంగా పార్టీపై పెను ప్రభావాన్ని చూపుతుందని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీకి 2014 ఎన్నికల్లో ఉన్న ఆదరణ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు లేదు. పైపెచ్చు దళిత, మైనారిటీ వర్గాలు ఇంకా బీజేపీకి దూరంగానే ఉన్నాయి. తమ పార్టీ ఓటు బ్యాంకులో దాదాపు 58 శాతం వరకూ ఉన్న దళిత్, మైనారిటీ ఓట్లను బీజేపీతో కలుస్తామన్న ఒకే ఒక్క ప్రకటన దూరం చేస్తుందనే భయం శ్రేణుల్లో నెలకొంది. ఇది పొలిటికల్ సెల్ఫ్ గోల్ అంటూ రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

‘స్వేచ్ఛ’ కోసం ?...

రెండు నెలలకు పైగా పాదయాత్ర చేస్తున్నప్పటికీ జగన్ ప్రజల నాడిని పట్టుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలు అంతర్గతంగా విమర్శిస్తున్నాయి. కోర్ ఓటు బ్యాంకుకు చిల్లు పడేలా బీజేపీ అనుకూల ప్రకటన చేయడం విస్మయానికి గురి చేసిందని సీనియర్ నేతలు చెబుతున్నారు. అందులోనూ జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ జగన్ ఈప్రకటన చేయడంలో ప్రత్యేక ఉద్దేశం దాగి ఉందంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షాలతో విజయసాయి రెడ్డి సమావేశమై సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు న్యాయవిచారణలో ఉన్న కేసులు కీలక దశకు చేరుకుంటున్నాయి. ఇంకోవైపు 2 జీ స్కాంలో కణిమొణి, రాజా వంటి వారు నిర్దోషులుగా బయటికి వచ్చేశారు. ఈ దశలో కేంద్రంతో కొంత సాన్నిహిత్యం ఏర్పరచుకుంటే రాజకీయంగా లాభిస్తుందనే అంచనాలో జగన్ ఉన్నారు. ఏడాది కాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఇప్పుడు కేసుల పీట ముడి బిగిసిందంటే పార్టీకి ఇబ్బందికరమే. కేంద్ర దర్యాప్తు సంస్థలు వేధింపులకు పాల్పడకుండా రక్షణఛత్రం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఎన్నికల్లో స్వేచ్ఛగా పార్టీ బలాన్ని చూపించుకునే అవకాశం దక్కుతుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి నడిచేందుకు ఇప్పటికీ అవకాశాలున్నాయి. అవసరమైన సందర్బంలో వైసీపిని నియంత్రించేందుకు జగన్ పై కేసుల దర్యాప్తును కేంద్ర సంస్థలు ముమ్మరం చేసే ప్రమాదమూ ఉందని అనుమానిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా ముందు జాగ్రత్తలో భాగంగా మేము మీకు ప్రత్యర్థులం కాదన్న సంకేతాన్ని పంపేందుకు వ్యూహాత్మకంగానే జగన్ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు.

ఎన్నికల ముందా? తర్వాతా?..

తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మధ్య పూర్తిగా సంబంధాలు బెడిసి కొడితే తప్ప ఎన్నికలకు ముందు వైసీసీ, బీజేపీల మధ్య పొత్తు కుదిరే అవకాశం లేదు. తెగేదాకా లాగితే నష్టపోయేది తామేనన్న అవగాహన కారణంగానే చంద్రబాబు మిత్ర ధర్మం పాటించాలని నాయకులకు సూచిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సైతం బీజేపీని తమవైపు ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అయితే కేసుల విషయంలో మందగమనం, క్యాడర్ లో జోష్ నింపడానికి కేంద్రం అండగా ఉందన్న భావన ఉపయోగపడుతుంది. పాదయాత్ర ఎంత విస్తృతంగా చేపట్టినప్పటికీ అనుకున్నంత ఉత్సాహం కనిపించడం లేదని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేసుల సమస్యే ప్రధాన అడ్డంకిగా కనిపిస్తోంది. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ప్రత్యర్థులే ఉండటం పార్టీకి ఇబ్బందికరం. జనసేన పార్టీ వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తు అంశం ప్రస్తావన ద్వారా రేపొద్దున్న కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంతో వైసీపీ చెలిమి తప్పదని స్పష్టం చేస్తున్నారు. ఇది పార్టీకి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? తేల్చి చెప్పలేని స్థితి. అయితే వైసీపీ మాత్రం రిస్క్ అయినప్పటికీ ఒక రాజకీయ విన్యాసం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటిస్తే తాము కచ్చితంగా బీజేపీకి మద్దతిస్తామంటున్నారు. కేంద్రం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సంకీర్ణభాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా అడుగు ముందుకు పడలేదు. వైసీపీ విన్నపంతో వచ్చేస్తుందా? అంటే నో అంటున్నారు విమర్శకులు. కేవలం బీజేపీకి సంకేతాలు ఇవ్వడానికే ఈ తంతు సాగుతోందనేది సమాచారం. మరోవైపు టీడీపీని బెదిరించే వ్యూహం కూడా ఇందులో దాగి ఉందంటున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News