వీరికి పవన్ ఫోబియా...!

Update: 2018-01-27 15:30 GMT

కాంగ్రెసు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలకు పవన్ ఫోబియా పట్టుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి లాభించే విధంగా పవన్ ప్రచారయాత్రలు చేపట్టారని ఈ పార్టీలు బలంగా విశ్వసిస్తున్నాయి. అధికార పార్టీలకు వ్యతిరేకంగా సంఘటితమవుతున్న తమ ఓటు బ్యాంకుకు జనసేన గండి కొడుతుందేమోనని ఆందోళన చెందుతున్నాయి. అధికార పార్టీలపై తీవ్రమైన విమర్శలకు పోకుండా సమస్యలను ప్రస్తావిస్తూనే తన జనసేన నిలదొక్కుకునేలా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు పవన్ కల్యాణ్. ఇదే వైసీపీ,కాంగ్రెసుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. ఎన్నికలకు ఏడాది గడువున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం ఇప్పటికే ప్రవేశించింది. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు నిత్యం ఎన్నికల మూడ్ లోనే ఉంటారు. తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఓటు బ్యాంకు కోణంలోనే ఆలోచించి ప్రతిస్పందిస్తుంటారాయన. తెలంగాణ రాష్ట్రసమితి కూడా ఎన్నికలదిశలోనే విధానపరంగా అడుగులు కదుపుతోంది. పూర్తిస్థాయి ప్రచారాన్ని ముందుగా మొదలు పెట్టింది మాత్రం జగన్. పాదయాత్రతో జగన్ నవంబరు నుంచే ప్రజల్లోకి వచ్చేశారు. తాజాగా పవన్ కల్యాణ్ కూడా చలోరే చల్ అంటూ ప్రచార హల్ చల్ షురూ చేశారు.

కాంగ్రెసుదో కష్టం....

తెలంగాణ రాష్ట్రంలో 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ వరసగా కొడుతున్న దెబ్బలతో కాంగ్రెసు కుదేలవుతూ వస్తోంది. కాంగ్రెసుకు నేరుగా ఫీల్డులో ఒక్కవిజయమూ దక్కలేదు. ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ అధ్యక్షబాధ్యతలు స్వీకరించిన తర్వాత జవసత్తువలు తిరిగి పుంజుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నూతన చేరికలు, రేవంత్ వంటి వారి ప్రవేశంతో తెలంగాణ కాంగ్రెసు ఊపు తెచ్చుకోగలిగింది. మాటలు, ప్రచారంలో అధికారపక్షానికి దీటుగా వ్యవహరించగలుగుతోంది. సీపీఐ వంటి పార్టీలు కూడా కాంగ్రెసుతో జోడీ కట్టేందుకు సిద్ధమవుతున్నాయి. కేసీఆర్ వైఖరి సహించని టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీగానే కాంగ్రెసులో చేరేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ కు పోటీగా ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెసు రూపుదిద్దుకుంటోంది. నాయకుల మధ్యవిభేదాలను తాత్కాలికంగా పక్కనపెట్టి ఒకేమాటతో ఒకేబాటలో పయనించాలని నిర్ణయించుకున్నారు. ఈదిశలో అధిష్టానం కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. ఇటువంటి స్థితిలో పవన్ తెలంగాణలో సైతం నేనున్నానంటూ తయారు కావడం కాంగ్రెసుకు కొరుకుడు పడటం లేదు. యువతలో పవన్ కు మంచి ఆదరణ ఉంది. అతను చెప్పే సిద్దాంతాలు, చేసే ప్రసంగాలు తెలంగాణ రాజకీయ వాతావరణానికి సరిపోయేలా ఉంటాయి. దీంతో సమష్టిగా టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలన్న తమ ప్రయత్నానికి గండి కొడతాడేమోననే ఆందోళన కాంగ్రెసు నాయకుల్లో నెలకొంది. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంకుకు చిల్లుపడితే అది కచ్చితంగా కాంగ్రెసుకు నష్టదాయకంగానే పరిణమిస్తుంది.

వైసీపీకి ఓదార్పు తప్పదు...

