వదిలించుకోవాలన్నదే అందరి ధ్యేయమా...?

Update: 2018-02-01 15:30 GMT

విచిత్రం. రాజకీయం అనూహ్యం. ఇద్దరూ విరుచుకుపడుతున్నారు. సై అంటూ రంకెలు వేస్తున్నారు. ఎదుటివాని శత్రువు తనకు మిత్రుడన్న పాత సామెత వట్టిపోయింది. పోరాటానికి పోటాపోటీ తయారవుతున్నారు. పోటీలు పడుతున్నారు. కేంద్రంపై కారాలు,మిరియాలు నూరుతున్న ఈ రెండు ప్రధానపార్టీలు తెలుగుదేశం,వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ. సడన్ గా ఈ రెండు పార్టీలకూ కమలంపై ఎందుకు కక్ష పుట్టింది?. ఎందుకు ఆగ్రహం కట్టలు తెంచుకొంటోంది?. ‘సర్దుకుపోవాలి. మనకు అవసరాలున్నాయి. కేంద్రాన్ని కాదని సాధించేదేమీ లేదం‘టూ నిన్నామొన్నటివరకూ సన్నాయినొక్కులు నొక్కారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. బీజేపీ తో జట్టుకట్టేందుకు మేమేం వెనకాడమంటూ షరతులతో పొత్తుకు సై అంటూ సంసిద్ధత వ్యక్తం చేశారు జగన్. అంతలోనే ఎందుకు మార్పు వచ్చింది. అంతగా మారిపోయిన వాతావరణం ఏం కనిపిస్తోంది? ప్రశ్నించుకుంటే ప్రత్యక్షంగా కనిపించే సమాధానమే రాజకీయం. 2018 -19 ఆర్థిక సంవత్సరానికి కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తమ రాష్ట్రప్రయోజనాలు అర్జెంటుగా గుర్తుకు వచ్చాయి ఈ రెండు పార్టీలకు. కేంద్రాన్ని దుమ్మెత్తి పోయడంలో ఎదుటిపక్షం ఎక్కడ పైచేయి సాధిస్తుందోనన్న ఆదుర్దాతో రాజీనామాల సహా సరే అంటూ విరుచుకుపడుతున్నారు ఇరు పార్టీల నాయకులు.

‘పొత్తు‘ గిట్టని పోరుబాట...

2014 నుంచీ కలిసి నడుస్తున్న తెలుగుదేశానికి కేంద్రంలోని బీజేపీ నుంచి అనేక అవమానాలు ఎదురయ్యాయి. రాష్ట్ర విభజన సందర్బంగా ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చుకోవడానికి కాలికి బలపం కట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలుమార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు. అనేకసార్లు ప్రధాని అపాయింట్ మెంట్ కూడా దొరకలేదు. ఇప్పటికే కేంద్రం మూడు పర్యాయాలు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఏ బడ్జెట్ లోనూ ఆంధ్రప్రదేశ్ కు పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదు. కేంద్రప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి కూడా. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బీజేపీనే కాదు, తెలుగుదేశం కూడా పాత్రధారే. చిన్నాపెద్ద తేడాలంతే. మూడు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నప్పటికీ తీవ్రస్థాయిలో అసంత్రుప్తిని వ్యక్తం చేయలేకపోయింది తెలుగుదేశం. రాష్ట్రవిభజనలో నాలుగే నాలుగు ప్రధాన అంశాలను కేంద్రం నెరవేర్చాల్సి ఉంది. పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వేజోన్, రాజధాని నిర్మాణం... పోలవరం పై నిన్నామొన్నటి వరకూ కొర్రీలు వేస్తూ వచ్చింది. ఇప్పటికీ రాష్ట్రప్రభుత్వం సమర్పించిన రివైజ్డ్ అంచనాలకు కేంద్రం ఆమోదం తెలపలేదు. పనులను వేరే కాంట్రాక్టరుకు అప్పగించి పూర్తిచేయించడానికి మాత్రమే అంగీకారం తెలిపింది. ఏడాది క్రితం తీసుకోవాల్సిన ఈ నిర్ణయానికి సూత్రప్రాయమైన ఆమోదానికే సంవత్సరం జాప్యం చేసి సమయం వృథా చేసింది. 33 వేల కోట్ల రూపాయలకు చేరుకున్న పునరావాస ప్యాకేజీపై నోరు మెదపడం లేదు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పక్కనపెట్టేశారు. రాజధాని నిర్మాణం అన్నది అంతుచిక్కని ప్రక్రియగా మారింది. 15 వందల కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. ఇవన్నీ తెలిసి కూడా గతంలో బడ్జెట్ల సందర్బంగా రాష్ట్రప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ పట్టుపట్టలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీపై కొంత అసహనంతో ఉన్నారు. బీజేపీతో పొత్తు గిట్టుబాటు కాదని తాజాగా అనేక సర్వేల్లో తెలుగుదేశం పార్టీ అంచనాకు వచ్చింది. దీంతో బడ్జెట్ సందర్బంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని బీజేపీని ఇరుకున పెట్టే వ్యూహానికి దిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగుదేశం ఎంపీలు, మంత్రులు, కీలక నాయకులతో మంతనాలు ప్రారంభించారు. రాజీనామాలు సహా దేనికైనా సిద్దంగా ఉండాలంటూ సంకేతాలిచ్చేశారు. పైకి మాత్రం తొందరపడటం లేదంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు.

