వీరిద్దరే కీలకమా...?

Update: 2018-02-21 15:30 GMT

చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ అజెండాను నిర్దేశించే బంగారం లాంటి అవకాశాన్ని ఆయన చేజార్చుకుంటున్నట్లే. అదే సమయంలో జనసేన అదినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కీలకంగా మారుతున్నారు. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమని జనసేన నేరుగానే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపక్షాలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలను డిమాండు చేస్తోంది. తెలుగుదేశం తటపటాయిస్తున్నప్పటికీ జగన్ మాత్రం ఇప్పటికే స్పందించారు. వ్యూహాత్మకంగా టీడీపీని, జనసేనను వేరు చేసే అంశం కూడా దాగి ఉండటంతో అవిశ్వాసాన్ని అందిపుచ్చుకున్నారు. అయితే తమకు బలం లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. తెలుగుదేశాన్ని కూడా లాగేందుకూ ప్రయత్నించారు. కానీ ఈ ట్రాప్ లో పడకుండా జాగ్రత్త పడాలనే ఉద్దేశమే కావచ్చు కానీ చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. అవునని చెప్పలేక కాదని ఖండించలేక టీడీపీ సతమతమవుతోంది. అజెండా సెట్ చేసే అవకాశం ఇప్పుడు జనసేన, వైసీపీల కోర్టులోకి చేరింది.

జనసేనకు తూటా....

జనాకర్షణ, మీడియా హడావిడి తప్ప అంతంతమాత్రం పార్టీగానే కొనసాగుతున్న జనసేన తాజా గా ఒక్కసారిగా సంచలనాత్మకంగా మారింది. దొందూ దొందే అన్నట్లుగా కేంద్రప్రభుత్వంపై కర్రవిరగకుండా పాము చావకుండా తెలుగుదేశం, వైసీపీలు తమలపాకుల దెబ్బలు కొడుతున్నాయి. ఇదే అవకాశమని భావించిన పవన్ మేధావులు, సీనియర్ అధికారులు, రాజకీయవేత్తలతో కమిటీని నియమించి వాస్తవాలు వెలికి తీస్తానంటూ ప్రకటించింది మొదలు హడావిడి ప్రారంభమైంది. పవన్ నిజానికి సీరియస్ రాజకీయ వేత్త కాదు. కానీ ఏదేని అంశం చేపడితే రాష్ట్రవ్యాప్తంగా దానికి అత్యంత ప్రచారం లభిస్తుంది. బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న విషయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, ఎంపీలు హైలైట్ చేయగలిగారు. ఇక్కడ వైసీపీ వెనకబడింది. ముందస్తు వ్యూహం లేకుండా విజయసాయి రెడ్డి వంటి వారు బడ్జెట్ ను ప్రశంసించి దొరికిపోయారు. నాలుక కరుచుకుని ప్రత్యామ్నాయ వ్యూహం ఎంచుకోవడానికి ప్రయత్నించారు. అందులో భాగంగానే కేంద్రప్రభుత్వం అన్యాయం చేసిందంటూ ఎంపీల రాజీనామా వంటి దాగుడు మూతల ఎత్తుగడలకు దిగారు. ఇది పాత చింతకాయ పచ్చడి కావడంతో పెద్దగా పేలలేదు. దీంతో కేవలం విమర్శలు, మొక్కుబడి నిరసనలకే పరిమితమైన టీడీపీ ని , అదే సమయంలో ఎంపీల రాజీనామాల వంటి కాలాతీతమైన చెల్లుబాటు కాని అస్త్రాలను ప్రయోగించాలనుకున్న వైసీపీని ఒకే దెబ్బకు ఇరుకున పెట్టే ఆలోచనను బయటికి తీసింది జనసేన. ఉండవల్లి ఆలోచన రూపంలోని ఈ అస్త్రంపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బాగానే చర్చ జరుగుతోంది. పైపెచ్చు మీరు అవిశ్వాసానికి నోటీసు ఇవ్వండి. దానికి అవసరమైన 54 మంది సభ్యుల మద్దతు నేను కూడగడతానంటూ పవన్ బహిరంగంగానే ఇరు పక్షాలను సవాల్ చేయడం కూడా ఆసక్తి రేపుతోంది.

జగన్ ఊగిసలాట...

