వీరి దారులు వేరని అర్థమయిందిగా...!

Update: 2017-11-29 15:30 GMT

’నిజాం నా రాజు. తెలంగాణ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అపారం.ఇంతవరకూ ఒక కోణంలోనే నైజాం పాలనను చూపించారు. చరిత్రను తిరగరాస్తాం.‘ అంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఒకవైపు ముస్లిం వర్గాలను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. రిజర్వేషన్ల వరమే కాకుండా సెంటిమెంటును కూడా జోడించి గణనీయమైన సంఖ్యలో ఉన్న ముస్లిం ఓట్లను గంపగుత్తగా టీఆర్ఎస్ పరం చేయాలనేది కేసీఆర్ ఎత్తుగడ. ప్రధాని నరేంద్రమోడీ పరోక్షంగా కేసీఆర్ వాదనను తుత్తునియలు చేశారు. అసలు హైదరాబాదు పేరు చెబితే సర్దార్ వల్లభభాయ్ పటేల్ గుర్తుకొస్తారని నిజాం పాలననుంచి హైదరాబాదును విముక్తం చేశారని ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులోనే ఘనంగా కొనియాడారు ప్రధాని. కేసీఆర్, మోడీ మనోభావాలు పూర్తి విరుద్ధంగా, భిన్నంగా ఉన్నాయన్న విషయం దీంతో స్పష్టమైపోయింది. రాజకీయ అవసరాలు ఎలా ఉన్నప్పటికీ సిద్ధాంతాల విషయంలో దారులు వేరని నాయకులిద్దరూ తేల్చి చెప్పేసినట్లే. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో పార్టీ కార్యక్రమాలకు మోడీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈసారి కొంత సమయాన్ని పార్టీకి కేటాయించడం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మెట్రో ప్రయాణం సహా తన వెంట ఉంచుకోవడం కొంత రాజకీయ చర్చకు దారి తీసింది. ఏదేనా చేయాలనుకున్న తర్వాత కేసీఆర్ ఎంత మొండి తనం ప్రదర్శిస్తారో నరేంద్ర మోడీ కూడా ఇదే రకమైన దూకుడుని కనబరుస్తారు. రానున్న ఎన్నికలకు తెలంగాణలో వీరి అజెండాలు ఏరకంగా ఉండబోతున్నాయన్న అంశం రేఖామాత్రంగా తాజా ఉదాహరణల ద్వారా వెల్లడవుతోంది.

మోడీ మాటల పరమార్థం...

ఏ సందర్బాన్ని అయినా వ్యూహాత్మకంగా వినియోగించుకోవడంలో మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఘనాపాఠీలే. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో పటేదార్లు బీజేపీకి దూరమవుతున్నారన్న వాదన సాగుతోంది. సర్దార్ పటేల్ ను కాంగ్రెసు నుంచి వేరు చేసి బీజేపీ సొంత మనిషిని చేసేసుకుంది. గుజరాత్ లో గడచిన 22 ఏళ్లుగా పటేదార్లు మెజార్టీ సంఖ్యలో బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. అయితే రిజర్వేషన్ల ఉద్యమం నేపథ్యంలో ఇటీవలనే బీజేపీపై కొంత అసంతృప్తి నెలకొంది. దీనిని సాధ్యమైనంతవరకూ చల్లబరచడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రపంచ పారిశ్రామిక సదస్సులో సైతం స్మరించడం ద్వారా తాము సర్దార్ కు పెద్దపీట వేస్తున్నామనే సందేశాన్ని పంపదలిచారు ప్రధాని. వల్లభభాయ్ అంటే గుజరాతీలు ఐకాన్ గా భావిస్తారు. జీవితమంతా కాంగ్రెసులోనే గడిపినా ఆ పార్టీ పటేల్ ను ఓన్ అప్ చేసుకోలేకపోయింది. తెలివిగా బీజేపీ మాత్రం ఆయన తమ మనిషే అన్నట్లుగా ముద్రించుకోగలిగింది. కమలనాథులకు ఇది బాగా కలిసొచ్చింది. పటేళ్లు దూరమవుతున్న నేపథ్యంలో మళ్లీ సర్దార్ ను , ఆయన సాధించిన విజయాలను స్మరించడం ద్వారా తామే ఆయనకు వారసులమంటూ ఓటింగును మళ్లించుకోవాలనే ఎత్తుగడ కూడా దాగి ఉంది. హైదరాబాదులో నిర్వహించిన వేదిక అంతర్జాతీయ సదస్సు కావడంతో గుజరాత్ లోనూ ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీనిని మోడీ తెలివిగా వినియోగించుకున్నారు. మరోవైపు నైజాం ను నిత్యం కీర్తిస్తున్న కేసీఆర్ కు ఆయన సమక్షంలోనే వేదిక మీద నుంచే ఘాటైన సమాధానమిచ్చినట్లయింది.