మంచి తరుణం....ఒకే దెబ్బకు రెండు పిట్టలు..

బీజేపీతో పొత్తు ప్రతిపాదన చేసి రాజకీయంగా అపరిపక్వతను చాటుకుంది జగన్ శిబిరం. ఆ సందర్బంగా వాటిల్లిన నష్టాన్ని పూడ్చుకునేందుకు బడ్జెట్ ను తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించుకుంది. వైసీపీ అధికారంలోకి రాకుండా నిరోధించిన తెలుగుదేశం, బీజేపీ కాంబినేషన్ ను దెబ్బతీయడం కూడా ఈ వ్యూహంలో భాగమే. రాష్ట్రప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందన్న అంశాన్ని ఫోకస్ చేస్తే తెలుగుదేశం, బీజేపీతో కలిసి నడవని పరిస్థితి ఏర్పడుతుంది. తాము రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరించడం ద్వారా టీడీపీ ని ఇరకాటంలోకి నెట్టవచ్చు. బీజేపీ, వైసీపీ పరస్పర వ్యతిరేకమైన ఓటు బ్యాంకు కలిగిన పార్టీలు. ఒకరితో ఒకరు కలిస్తే ఒన్ ప్లస్ ఒన్ కాదు. జీరో కూడా కావచ్చనే రాజకీయ సామెత ఈ పార్టీలకు వర్తిస్తుంది. అందువల్ల బీజేపీని ఎంత గట్టిగా వ్యతిరేకించగలిగితే అంతగానూ తమ ఓటు బ్యాంకు కన్సాలిడేట్ అవుతుందనే నమ్మకం వైసీపీకి ఉంది. టీడీపీ మధ్యేవాద పార్టీ. అందువల్ల సిద్దాంతపరంగా, బలంగా బీజేపీని వ్యతిరేకించలేదు. దీనిని కూడా వైసీపీ చక్కగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తోంది. బడ్జెట్ ను ప్రాతిపదికగా చేసుకుంటూ గళమెత్తి, గతంలోని పొరపాటు ప్రకటనలను సరిదిద్దుకోవాలని చూస్తోంది. ఏదేమైనప్పటికీ ఎన్నికలకు ఏడాదిలోపు గడువు మాత్రమే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పొలిటికల్ ఈక్వేషన్ మాత్రమే ప్రమాణంగా తాజా బడ్జెట్ పై విమర్శలను చూడాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. టీడీపీ, వైసీపీ పోటాపోటీ వ్యతిరేకతలు, కేంద్రంపై ఆగ్రహావేశాల ప్రకటనలను రాజకీయ కోణంలోనే అర్థం చేసుకోవాలంటున్నారు.

పోతే పోనీ..పొల్లు..

బీజేపీ నాయకత్వం కూడా టీడీపీ, వైసీపీ ల విమర్శల విషయంలో లొంగిపోయే ధోరణి కనబరచకూడదని భావిస్తున్నట్లు ఢిల్లీ సమాచారం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులతో అమిత్ షా సమావేశమై ఇందుకు సంబంధించి స్పష్టమైన సూచనలు చేశారు. తాము ఏపీకి ఏం చేశామనే జాబితాను వెల్లడిస్తూ ప్రజల్లోకి వెళ్లడమే పార్టీకి దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగిస్తుందని నూరిపోసినట్లు తెలుస్తోంది. మిత్రపక్షంగా తెలుగుదేశం బలంపై ఆధారపడటంతో ఏపీలో పార్టీ సొంతంగా ఎదగలేకపోయింది. కేవలం రాష్ట్రవిభజన సెంటిమెంటును ప్రయోగించి బీజేపీని దొంగదెబ్బతీయాలని చూస్తే తెలుగుదేశం,వైసీపీ రెండుపార్టీలు నష్టపోయే ప్రమాదం ఉందని బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కేంద్రంపై ఆధారపడి మాత్రమే ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణం సాధ్యమవుతుంది. టీడీపీ ఈ విషయాన్ని విస్మరిస్తే ఈ ఏడాది కాలంలోనే చుక్కలు చూపించగల సామర్థ్యం కేంద్రానికి ఉంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ పై నమోదైన కేసుల విచారణ శీఘ్రతరమవుతోంది. బెయిలుకు వీలు లేని విధంగా మరోసారి జగన్ కటకటాలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి కూడా తలెత్తవచ్చనేది కమలనాథుల అంచనా. అదే జరిగితే అటు వైసీపీ కూడా బీజేపీని వ్యతిరేకించి పొందే ప్రయోజనం ఏమీ ఉండదు. ఏతావాతా పార్టీని సొంతంగా పటిష్టం చేసుకునే అవకాశంగా ప్రస్తుత వాతావరణాన్ని నిర్వచించుకొంటోంది బీజేపీ. సిద్దాంత బలంతో రాజీ పడకుండా ఒంటరిగా ముందడుగు వేయాల్సి వస్తే అందుకు సిద్దం కావాలనేది అగ్రనాయకత్వం సూచనగా కమలగణాలు చెబుతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News