2014 ఎన్నికల నాటికి మంచి ఊపుమీద ఉన్న వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రవిభజన, వివిధ సమీకరణల నేపథ్యంలో బీజేపీ, టీడీపీ కాంబినేషన్ ముందు ఎన్నికల్లో తలవంచాల్సి వచ్చింది. ఆ తర్వాత టీడీపీ ఓటు బ్యాంకును పెంచుకుంటూ వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, శ్రేణులను పార్టీలో చేర్చుకుంటూ నియోజకవర్గ స్థాయి ప్రాబల్యాన్ని టీడీపీ బాగా విస్తరించుకుంది. దీనిని వైసీపీ కూడా పసి గట్టింది. ప్రత్యామ్నాయంగా అధినేత జగన్ ప్రజల్లోకి నేరుగా వెళ్లడం ద్వారా నాయకుల నిష్క్రమణ నష్టాన్ని భర్తీ చేయాలని వ్యూహం సిద్దం చేశారు. ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకు పాదయాత్రను చేపట్టడం ఇందులో భాగమే. భారీ ఎత్తున ప్రచారంతోపాటు రాష్ట్రంలో పాదయాత్ర ఇంపాక్ట్ ప్రజల్లోకి వెళ్లాలనేది యోచన. సొంత మీడియా సాక్షి హోరెత్తిస్తుంటే, ఇతర మాధ్యమాల్లో పాదయాత్రకు ఓ మోస్తరు ప్రచారం లభిస్తోంది. కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఏదో పాదయాత్ర సాగుతోందనుకుంటున్నతరుణంలో పవన్ కల్యాణ్ ప్రవేశం ప్రచార బలాన్ని తలకిందులు చేస్తోంది. మొత్తం మీడియా పవన్ భజనలో పడిపోయింది. అదేమీ పవన్ పై ప్రేమ కాదు. జగన్ కంటే పవన్ కనిపిస్తేనే టీవీల కు రేటింగు పెరుగుతుంది. రేటింగు ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారాత్మక ధోరణిలోనే టీవీ యాజమాన్యాలు ఈ నిర్ణయం అమలు చేస్తున్నాయి. వైసీపీ మీడియా వ్యవహారాలు పర్యవేక్షించే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి , పూడి శ్రీహరి వంటి వారు రంగంలోకి దిగి తమ పరిధిలోని సంపాదకులు, యాజమాన్యాలతో మాట్టాడేందుకు ప్రయత్నించినా తగిన ఫలితం దక్కలేదు. కావాలంటే మీ పాదయాత్రను ఒకటికి రెండుసార్లు చూపించగలమే తప్ప పవన్ ప్రత్యక్ష ప్రసారాలను ఆపడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. దీంతో వైసీపీ నేతలు డీలా పడిపోయినట్లు పార్టీ వర్గాల సమాచారం.

అధికార పార్టీల ఆనందలహరి...

కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లోని రెండు అధికార పార్టీల సంబరం. వైసీపీ, కాంగ్రెసులను తాము లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరం లేకుండానే మరో శక్తి రంగప్రవేశం చేయడంతో ప్రచారంలో ప్రత్యర్థులు తేలిపోవడం అధికార పార్టీలకు ఆనందాన్నిస్తోంది. పవన్ ఇమేజ్ ముందు ప్రతిపక్షాలు వెలవెలబోతున్నాయి. అధికారపక్షాలను పెద్దగా దుయ్యబట్టకుండా తనకంటూ సొంతంగా ఓటు బ్యాంకు కోసం పవన్ ప్రయత్నం చేయడం టీఆర్ఎస్ , టీడీపీలను ఆనందంలో ముంచెత్తుతోంది. ఇది కచ్చితంగా విపక్షాల ఐక్యతా యత్నాలకు వ్యతిరేకమేనని భావిస్తున్నాయి. కాంగ్రెసు, వైసీపీల వైపు సంఘటితం కావాల్సిన ఓటు బ్యాంకులో చీలికకు పవన్ ప్రచార యాత్రలు దోహదం చేస్తాయని అధికార పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ పవన్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీల్లో చర్చనీయమవుతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News