వైసీపీకి నంద్యాల ఎన్నిక గుణపాఠం అవుతుందా?

Update: 2017-08-28 15:30 GMT

‘ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే నిజమైన విజేత’ ఒక పాపులర్ సినిమాలో డైలాగ్ ఇది. రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన ఒక పాఠం. ఏడాదిన్నర కాలంలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల ఉప ఎన్నిక సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. సెమీ ఫైనల్ గా, ప్రజాతీర్పునకు రిఫరెండమ్ గా సాగిన హోరాహోరీ ప్రచార సంరంభం యుద్ధాన్నే తలపించింది. చివరికి అనుభవమే గెలిచింది. చాకచక్యమైన సామాజిక సమీకరణలు, వ్యూహాలు,ఎత్తుగడలు వాటన్నిటి పైపూతలా తేనెపూసిన అభివృద్ధి మంత్రం వెరసి తెలుగుదేశం విజయం సాధించింది. పైకి పార్టీ విజయంగా కనిపించినా అపారమైన రాజకీయ నైపుణ్యం ఈ ఎన్నికల ఫలితాన్ని ముందుగానే డిసైడ్ చేసేసింది. అవినీతి, ధన ప్రవాహం వంటి ఆరోపణలు రెండు పార్టీలూ ఎదుర్కొన్నాయి. పైపెచ్చు పరాజయానికి సాకులు వెదుక్కోవడం కంటే విజయానికి కారణాలను అన్వేషిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి వై.సి.పి స్వీకరించాల్సిన గుణపాఠం ఇది.

తెలుగుదేశం పార్టీకి నిజంగా సవాలే.....

175 శాసనసభ నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్ లో ఇది కేవలం ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన తంతు. అయినా అధికారంలో ఉన్న పార్టీకి చాలా ముఖ్యం. నెగ్గిన పార్టీని ఫిరాయించి తమ పార్టీలో చేరి మరణించిన వ్యక్తి స్థానంలో పోటీ జరుగుతోంది. ఇలా మరొక 20 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలూ ఉన్నారు. నంద్యాలలో ప్రజామద్దతును నిరూపించుకోగలిగితే మిగిలిన అభ్యర్థుల విషయాన్ని పక్కనపెట్టేయవచ్చు. అదే సమయంలో తమ పాలనపై ప్రజల తీర్పుగానూ ప్రకటించవచ్చనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన. అందుకే ఆ పార్టీకి గెలుపు చాలా కీలకమైన అంశం. అదే వై.సి.పి విషయానికొస్తే నంద్యాల రాష్ట్రంలో అధికార రథాన్ని తలకిందులు చేసే అవకాశం లేదు. తమకు తక్షణం పాలన వచ్చేది కూడా లేదు. కానీ ప్రజల్లో ఒక బలమైన ప్రబావాన్ని కల్పించవచ్చు. వై.సి.పి 2019లో అధికారంలోకి వచ్చేస్తోందన్న భావన రేకెత్తించవచ్చు. ఇదే ఆలోచనతో జగన్ మోహన్ రెడ్డి నంద్యాల ఎన్నికను తనకు, చంద్రబాబు నాయుడికి మధ్య ప్రత్యక్ష పోరుగా మార్చేశారు. పదిరోజులకు పైగా మకాం వేసి సర్వశక్తులు ఒడ్డారు.

అనుభవమున్న నేతలకు బాధ్యతలు....

స్థానికంగా బలమైన వై.సి.పి అభ్యర్థే అయినప్పటికీ అతనికి సొంత ఆలోచనలు, వ్యూహాలు లేకుండా చేసేశారు. మొత్తం ప్రచారాన్ని తనచుట్టూ తిప్పుకున్నారు. అదే సమయంలో తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోలేదు. నంద్యాలతో బంధుత్వాలు ఉన్న కడప,కర్నూలు, అనంతపురం నాయకులందర్నీ రంగంలోకి దింపారు. కులపరమైన సమీకరణలు చేశారు. ఆయా నాయకులు తమ కులాల వారిని సంప్రదించి టీడీపీని గెలిపిస్తే ఒనగూరే ప్రయోజనాలను వివరించేలా చూశారు. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న ముస్లిం ఓట్లు మూకుమ్మడిగా ప్రత్యర్థి పక్షం వైపు మళ్లకుండా నిరోధించేందుకుగాను బీజేపీని ప్రచారంలో దూరం పెట్టారు. ఫరూక్ వంటి వారికి పదవులు కట్టబెట్టి మైనారిటీ ఓట్లకు గాలం వేవారు. ఓట్ల సంఖ్య పరంగా రెండో స్థానంలో ఉన్న బలిజలను ఆకట్టుకొనేందుకు గాను కాపు రిజర్వేషన్లపై ఒక సమావేశాన్ని నిర్వహించారు. మంజునాథ కమిషన్ రిపోర్టు వచ్చిన వెంటనే తగిన సిఫార్సులతో పార్లమెంటుకు పంపి కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామని మరోసారి ప్రకటించారు. వాల్మీకి కమ్యూనిటీ ఓటర్లను ఆకట్టుకొనేందుకు సమాచార మంత్రి కాలవ శ్రీనివాసులు తమ కులస్థులందర్నీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. వైశ్య కులస్థులపై రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేశ్ ను ప్రయోగించారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కె.ఇ. కృష్ణమూర్తి బీసీ ఓట్లను పార్టీకి అనుకూలంగా మలచేందుకు ప్రయత్నించారు. ఈ నియోజకవర్గంలో మంచి బంధువర్గమున్న మంత్రి ఆదినారాయణ రెడ్డి వంటివారినీ ప్రచారంలో తిప్పారు. వ్యూహకర్తగా పేరున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి అన్నివర్గాలు, కులాలు, నాయకుల సమన్వయ బాధ్యతలు చూశారు. కులాలు, వర్గాలకు ఏమైనా హామీలు ఇవ్వాల్సి వచ్చినా అందుకు చర్యలు తీసుకునే అధికారాన్ని కూడా చంద్రబాబు సోమిరెడ్డికి కట్టబెట్టారు.

