విక్టరీ..మామూలుగా లేదు

Update: 2018-03-20 17:30 GMT

వ్లాదిమిన్ పుతిన్... ఇప్పుడు రష్యాలో మార్మోగుతున్న పేరు. మొన్నటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన మరో ఆరేళ్ల పాటు అంటే 2024 వరకూ అధ్యక్షుడిగా కొనసాగుతారు. తద్వారా జోసెఫ్ స్టాలిన్ తర్వాత సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన నేతగా చరిత్ర సృష్టించనున్నారు. 1999 నుంచి వరుసగా ఆయన అటు ప్రధాని, ఇటు అధ్యక్షుడిగా ఏదో ఒక పదవిలో కొనసాగుతున్నారు. 2000 నుంచి 2004 వరకూ, మళ్లీ 2004 నుంచి 2008 వరకూ రెండుసార్లు ప్రధానిగా పనిచేశారు. 2008 నుంచి రెండుసార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో పుతిన్ 76.68 శాతం భారీ ఆధిక్యంతో ఎన్నికయ్యారు. తాము ఊహించిన దాని కంటే అధిక ఓట్లు వచ్చినట్లు పుతిన్ ఎన్నికల ప్రచార సారధి ఆండ్రీ కొండ్రాషోవ్ తెలిపారు.

నావల్నీని అనర్హుడిగా ప్రకటించడంతో....

తాజా ఎన్నికల్లో పుతిన్ ను ఏడుగురు అభ్యర్థులు ఢీకొన్నారు. నిజానికి పుతిన్ ను సమర్థంగా ఢీకొనే శక్తి వీరికి లేదు. రష్యన్ ఆఫ్ పీపుల్స్ యూనియన్ నాయకుడు మ్యాగ్జిమ్ సురాకిన్, లిబరల్ డెమొక్రటిక్ పార్టీ తరుపున వ్లాదిమిద్ జిరినోవస్కీ, కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ గ్రోత్ అభ్యర్థి బోరిస్ టబోస్, కమ్యునిస్టు పార్టీ నాయకుడు పావెల్గ్రజెనిక్, య చ్లోక్ పార్టీ అభ్యర్థి గ్రిగోరియవిన్ స్కీ, మహిళా అభ్యర్థి కసానియా సబ్బాక్ పోటీలో ఉన్నప్పటికీ వారు సాధించిన ఓట్ల శాతం చాలా స్వల్పం. పుతిన్ కు గట్టిపోటీ ఇవ్వగల సమర్థుడైన ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీని ఎన్నికల సంఘం అనర్హుడిగా ప్రకటించడంతో ఎన్నికలు నిస్సారమయ్యాయి. ప్రోగ్రెస్ పార్టీ నాయకుడైన నావల్నీ పుతిన్ కు, ఆయన అవినీతికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. సభలకు జనం భారీగా తరలి వచ్చారు. రష్యా రాజ్యాంగం ప్రకారం ఒక అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎన్నికల సంఘం వద్ద ముందుగా తన పేరు నమోదు చేసుకోవాలి. ఇందుకు కనీసం 500 మంది ఓటర్లు మద్దతు ప్రకటించాలి. నావల్నీకి పెద్దయెత్తున ప్రజలు మద్దతు ప్రకటించారు. అయితే ఆయనపై ఉన్న పాత కేసులను సాకుగా చూపి ఎన్నికల సంఘం అనర్హుడిగా ప్రకటించింది. నావల్నీని పోటీ నుంచి తప్పించడానికే ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించిందన్న ఆరోపణలు బలంగా విన్పించాయి. ఎన్నికల సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. మొత్తం మీద నావల్నీ బరిలో లేకపోవడంతో జరిగిన ఎన్నికలు నిస్సారంగా మారాయి. దీంతో పుతిన్ విజయం ముందే ఖరారైంది. మెజారిటీ ఎంతన్నదే ముఖ్యం. పుతిన్ ప్రచార వర్గం ఊహించినట్లు మంచి మెజారిటీతోనే రావడం గమనార్హం.

