వసుంధరకు... ఈసారి అంత ఈజీ కాదు...!

Update: 2017-12-25 17:30 GMT

భారతీయ ఓటర్లు బహు వివేచనపరులు. స్థూలంగా చూసినప్పుడు కులం, మతం, ప్రాంతం, వర్గం ప్రాతిపదికగా వారు విడిపోయినట్లు కనపడుతుంటారు. కాని సున్నితంగా పరిశీలిస్తే వాస్తవం లేదనిపిస్తోంది. సత్వర పాలనకు పట్టం కడతారు. దుష్టుల పాలనను దండిస్తారు. వ్యక్తులెంత గొప్పవారైనా... వారు దారి తప్పినప్పుడు దండించడానికి ఏమాత్రం వెనుకాడరు. చరిత్ర చెబుతున్న చేదు నిజాలివి. తాజాగా రాజస్థాన్ జిల్లా, మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగలడాన్ని ఈ కోణంలో నుంచే చూడాలి. ముఖ్యమంత్రి వసుంధరే రాజే కు మంచి పాఠమే నేర్పారు ఓటర్లు. ఈ నెల మూడో వారంలో వెల్లడయిన ఈ ఫలితాలు అధికార బీజేపీకి, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి వసుంధరకు చెంపపెట్టులాంటివి. బన్స్ వారా, దిల్ వారా, జలోర్, కరవలి జిల్లా పరిషత్తుల్లోని నాలుగు స్థానాలను విపక్ష కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. అధికార బీజేపీకి ప్రజలు మొండిచేయి చూపారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో రాజే సర్కార్ పట్ల గూడుకట్టుకున్న అసంతృప్తికి ఈ ఫలితాలు నిదర్శనం. 19 జిల్లాల్లోని 27 పంచాయతీ ఫలితాలకు గాను 16 చోట్ల విజయం సాధించి కాంగ్రెస్ పునరుజ్జీవాన్ని పొందింది. బీజేపీ కేవలం 10 చోట్ల విజయం సాధించడం కొడిగడుతున్న పార్టీ ప్రాభవానికి సంకేతంగా నిలుస్తోంది. మరోస్థానాన్ని స్వతంత్రులు గెలుచుకున్నారు. రెండు నగర పాలిక ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ విజయం సాధించడం విశేషం. ఈ రెండూ బరన్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఇక్కడి నుంచి స్వయంగా ముఖ్యమంత్రి రాజే తనయుడు దుష్యంత్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. ముఖ్యమంత్రి కుమారుడి నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆయా వర్గాల్లోని ప్రజాప్రతినిధుల రాజీనామా, అనర్హత, మరణం కారణంగా ఈ ఉప ఎన్నికలు జరిగాయి. తాజాఫలితాల నేపథ్యంలో త్వరలో జరగనున్న రెండు లోక్ సభ, ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న ఆందోళన అధికార బీజేపీలో వ్యక్తమవుతోంది. అజ్మీర్, అల్వార్ లోక్ సభ స్థానాలతో పాటు మందల గర్హ్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పురపాలక ఉప ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించలేకపోయింది. నగరపాలకసంస్థల పరిధిలోని 27 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 16 కైవసం చేసుకుంది.

గత ఎన్నికల్లో మాదిరిగా...

2013 డిసెంబరు లో జరిగిన అసెంబ్లీ, 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అప్రతిహిత విజయాలు సాధించిన బీజేపీకి తాజా ఫలితాలు ఎంతమాత్రం మింగుడు పడటం లేదు. మరో ఏడాదిలో (2018 డిసెంబర్ లో) అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనున్న తరుణంలో వెల్లడయిన ఈ ఫలితాలు పార్టీ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాంగ్రెస్ కు చెందిన రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్వవహారాల ఇన్ ఛార్జిగా పనిచేశారు. సీనియర్ నాయకుడు, ఓబీసీ వర్గానికి చెందిన గెహ్లాట్ రాష్ట్రంలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు. 2018 డిసెంబర్ లో జరగనున్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఆయన ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. 2013 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. మొత్తం 200 స్థానాలకు గాను కమలం పార్టీ 162 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ కేవలం 21 స్థానాలకే పరిమితమయింది. బీఎస్పీ మూడు, ఇతరులు పదమూడు స్థానాలను గెలుచుకున్నారు. ఆరునెలల అనంతరం 2014 మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా కాషాయ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 25 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి తనకు తిరుగులేదని చాటింది. అటువంటిది తాజా ఉప ఎన్నికల్లో వెల్లడయిన ఫలితాలు అధికార బీజేపీకి హెచ్చరిక వంటిదే. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం.. అధికార బీజేపీకి అంత తేలిక కాదు. ముఖ్యమంత్రి వసుంధర రాజే అహంకార పూరిత వైఖరి, రిజర్వేషన్ల కోసం గుజ్జర్ల ఆందోళన కారణంగా పార్టీ ప్రజలకు దూరమవుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ ఇప్పటి నుంచే సమాయత్త మవతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News