వీరి ప్రత్యేక దేశం కల సాకారమయ్యేనా?

Update: 2017-10-09 18:29 GMT

ప్రపంచ వ్యాప్తంగా వివిధ వర్గాలు, జాతులు, మతాలు, తెగల ప్రజల ప్రత్యేక అస్థిత్వం కోసం పోరాడుతున్నాయి. తమదైన గుర్తింపు, గౌరవం కోసం రోడ్డెక్కుతున్నాయి. పరాయి పంచన బతకడానికి ససేమిరా అంటున్నాయి. అటువంటి వారిలో కుర్దులు ఒకరు. వివిధ దేశాల్లో విస్తరించిన వారు ప్రత్యేక కుర్దిస్తాన్ కావాలంటున్నారు. తమది ప్రత్యేకమైన జాతి అని, ఇతరుల దయాదాక్షిణ్యాలు, ఆధ్యర్యంలో తాము బతకలేమని బహిరంగంగా చెబుతున్నారు. తమకంటూ స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటున్నారు. గత నెలాఖరులో వారు తమంతట తాము రిఫరెండం నిర్వహించుకున్నారు. ఆయా దేశాలు వద్దన్నా, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు అభ్యంతరం చెపపినా లెక్క చేయకుండా ముందుకు వెళ్లారు.

డిమాండ్ ఈనాటిది కాదు.....

పశ్చిమాసియాలోని ఇరాన్, ఇరాక్, టర్కీ, సిరియా తదితర దేశాల్లో కుర్దులు విస్తరించి ఉన్నారు. 2.5 నుంచి మూడు కోట్ల జనాభా ఉండవచ్చని అంచనా. అత్యధికంగా ఇరాక్ లోనే కుర్దులు నివసిస్తున్నారు. దాదాపు 20 శాతం పైగానే ఇక్కడ ఉండవచ్చు. తమకంటూ ప్రత్యేక దేశం కావాలని వీరు ఆశపడుతున్నారు. ఆరాట పడుతున్నారు. ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా మద్దతు లభించనప్పటికీ ఎంతమాత్రం వీరు వెనక్కు తగ్గడం లేదు. స్వతంత్ర కుర్దిస్తాన్ డిమాండ్ ఈనాటిది కాదు. దానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1946లో ఇరాక్ లో కుర్దిస్ డెమొక్రటిక్ పార్టీ (కేడీపీ) ఆవిర్భవించింది. అప్పటి నుంచి పోరుబాటలో ఉన్నప్పటికీ లక్ష్యం దిశగా పెద్దగా ముందడుగు పడలేదు. 1975లో కుర్దిస్ డెమొక్రటిక్ పార్టీ నాయకుడైన జలాల్ తలబానీ పేట్రియాట్రిక్ యూనియన్ ఆఫ్ కుర్దిస్తాన్ (పీయూకే) పేరుతో మరో కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఇది అతివాద సంస్థగా పేరుగాంచింది. ఇరాక్ లోని కుర్దులు గతనెల 25వ తేదీన తమంతట తాము స్వయంగా రిఫరెండం నిర్వహించుకున్నారు. స్వతంత్ర కుర్దిస్తాన్ కు అనుకూలంగానే ఫలితాలు వచ్చాయి.

ఇరాక్ గరం...గరం.....

ఈ రిఫరెండంపై ఇరాక్ గరంగరంగా ఉంది. ఇప్పటికే ఇరాక్ లో భాగమైన ఉత్తర కుర్దిస్తాన్ ప్రాంతం పరిమితమైన స్వేచ్ఛ, స్వాతత్ర్యం అనుభవిస్తోంది. దీనికి సొంత పార్లమెంటు ఉంది. సొంత సైన్యాన్ని కూడా నిర్వహిస్తోంది. స్వతంత్ర విదేశాంగ విధానం ఉంది. పెద్దయెత్తున ఈ ప్రాంతంలో చమురుసంస్థలు విస్తరించి ఉండటంతో ఆదాయానికి కూడా ఢోకాలేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇరాక్ నుంచి వేరుపడాలన్నది ఉత్తర కుర్దిస్తాన్ అభిప్రాయం. రిఫరెండంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న ఇరాన్ కఠినంగా వ్యవహరిస్తుంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామన్న మసూద్ బర్జాని ప్రతిపాదనను అసలు పట్టించుకోలేదు. అంతేకాక కుర్దిస్తాన్ ప్రాంతంలోని బ్యాంకులకు విదేశీ కరెన్సీని నిలిపివేసింది. ఆ ప్రాంతంలోని ప్రధాన నగరాలైన ఎర్బిల్, సులేమానియాలకు విమాన సర్వీసులను కూడా నిలిపేసింది. అవసరమైతే సైనిక చర్యకు దిగుతామని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాక కుర్దిస్తాన్ ప్రాంతంలోని చమురుసంస్థలపై తనకే పూర్తి ఆధిపత్యం ఉందని స్పష్టంగా పేర్కొంది. పది శాతం కుర్దులు గల సిరియా, ఇరాన్ లు కూడా తమ దేశాల్లోని కుర్దులపై ఆంక్షలు విధించాయి. 19శాతం జనాభాగల టర్కీ కూడా వారి పట్ల కఠినంగానే వ్యవహరిస్తోంది. కుర్దుల్లో ఎక్కువ మంది సున్నీ ముస్లింలే. అయితే కొంత మంది మాత్రం సూఫీ ఇస్లాంను అనుసరిస్తుంటారు.