పక్కా....ప్లానింగ్....ఎగ్జిక్యూషన్.....

ఇక పోలింగు బూతుల వారీ పార్టీకి అనుకూలంగా ఓటింగు జరిగేలా స్థానిక కార్యకర్తల బృందాలకు ధనంతో సహా బాధ్యతలూ అప్పగించారు. ఇలా అన్నిరకాలుగా ప్లానింగు, ఎగ్జిక్యూషన్ పక్కాగా చేసుకున్నారు. మరోవైపు గోస్పాడు మండలంలో ప్రత్యర్థికి బలం బాగా ఉందని గ్రహించి అక్కడ మంచి పట్టున్న మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డిని ముగ్గులోకి లాగి వై.సి.పి. మెజార్టీని న్యూట్రల్ చేయగలిగారు. ఆయనతో చంద్రబాబే స్వయంగా సంప్రతింపులు జరిపి సెటిల్ చేయడం నాయకత్వ పరిణతికి నిదర్శనం. అన్నిటికంటే ముఖ్యం టీడీపీ పార్టీ భవిష్యత్ వారసుడు లోకేశ్ ను ఈ ఎన్నికకు దూరంగా ఉంచడం. రాయలసీమలో నాయకులు చాలా ఆత్మాభిమానంతో వ్యవహరిస్తుంటారు. లోకేశ్ వంటి అపరిపక్వ యువనేతకు బాధ్యతలు అప్పగిస్తే స్థానికంగా ఉన్న నాయకులతోనూ, మంత్రులు, ఎమ్మెల్యేలతోనూ ఏ సందర్భంలో అయినా అనుచితంగా ప్రవర్తించినా, పెత్తనం చేయాలని చూసినా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఇది గ్రహించే లోకేశ్ బాబును చంద్రబాబు వ్యూహాత్మకంగానే దూరం పెట్టారు. రాజకీయాల్లో సందర్భోచిత ప్రాప్తకాలజ్ణత అంటే ఇదే. అవసరమైనప్పుడు వారసుడిని కూడా దూరంగా పెట్టడమే రాజకీయాల్లో ముందు చూపు.

అనుభవం నేర్పిన పాఠాలే.....

చదరంగంలో ఆటకు అనుగుణమైన పావులను ఎంచుకోవాలి. ఇష్టం కదా అని నచ్చిన పావులతో ఎత్తుగడలకు దిగితే నిండా మునిగిపోతాం. 2014 ఎన్నికల నాటికి టీడీపీ పరిస్థితి అగమ్య గోచరం. వై.సి.పి మంచి ఊపు మీద ఉంది. గతంలో వద్దనుకున్న బీజేపీతో సంబంధాలను పునరుద్దరించుకునేందుకు చంద్రబాబు నాలుగు మెట్లు దిగారు. మోడీ హవాను తనకు అనుకూలంగా మలచుకొన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో పదేళ్లు ప్రతిపక్షనేతగా చేసినా అహాన్ని పక్కనపెట్టి పవన్ కల్యాణ్ వంటి అన్ సీజన్డ్ పొలిటీషియన్ తో చేతులు కలిపేందుకు అతని ఇంటికే వెళ్లి రాజకీయ దౌత్యం విజయవంతం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వై.సి.పి. ని నిరోధించగలిగారు. ఇదీ చంద్రబాబు వ్యూహం. రాజకీయ లౌక్యం. బీజేపీ, కమ్యూనిస్టులు 2014లో వై.సి.పి. తో పనిచేసేందుకు అర్రులు చాచినా కాలదన్నుకున్నారు జగన్. చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికను తన గెలుపుగా చూపించాలని తాపత్రయపడి స్థానిక అభ్యర్థికి వదలకుండా పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అటాచ్ మెంట్, డిటాచ్ మెంట్, ఎక్కడ పట్టు సాధించాలి? ఎప్పుడు విడిచి పెట్టాలి? వంటి అంశాలపై మరింత సాధన చేస్తే తప్ప నాయకునిగా జగన్ రాణించే పరిస్థితులు కనిపించడం లేదు. ఇదే వై.సి.పి.కి ప్రధాన సమస్య.

- ఎడిటోరియల్ డెస్క్

Similar News