వారసత్వమే రాహుల్ కు ఇబ్బందిగా మారిందా?

Update: 2017-10-06 17:30 GMT

కొందరికి వారసత్వం వరం. మరికొందరికి శాపం. ఘనమైన రికార్డులు సాధించిన పెద్దలు ఉంటే ఆ తర్వాత తరాలు వారి స్థాయిని అందుకోలేక ఆపసోపాలు పడుతుంటాయి. మొక్కుబడి విజయాలే పెద్దల ఖాతాలో ఉంటే .. సామర్థ్యం ఉన్న జెన్ నెక్స్ట్ కొత్త చరిత్ర సృష్టిస్తుంది. రాచరికాల నుంచి ఆధునిక ప్రజాస్వామ్యం వరకూ సాగిన ఘట్టాలు , చారిత్రక సత్యాలు ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయి. మొగలాయిల పాలనలో బాబర్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు..ఇలా ఒక్కొక్కరిది ఒక్కో రికార్డు. ప్రజాస్వామ్యంలోనూ తాత ముత్తాతల పనితీరుతో పోల్చి చూడటం సహజాతి సహజం. ప్రత్యేకించి ఉన్నతపదవులు చేపట్టడానికి వారసత్వమే ప్రధాన అర్హత అయిన సందర్బాల్లో పూర్వీకులకు సమ ఉజ్జీలుగా నిలుస్తున్నారా? లేదా అని వివిధ కోణాల్లో ప్రజలు, ప్రచార మాధ్యమాలు బేరీజు వేస్తుంటాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెసు కు అధ్యక్షునిగా పగ్గాలు తీసుకునేందుకు రాహుల్ కు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో అధికారికంగా ఈ బాధ్యతలు అప్పగించవచ్చని పార్టీ వర్గాలు బావిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ ఎన్నికల కమిటీ వివిధ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీల ద్వారా తీర్మానం చేయించి సోనియా చేతుల మీదుగా పట్టాభిషేకం జరిపేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తోంది.

రాహుల్ విష‍యంలో ఇది లోపించిందా?

2013లో ఉపాధ్యక్షునిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ ఎదురుచూస్తున్న క్షణం సాకారం కాబోతోంది. వారసులను రాజకీయాలకు పరిచయం చేయడంలోనూ, వారి సామర్థ్యాలను ఇంతలింతలు చేసి ప్రపంచానికి చాటి చెప్పడంలోనూ పొలిటికల్ గ్రూమింగ్ సాగుతూ ఉంటుంది. రాహుల్ విషయంలో ఇది లోపించిందనే చెప్పాలి. 14 సంవత్సరాల వయసులో నాయనమ్మను కోల్పోయింది మొదలు ఒక రకంగా చెప్పాలంటే ఏకాంతజీవితమే. భద్రతకారణాల రీత్యా భయం గుప్పెట్లో హోం ట్యూషన్లు, విదేశాల్లో మారు పేర్లతో చదువును కొనసాగిస్తూ కొంత భిన్నమైన మనస్తత్వంతోనే ఎదిగారు. పెద్దగా ఎవరితోనూ కలవకపోవడం, ఇతరుల విషయంలో తల దూర్చకుండా తన పని తాను చూసుకుపోవడం అన్నది రాహుల్ నైజం. ప్రజాజీవితంలో ఎదగాలనుకునే నాయకునికి నిజంగా ఈ లక్షణాలు ప్రతిబంధకాలే. జవహర్ లాల్ ను కాంగ్రెసు అధ్యక్షునిగా చేయాలని తలపోసిన మోతీలాల్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సర్దార్ వల్లభబాయ్ పటేల్ వంటి అగ్రనాయకుడు పోటీగా ఉన్నప్పటికీ నెహ్రూకి ప్రజాకర్షణ ఉందని నిరూపించేందుకు ప్రయత్నించారు. స్వాతంత్ర్యోద్యమంలో విరాళాల సేకరణ ప్రధాన బాధ్యతగా ఉండేది. నెహ్రూ విరాళాల కోసం జోలె పట్టేందుకు వెళ్లినప్పుడు భారీ,భూరి విరాళాలు వెల్లువెత్తేలా మోతీలాల్ తెర వెనుక మంత్రాంగం నెరపే వారని కాంగ్రెసు పెద్దల అభియోగం. గాంధీ మొదట్లో నెహ్రూ అభ్యర్థిత్వంపై పెద్దగా సానుకూలత చూపలేదు. పటేల్ అన్నివిధాలా అర్హుడైనప్పటికీ స్వాతంత్ర్యోద్యమ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే యువకుడైన జవహర్ వంటి వారి సారథ్యం అవసరమని గాంధీని ఒప్పించడంలోనూ మోతీలాల్ చాణక్యం కనిపిస్తుంది.

రాహుల్ కు ఎటువంటి అనుభవం.....