ప్రజామద్దతు ప్రబలంగా ఉన్నప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు జగన్. అతని పొలిటికల్ కెరియర్ కు కూడా బ్రేకులు వేసే స్థాయి బ్రహ్మాస్త్రాలు కేంద్రం వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఒక్క అడుగు ముందుకు వేయకుండా అన్ని వైపుల నుంచి కట్టడి చేస్తోంది. అలాగని కేసుల దర్యాప్తు పురోగతి పెంచడం లేదు. ఎక్కడికక్కడ చెక్ పాయింట్లు పెడుతోంది. 2019 ఎన్నికల తర్వాత ఏర్పడే పరిస్థితుల్లో అవకాశాలను బేరీజు వేసుకుంటోంది. విజయసాయి రెడ్డి వంటివారితో సత్సంబంధాలు మెయింటెయిన్ చేస్తోంది. వీటన్నిటి దృష్ట్యా సొంతంగా వైసీపీ కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లడమంటే దుస్సాహసమే. కానీ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఉన్న వైసీపీ స్థానాన్ని తాను ఆక్రమించాలని చూస్తోంది. అందులోనూ సెంటిమెంటు విషయానికొస్తే ప్రజలు సులభంగానే ఆకర్షితులవుతారు. జనసేన చేసిన డిమాండును స్వీకరించక తప్పని రాజకీయ అనివార్యత ఏర్పడింది. అయినా షరతులు వర్తిస్తాయన్నట్లుగా టీడీపీ కూడా తమతో కలిసిరావాలంటూ డిమాండ్ చేసింది. ఒకవేళ కేంద్రమే ఆగ్రహిస్తే తనతోపాటు తెలుగుదేశాన్ని కూడా ఇబ్బంది పెట్టాలనే ఎత్తుగడ ఇక్కడ కనిపిస్తోంది. జగన్ అనేక విషయాల్లో మొండి తనాన్ని ప్రదర్శిస్తుంటారు. కాంగ్రెసు నుంచి బయటికి వచ్చినప్పుడు, కేసుల విషయంలోనూ ఆయన దూకుడు అందరికీ తెలిసిందే. కొత్తగా పోయిందేముందనుకుని తెగిస్తే సాహసిగానే నిలుస్తారు.జనసేన కూడా కలిసిరావాల్సిందే. ప్రతిపక్షంగా తన ఆధిక్యాన్ని నిరూపించుకోవచ్చు. అవిశ్వాసం చర్చకు వస్తుందా? రాదా? అనేది పెద్ద విషయమే కాబోదు. వైసీపీ చిత్తశుద్ది వెల్లడవుతుంది. ఏపీ పొలిటికల్ అజెండా సెట్ చేయడంలో తనవంతు పాత్రను పోషించవచ్చు.

టీడీపీకి ఇరకాటం. ....

తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పక్షమే కాదు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న సంకీర్ణ భాగస్వామ్య పార్టీ. కొన్ని రాజకీయ అనివార్యతలు, పరిపాలనపరమైన ఇబ్బందులు దానిని వెంటాడుతున్నాయి. ఇంకా ఏడాదికి పైగా ఎన్నికల గడువు ఉండగానే కేంద్రంతో తెగతెంపులు చేసుకుంటే అమలు దశలో ఉన్న పథకాలు కుంటుపడతాయి. కేంద్రం నుంచి సహకారం లోపిస్తుంది. ఇప్పటికే వివిధ పథకాల నిధుల వినియోగానికి సంబంధించి యుటిలిటీ సర్టిఫికెట్లు సమర్పించడం లేదని రాష్ట్రప్రభుత్వంపై విమర్శలున్నాయి. నిధుల వినియోగంలో అవకతవకలపై ఆరోపణలతో కేంద్రం వద్ద బోలెడు ఫిర్యాదులున్నాయి. వీటిపై సీరియస్ గా దృష్టి సారించి విచారణకు ఆదేశిస్తే అంతేసంగతులు. స్కీములన్నీ మూలనపడతాయి. మొగ్గ దశలో ఉన్న కొత్తగా ప్రారంభమైన విద్యాసంస్థలు, కేంద్ర సంస్థల పనులకు బ్రేకులు పడతాయి. వీటన్నిటికీ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉంటుంది. ఒకవైపు జనసేన దూరమవుతోంది. వైసీపీ ఒత్తిడి పెరుగుతోంది. పాదయాత్రలో జగన్ విమర్శల దాడి పెంచారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ప్రజల్లో అభాసుపాలవ్వడం ఖాయం. ఎన్నికల రాజకీయం మొదలయ్యాక అటో ఇటో తేల్చుకోవాల్సిందే. కానీ ఎప్పుడన్నదే టీడీపీ సంకటం. ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా మరింత జాప్యం చేస్తే అధికారపక్షం పొరపాటును రాజకీయ అవకాశంగా మలచుకునేందుకు జనసేన, వైసీపీలు సిద్ధంగానే ఉన్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News