భారీగా పెరిగిన ఆస్తులు..!

Update: 2017-11-23 17:30 GMT

రాజీకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థలది అనినాభావ సంబంధం. పైకి పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నట్లు పార్టీలు ప్రకటించినప్పటికీ, అధికారంలోకి వచ్చాక అవి ఖచ్ఛితంగా వ్యాపారసంస్థలకు పరోక్షంగా ఊడిగం చేస్తుంటాయి. ప్రత్యక్షంగా ప్రజలకు మేలు చేస్తున్నట్లు ప్రభుత్వాలు కనపడినప్పటికీ, అంతర్లీనంగా, పరోక్షంగా వ్యాపారసంస్థలకు ఉపయోగ పడే విధానాలనే అవలంబిస్తుంటాయి. అందుకే వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆయా పార్టీలకు వాటి స్థాయిలను బట్టి విరాళాలను అందజేస్తుంటాయి. అధికార పార్టీకి సింహభాగం లభించడం అనివార్యం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి. జాతీయ పార్టీలే కాదు ప్రాంతీయ పార్టీలకూ వాటి స్థాయిని బట్టి విరాళాలు అందుతుంటాయి. వ్యాపార వేత్తల పార్టీగా పేరున్న బీజేపీకి ఇంకొంచెం అదనంగా సొమ్ము సమకూరుతుంది. గత ఐదేళ్లలో గుజరాత్ లో పార్టీలకు లభించిన విరాళాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా బోధపడుతుంది. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) (అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్) వెల్లడించిన తాజా వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ స్వచ్ఛంద సంస్థ తెలియజేసిన వివరాలను ఏ పార్టీ కూడా తోసిపుచ్చక పోవడం గమనార్హం.

అందిన విరాళాలివీ...

గుజరాత్ లోని ఆరు ప్రధాన పార్టీలకు 2011-12 నుంచి, 2015-16 ఆర్థిక సంవత్సరం వరకూ అందిన విరాళాల్లో భారతీయ జనతాపార్టీ అగ్రస్థానంలో ఉంది. కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో ఉంది. ఈ రెండింటితో పాటు మాయావతి ఆధ్వర్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ, శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐలు కూడా విరాళాలు పుచ్చుకున్నాయి. కాషాయ పార్టీకి సమకూరిన సొమ్ము గుజరాత్ లో 80.45 కోట్ల రూపాయలు. వీటిలో 71.35 కోట్లు (88.69 శాతం) కేవలం కార్పొరేట్ సంస్థల నుంచి అందినవే. గతంలో ఈ పార్టీకి అందిన విరాళాలతో పోల్చుకుంటే ఇది నాలుగురెట్లు అధికం. అధికార పార్టీ కావడం, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీకి పెద్దమొత్తంలో లభించింది. సహజంగానే వ్యాపార, వాణిజ్య సంస్థలతో బీజేపీ బంధం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. హస్తం పార్టీ అందుకున్న 14.09 కోట్లలో 13.57 (96.31 శాతం) కోట్లు కార్పొరేట్ సంస్థలనుంచి అందినవే కావడం గమనార్హం. ఇటు గుజరాత్ లో, అటు కేంద్రంలో అధికారంలో లేనప్పటికీ ఆ పార్టీని విస్మరించలేదు. రేపు కాలం కలిసి వచ్చి గుజరాత్ లో గెలిచినట్లయితే హస్తం పార్టీ ఖజానా కళకళలాడటం ఖాయం. వామపక్ష పార్టీలో కీలకమైన సీపీఎం కూడా పెద్దగా వెనకబడ లేదు. కార్పొరేట్ సంస్థలపై ఒంటికాలుపై లేచే ఆ పార్టీకి రూ. 3కోట్లు లభించడం చిన్నవిషయం ఏమీ కాదు. సీపీఐకి కేవలం లక్షరూపాయలు మాత్రమే లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎన్సీపీ, బీఎస్పీలకు లభించిన విరాళాల వివరాలు బహిర్గతం కాలేదు.

గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చినవే....

విరాళాలు తీసుకోవడం, ఇవ్వడం తప్పేమీ కాదు. అయితే ఇది పారదర్శకంగా జరగాలి. 1952 నాటి ప్రజాప్రాతినిధ్యం చట్టం లోని సెక్షన్ 29 (సి) ప్రకారం రూ.20,000లకు మించి ఏ పార్టీ విరాళం తీసుకున్నా వాటికి సంబంధించిన ‘పాన్’ వివరాలు ఉండాలి. అలా లేనట్లయితే అది చట్ట విరుద్ధమవుతుంది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలకు అందిన విరాళాల్లో 77 శాతం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి లభించాయని గణాంకాలు ఘోషిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో పారదర్శకత,జవాబుదారీతనం గురించి ప్రతినిత్యం నీతులు వల్లించే పార్టీలు విరాళాల విషయంలో గోప్యత పాటించడం ఎంతవరకూ సమంజసం? బీజేపీకి లభించిన విరాళాల్లో 10.48 శాతానికి, కాంగ్రెస్ అందిన విరాళాల్లో 8.47 శాతానికి పాన్ వివరాలు లేవు. రాజ్యాంగ బద్ధంగా, స్వతంత్ర ప్రతిపత్తిగల కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో కళ్లుమూసుకుని ఉండటం విచారకరం.

ఆస్తులు పెరగడంలో మాత్రం....

విరాళాలతో పాటు రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నాయకుల ఆస్తులు కూడా భారీగా పెరగడం గమనార్హం. రాజ్ కోట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 9.09 కోట్లను తన ఆస్తులుగా చూపారు. గతంలో ఆయన ఆస్తులు 7.51 కోనట్లు. అంటే ఆస్తుల విలువలో 21 శాతం వృద్ధి కనపడుతోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాల్లో గత అయిదేళ్లలో పెద్దగా మార్పు కన్పించనప్పటికీ ముఖ్యమంత్రి ఆస్తి మాత్రం పెరగడం గమనార్హం. ఈ నియోజకవర్గలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రనీల్ రాజ్యగురు ఆస్తుల్లో కూడా అనూహ్య పురోగతి కనపడుతోంది. 2012 ఎన్నికల్లో ఆయన 122. 59 కోట్లు తన ఆస్తులగా చూపగా, ప్రస్తుతం 141.22 కోట్లకు పెరిగిందని రిటర్నింగ్ అధికారికి సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు. వారిద్దరే కాదు. రాష్ట్రంలో అనేకమంది అధికార, విపక్ష శాసనసభ్యులు, నాయకులు, మంత్రుల ఆస్తులు భారీగా పెరిగాయి. అధికార పార్టీనే కాక విపక్షాలు కూడా ఈవిషయంలో పోటాపోటీగా ఉండటం విశేషం. చిన్నా చితకా పార్టీలు కూడా తమ తమ స్థాయుల్లో ఏమీ వెనకబడి లేదు. వ్యవసాయకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సంపన్న రాష్ట్రంలో ఈ పార్టీలకు అంత మాత్రం విరాళాలు లభించడం పెద్ద విశేషం ఏమీ కాదు. రిలయన్స్ అంబానీల కార్యక్షేత్రమైన ఈ రాష్ట్రంలో ఆ తరహా కార్పొరేట్ సంస్థల నుంచి పెద్దమొత్తంలో విరాళాలు అందకపోతేనే విచిత్రం. అందితే విశేషం కాదు. ఈ విషయాన్ని ఎవరైనా కాదనగలరా?

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News