ఇప్పటికిప్పుడు కలిగే ప్రయోజనం?

ఇరాకీ కుర్దులు రిఫరెండం నిర్వహించినప్పటికీ ఇప్పటికిప్పుడు వారికి కలిగే ప్రయోజనం ఏమీ లేదు. సమీప భవిష్యత్తులో కూడా ప్రత్యేక దేశం ఏర్పాటయ్యే అవకాశం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయినప్పటికీ కుర్దిస్తానీలు కాడి వదిలేయకుండా పోరు కొనసాగిస్తుండటం విశేషం. తమకు మద్దతిచ్చే వారి కోసం ఎదురు చూస్తున్నారు. తమ వాదనను బలంగా విన్పిస్తున్నారు. అదే సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు కూడా. ఇరాక్ ఉత్తర ప్రాంతంలో ఐఎస్ఐఎస్ పోరాట సమయంలో వీరు అమెరికాకు మద్దతుగా నిలిచారు. ఫలితంగా అమెరికా వైఖరిలో కొంత మార్పు వచ్చింది. ప్రత్యక్షంగా కుర్దిస్తాన్ కు మద్దతు ప్రకటించనప్పటికీ, వారి డిమాండ్ ను పూర్తిగా కొట్టిపారేయక పోవడం గమనించ దగ్గ విషయం. మొదట్లో సద్దాం హుస్సేన్ కు వ్యతిరేకంగా కుర్దులను అమెరికా ప్రోత్సహించిన మాట వాస్తవం. సద్దాం పతనానంతరం అనుకున్నట్లే ఇరాక్ ఉత్తర ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కల్పించారు. సహజంగా స్వయం ప్రతిపత్తి కల్పించడం అంటే పరోక్షంగా ప్రత్యేక దేశం ఏర్పాటుకు మొదటి మెట్టు అని భావిస్తుంటారు. ఇప్పటికీ కొందరు అమెరికా నాయకులు ఏదో ఒక రూపంలో కుర్దుల పోరాటానికి మద్దతు పలుకుతూనే ఉన్నారు. కాని అదే సమయంలో కుర్దులు ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేయడం దాని ద్వంద ప్రవృత్తికి దర్పణం పడుతోంది. అంతర్జాతీయ సంస్థ అయితన ఐక్యరాజ్యసమితి కూడా రిఫరెండంకు వెళ్లొద్దనిసూచించింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కుర్దులు వెనకడుగు వేయకపోవడం వారి పోరాట పటిమకు నిదర్శనం. కుర్దులు ఒకపక్క పోరాటంతో పాటు లాబీయింగ్ ను కూడా చేస్తున్నారు. అమెరికాలోని రిపబ్లికన్ లు, డెమొక్రాట్ల నాయకులతో తరచూ మంతనాలు జరుపుతున్నారు. మరొక పక్క ఇప్పటికిప్పుడు ఇరాక్ ప్రభుత్వంతో ఘర్షణ పడే పరిస్థితి లేదు. తాము రిఫరెండం నిర్వహించినప్పటికీ ఇప్పటికిప్పుడు ఇరాక్ నుంచి విడిపోయే పరిస్థితి లేదని చెబుతున్నారు. అదే సమయంలో చర్చల ప్రక్రియ కొనసాగించాలని కోరుతున్నారు. ఇరాక్ తో పాటు టర్కీ, సిరియా, ఇరాన్ లు కూడా తమ దేశాల్లోని కుర్దుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

ఎప్పటికైనా సాధిస్తామన్న నమ్మకంతో.....

ఇన్ని వ్యతిరేకతలు ఉన్నా కుర్దులు వెనక్కు తగ్గే పరిస్థితులు కన్పించడం లేదు. ఏ ఒక్క ఉద్యమం, పోరాటం కూడా వెనువెంటనే ఫలించిన సందర్భాలు ఎక్కడా లేవని కుర్దులు గుర్తు చేస్తున్నారు. రిఫరెండం నిర్వహించడమే పెద్ద ముందడగు అని, తద్వారా తమ డిమాండ్ ను, ఆవేదనను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకురాగలిగామన్న సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కాకపోయినా ఏనాటికైనా తమ కల సాకారమయి తీరుతుందనన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆరోజు కోసం శాంతియుత పోరాటం చేయడం, అంతర్జాతీయంగా మద్దతు సమీకరించడం ప్రస్తుతం తమముందున్న కర్తవ్యమన్న కుర్దుల అభిప్రాయాన్ని ఎవరూ కాదనలేరు.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News