కారుతో కమలానికి పోటీ తప్పేట్లు లేదు...

హైదరాబాదు పర్యటన సందర్బంలో ప్రధానితో ముఖాముఖి భేటీకి ముఖ్యమంత్రి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ప్రధాని కార్యాలయం సానుకూలంగా స్పందించలేదు. సీఎం, పీఎంల కలయిక అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేశారు. పైపెచ్చు బీజేపీ నాయకులకు కొంత వ్యక్తిగత సమయాన్ని కేటాయించారు. టీఆర్ ఎస్ , బీజేపీల మధ్య పెరుగుతున్న దూరానికి ఇదొక సూచనగా పరిశీలకులు చెబుతున్నారు. గతంలో కేసీఆర్ తో కలిసినప్పుడు కొంత ఆత్మీయ వాతావరణం, సుహృద్భావం కనిపించేట్లుగా పీఎం ప్రవర్తించేవారు. ఈసారి మాత్రం అటువంటి సంకేతాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. కేటీఆర్ కు ఇచ్చినంత ప్రాముఖ్యం కూడా ప్రధాని కేసీఆర్ కు ఇవ్వలేదనేది ప్రత్యక్ష ప్రసారాలు చూసిన వారికి ఇట్టే అర్థమైపోయింది. నిజానికి తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏమంత ప్రోత్సాహకరంగా లేదు. నిజాం నవాబును ఆవాహన చేయడం ద్వారా రాష్ట్ర సర్కారు ఏమైనా చర్యలు తీసుకుంటే బీజేపీకి కొంత ఉత్సాహం వస్తుంది. ఒక్క ముస్లింలలో తప్ప తెలంగాణ సమాజంలో నిజాం పాలన పట్ల ఎవ్వరికీ సదభిప్రాయం లేదు. మతపరమైన విద్వేషం కూడా ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర లేపి ముస్లింలు కాంగ్రెసు వైపు వెళ్లకుండా నిరోధించేందుకు నిజాంను భుజాలపైకి ఎక్కించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. బీజేపీకి ఇదొక చక్కటి అవకాశం . మతపరమైన విభజన ద్వారా కాంగ్రెసు, టీఆర్ఎస్ లకు వ్యతిరేకంగా హిందూ ఓటును పోలరైజ్ చేసుకునేందుకు వీలవుతుంది.కేసీఆర్ చర్యలు బీజేపీ క్యాడర్ లోనూ, లీడర్లలోనూ నిస్సత్తువ ఆవరించిన నేపథ్యంలో కమలానికి కాసింత ఊపిరి పోసేందుకు పరోక్షంగా దోహదపడతాయనే చెప్పవచ్చు. రాష్ట్రాన్ని ప్రసాదించిన కాంగ్రెస్ కుదురుకుంటే రాజకీయంగా టీఆర్ఎస్ కు చిక్కులు తప్పవు. ముస్లిం వ్యతిరేకతతో బీజేపీ కొంత మేరకు లబ్ధిపొందినా అధికారం సాధించలేదు. కాంగ్రెస్ చుట్టూ మైనారిటీలు చేరితే మాత్రం అధికారానికే ఎసరు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ముస్లింలను ఆకట్టుకోవాలన్న తన వ్యూహమే సరైనదని కేసీఆర్ కూడా భావిస్తూ ఉండవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News