ఇందిర ను ప్రతి రాజకీయ నిర్ణయంలోనూ భాగస్వామిని చేస్తూ తీర్చిదిద్దారు జవహర్ లాల్. తాను ఉచ్చస్థాయిలో ఉండగానే ఆమెను 1959 లోనే కాంగ్రెసు అధ్యక్షురాలిని చేశారు. ఇందిర కూడా సంజయ్ గాంధీని తన వారసునిగా చేయాలని రాజకీయాల్లో వెంట తిప్పుకున్నారు. సంజయ్ మరణం తర్వాత రాజీవ్ ను 1980లలో రాజకీయ ప్రవేశం చేయించారు. నాలుగేళ్లు రాజకీయాభ్యాసం స్వయంగా చేయించారు. కానీ రాహుల్ కు ఇటువంటి అనుభవం కొరవడింది. తానింకా పూర్తిగా సాధారణ విద్య పూర్తి చేయకుండానే రాజీవ్ మరణించారు. కొంతకాలం గాంధీ కుటుంబం కాంగ్రెసు రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. 1998 నుంచి సోనియా నేత్రుత్వం చేపట్టినప్పటికీ రాజకీయంగా ఆమెకున్న అనుభవం అంతంతమాత్రమే. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయడం, పార్టీని పటిష్ట పరచడం, ప్రాంతీయ నాయకత్వాలను అదుపు లో ఉంచడం జాతీయ పార్టీగా కాంగ్రెసుకు ఎంతో అవసరం. ఇందిర, రాజీవ్ లు ఈవిషయంలో కఠినంగానే వ్యవహరించేవారు. కానీ సోనియా,రాహుల్ వైఫల్యం ఇక్కడ కనిపిస్తుంది. ఇందుకు ఒక పెద్ద ఉదాహరణగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తడబాట్లను చెప్పుకోవచ్చు. దశాబ్దాల కల నెరవేర్చినప్పటికీ తెలంగాణలో అధికారం దక్కించుకోలేకపోయారు. టీఆర్ఎస్ ను విలీనం చేసుకోలేకపోయారు. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని అదుపు చేయలేక ఆంధ్రప్రదేశ్ లో తమ పాత్ర కోల్పోయారు. ఇక్కడ రాజకీయ చాకచక్యం , నైపుణ్యం కొరవడటంతో దక్షిణాదిన పెద్ద రాష్ట్రంలో రెంటికీ చెడ్డ రేవడిలా మారింది పార్టీ పరిస్థితి. ఇది పూర్తిగా సోనియా, రాహుల్ ల వ్యూహలోపమే.

రాహుల్ వల్ల సాధ్యమవతుందా?

మరోవైపు కర్ణాటకలో సిద్ధరామయ్య పార్టీని మించి ఎదిగిపోయారు. పంజాబ్ లో కాంగ్రెసు గెలిచినా ఆ క్రెడిట్ అమరీందర్ సింగ్ ఖాతాలో జమ అయ్యింది. ఇటువంటివి ఇందిర హయాంలో ఊహించడానికి సైతం సాహసించని సంఘటనలు. రాహుల్ నిజాయతీ విషయంలో ఎటువంటి సందేహాలు, శషభిషలు లేవు. కాంగ్రెసుకు కొత్త రక్తం ఎక్కించేందుకు ఆయన ఎన్నో ప్రయత్నాలు సాగించారు. యువజన కాంగ్రెసు, విద్యార్థి సంఘాలకు సంస్థాగత ఎన్నికల నిర్వహణకు ప్రయత్నించారు. నియామక సంస్కృతికి నీళ్లొదలాలని భావించారు. ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడతారు. ఇవన్నీ మంచి లక్షణాలే. అయినప్పటికీ భారత భాగ్యవిధాతగా, శాంతి దూతగా పేరు పొందిన ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, టెక్నో పీఎం రాజీవ్ ల వారసునిగా పగ్గాలు చేపట్టనున్న రాహుల్ ను పూర్వీకుల ఘన చరిత్ర కాసింత భయపెడుతోంది. జీవితానుభవం, పెరిగిన వాతావరణం, సమస్యలను సామాన్యుని కోణంలోంచి అర్థం చేసుకునే తీరు వారికొక ప్రత్యేకత తెచ్చిపెట్టింది. సొంత కాళ్లమీద డక్కామొక్కీలు తింటూ ప్రస్థానం సాగిస్తున్న రాహుల్ కు ఇది పెద్ద బాధ్యతే. పేరుకు వారసుడే కానీ శిథిలభవనాల నుంచి ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ కాంగ్రెసు పునర్వైభవ భవనాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది. శ్రేణులు చిత్తశుద్ధితో సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది. యువతరానికి ప్రాతినిధ్యం వహించే వయసు, దేశం మూలమూలలా విస్తరించిన పార్టీ పాన్ ఇండియా గుర్తింపు రాహుల్ కర్తవ్య నిర్వహణకు ఆసరాగా నిలుస్తాయని ఆశించవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News