వెంకయ్య... ది గ్రేట్.... తెలుగోడి సామర్థ్యం...!

Update: 2018-01-15 17:30 GMT

విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, వాకౌట్లు, వాయిదాతీర్మానాలు, నిరసనలు... ఇదీ స్థూలంగా చట్ట సభల పనితీరుకు సంబంధించిన విశ్లేషణ. పంచాయతీ నుంచి పార్లమెంటు సమావేశాల వరకూ ఇదే పరిస్థితి. రచ్చ...తప్ప చర్చకు చోటే లేని దుస్థితి. సగటు పౌరుడికి చట్టసభల సమావేశాలు అంటేనే చిన్న చూపు కలిగించే పరిణామాలకు లెక్కేలేదు.

బ్రిటన్ లో కూడా...

ఈ పరిస్థితి నుంచి ఉపశమనం కలిగించే పరిణామాలు చోటు చేసుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. ఇందుకు పెద్దల సభగా పేరుగాంచిన ఎగువ సభ వేదిక కావడం హర్షణీయం. వాస్తవానికి రాజ్యసభను ఎగువ సభగా కూడా వ్యవహరిస్తారు. బ్రిటీష్ సంప్రదాయం ప్రకారం దానిని పెద్దల సభగా పిలుస్తుంటారు. బ్రిటన్ లో హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ ఉన్నాయి. హౌస్ ఆఫ్ లార్డ్స్ ను మనదేశంలో గౌరవ సూచకంగా పెద్దల సభగా పిలుస్తుంటారు. ఇటీవల కాలంలో పెద్దల సభ తన పనితీరుతో నిజంగానే పేరుకు తగ్గట్లు వ్యవహరిస్తుంది. అందరి మన్ననలను అందుకుంది. తెలుగువాడైన ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన అత్యుత్తమ పనితీరు కనబరచి ఆదర్శంగా నిలవడం హర్షణీయం. ప్రజాస్వామ్య వాదులకు ఊరటినిచ్చింది. పదిహేనేళ్ల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.

వెంకయ్య ఛైర్మన్ గా....

డిసెంబరు 31న ఉప రాష్ట్రపతి, సభా ఛైర్మన్ వెంకయ్య నాయుడు అధ్యక్షతన యధావిధిగా సమావేశమైంది. నాటి అజెండాలో ఉన్న ప్రశ్నోత్తరాల సమయం, శూన్యగంట, ప్రత్యేక ప్రస్తావనల కింద అందరు సభ్యులూ మాట్లాడటం విశేషం. నాటి సమావేశానికి కొందరు సభ్యులు హాజరుకానప్పటికీ, వారి స్థానంలో ఇతరులకు అవకాశం కల్పించారు. దీంతో మొత్తం 18 మందికి మాట్లాడే అవకాశం లభించింది. పలు కీలకాంశాలను ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. ఏపీ నూతన రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం, జీఎస్టీ, బిట్ కాయిన్... దాని నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, మొండి బకాయీలు, సంప్రదాయేతర ఇంధన సంస్థల పనితీరుపై సమగ్ర చర్చ జరిగింది. ఔషధ ప్రయోగాలపై ప్రశ్నకు సంధించిన టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్ సభలో లేకపోవడంతో ప్రశ్నను రద్దు చేయకుండా మరో ఇద్దరికి అవకాశం కల్పించారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎయరిండియా నష్టాలపై ప్రశ్న వేసిన టీడీపీ సభ్యుడు దేవేందర్ గౌడ్ లేకపోవడంతో రద్దు చేయకుండా కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మకు మాట్లాడే అవకాశం కల్పించారు. ప్రశ్నోత్తరాలకు ముందు జీరో అవర్ లో 11 మందికి, ప్రత్యేక ప్రస్తావనలో మరో 11 మందికి మాట్లాడే అవకాశం లభించడంపై ఎంపీల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సభకు అడ్డుపడటం, అదనపు సమయం కోసం అర్థించడం, సభా వ్యవహారాల జాబితాలో అధిక అంశాలు ఉండటం వంటి సందర్భాల్లో కేవలం ప్రసంగ పాఠాలను మాత్రమే సభ ఉంచమని చెబుతుంటారు. కానీ వెంకయ్య నాయుడు మాత్రం సమన్వయంతో వ్యవహరించి భోజన విరామ సమాయానికి ముందే అందరికీ మాట్లాడే అవకాశం కల్పించడం హర్షణీయం.

ఐ బెగ్ అనే పదాన్ని తొలగించి....

ఇటువంటి అరుదైన సన్నివేశం 2002 నాటి సభాధ్యక్షుడు భైరాన్వ సింగ్ షెకావత్ హయాంలో చోటు చేసుకుంది. అప్పట్లో ప్రశ్నోత్తరాల జాబితాలోని అన్ని ప్రశ్నలనూ సంధించే అవకాశం సభ్యులకు లభించింది. అప్పట్లో ప్రశ్నలు వేసిన 20 మందిలో 10 మంది గైర్హాజరయినప్పటికీ ఛైర్మన్ ఇతర సభ్యులకు అవకాశం కల్పించడంతో ఈ అత్యుత్తమ ఘట్టం చోటు చేసుకుంది. తాజాగా ముప్పవరపు వెంకయ్యనాయుడు చొరవ, సమర్థత కారణంగా పెద్దల సభలో కార్యకలాపాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇతర చట్ట సభలకు ఆదర్శంగా నిలుస్తోంది. 1996 నుంచి ఏకధాటిగా నాలుగుసారలు పెద్దల సభకు ఎన్నికైన వెంకయ్య సభా వ్యవహారాలు, నిబంధనలు, చర్చల సరళి, ప్రభుత్వ, ప్రతిపక్షం అననుసరించే విధానాలపై స్పష్టమైన అవగాహన ఉంది. గతంలో రాజ్యసభకు అధ్యక్షత వహించిన ఛైర్మన్లను ఇంత సుదీర్ఘ అనుభవం కూడా లేదు. కొందరు ఉప రాష్ట్రపతులకు పెద్దల సభలో పనిచేసిన అనుభవం లేదు. కార్కకర్తల గానో, న్యాయమూర్తుల గానో, ఉప కులపతులుగానో ఉంటూ ఉపాధ్యక్షులుగా వచ్చారు. అందువల్ల వారికి సభా వ్యవహారాలపైఅంతగా అవగాహప. ఆసక్తి ఉండేది కాదు. దీంతో ముఖ్యమైన సందర్భాల్లో మినహా ఇతర సమాయాల్లో డిప్యూటీ ఛైర్మన్ కు బాధ్యతలు అప్పగించేవారు. రాజకీయ నేపథ్యం వారికి లేకపోవడం ఇందుకు మరో కారణం. గతంలో సభలో బిల్లులు ప్రవేశ పెట్టినప్పుడు మంత్రుల, సభ్యులు ఐ బెగ్ అని ఆంగ్లంలో అర్థించేవారు. ఇది బ్రిటీష్ ప్రభుత్వ వలస సంప్రదాయానికి చిహ్నమని, ఎవరూ ఎవరినీ అర్థించరాదని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయని అందువల్ల ఐ బెగ్ అనే పదం వాడకాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. తెలుగు వ్యక్తి ఆధ్వర్యలో పెద్దల సభ కొత్త పుంతలు తొక్కడం అభినందనీయం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News