అమెరికాను నిలువరించడంలో...

పుతిన్ విజయానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషిస్తే ఎన్నో అంశాలు వెలుగులోకి వస్తాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయన గెలుపునకు దోహదపడ్డాయి. 1999లో బోరిస్ ఎల్సిన్ నుంచి పుతిన్ అధికార పగ్గాలు అందుకునే నాటికి రష్యా పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అనంతరం మిగిలిపోయిన రష్యా పేరుకు అగ్రరాజ్యంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా దాని ప్రభావం అత్యంత పరిమితం. అయినప్పటికీ అంతర్జాతీయంగా అమెరికాను ఎదుర్కోవడంలో ఆయన విజయవంతమయ్యారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ దేశంగా అనేక విషయాల్లో అమెరికాను నిలువరించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా సిరియా విషయంలో అమెరికా ఏకపక్ష వైఖరిని అడ్డుకోవడంలో పుతిన్ పాత్రను ప్రజలు కొనియాడారు. ఒకప్పటి తన మిత్రదేశమైన సిరియాను అమెరికా చేతుల్లోకి వెళ్లకుండా నియంత్రించగలిగారు. అదే విధంగా ఉక్రెయిన్ నుంచి క్రిమియాను స్వాధీనం చేసుకోవడంలో ధైర్యంగా వ్యవహరించారు. ఉక్రెయిన్ ఒకప్పటి సోవియట్ యూనియన్ లో భాగం. ఉక్రెయిన్ లో భాగమైన క్రిమియా రష్యాలో కలవడానికి సిద్ధంగా ఉంది. దీంతో క్రిమియాను మళ్లీ రష్యాలో కలుపుకోవడంలో పుతిన్ పాత్రను ప్రజలు కొనియాడారు. అందుకే క్రిమియాలు 92 శాతానికి పైగా ఓట్లు పుతిన్ కు పడ్డాయి. అంటే దాదాపు ఏకపక్షంగా పోలింగ్ జరిగింది. రష్యాలో చేపట్టిన సంస్కరణలు, సరళీకృత విధానాలు, కార్మికుల కనీస వేతనాల పెంపు వంటి పుతిన్ నిర్ణయాలు ప్రజలపై ప్రభావితం చేశాయి.

రాజకీయంగా అణిచి వేసి....

పుతిన్ ప్రత్యర్థులను రాజకీయంగా అణిచివేశారన్న అభియోగాలను ఎదుర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం, వారిపై అక్రమంగా కేసులను బనాయించడం, అక్రమంగా అరెస్టులు చేయడం ద్వారా వారిని మానసికంగా దెబ్బతీశారన్న ఆరోపణలున్నాయి. అంతర్జాతీయంగా కూడా అనేక విమర్శలను పుతిన్ ఎదుర్కొన్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, అంతర్జాతీయ ఎన్నికల పరిశీలకులు రష్యా ఎన్నికల పనితీరును తప్పుపట్టారు. అంతర్జాతీయంగా పుతిన్ అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. తమదేశంలో అనుచితంగా వ్యవహరించిన 23 మంది రష్యా దౌత్యవేత్తలను బ్రిటన్ బహిష్కరించింది. 2016లో జరిగిన తమ దేశ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకు నిరసనగా అమెరికా... రష్యాపై ఆంక్షలు విధించింది. ఇంకా ఇతర పశ్చిమ దేశాల నుంచి కూడా రష్యా వ్యతిరేకతను ఎదుర్కొంది. అయినప్పటికీ పుతిన్ ను దేశీయంగా ప్రజలు బలంగా విశ్వసించారు. జాతీయంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా దేశ గౌరవ ప్రతిష్టలను కాపాడారని ప్రజలు నమ్మారు. అందువల్లే ఆయనకు ఏకపక్ష విజయం లభించింది. ప్రస్తుతానికి రష్యాపై పుతిన్ ప్రభావం చాలా బలంగా ఉంది. నేడు ఆయన ఎదురులేని,తిరుగులేని నేత.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News