లొల్లి తేలేలా లేదే ?

ఒకరు తెలంగాణాలో కాంగ్రెస్ కి ఇక మనుగడ లేదని కమలం పై కన్నేశారు. మరొకరు కాంగ్రెస్ లో వున్న స్వేచ్ఛ బిజెపి లో ఎక్కడిదంటూ ప్రశ్నిస్తున్నారు. వారిద్దరే [more]

Update: 2019-06-19 02:30 GMT

ఒకరు తెలంగాణాలో కాంగ్రెస్ కి ఇక మనుగడ లేదని కమలం పై కన్నేశారు. మరొకరు కాంగ్రెస్ లో వున్న స్వేచ్ఛ బిజెపి లో ఎక్కడిదంటూ ప్రశ్నిస్తున్నారు. వారిద్దరే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా వుంటూ వస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ను వీడి రాను అంటూ ఉంటే చిల్లు పడిన పడవలో నే ఉండను పో అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ తతంగం ఎన్నికల ముందు నడిచింది. రాజగోపాల్ రెడ్డి టికెట్ పై పెద్ద పంచాయితీ నడిచిన సందర్భంలో అధిష్టానంపై నేరుగా నిప్పులు చెరిగి జనంలో హైలెట్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఈ లొల్లి పెంచుకుంటే పార్టీకి నష్టమే అని భావించి షోకాజ్ నోటీసుతో సరిపెట్టింది కాంగ్రెస్. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో మరో షోకాజ్ నోటిస్ ఇచ్చి రాజగోపాల్ ప్రతి చర్య కోసం నిరీక్షిస్తుంది కాంగ్రెస్. ఉన్నఫళంగా బయటకు పంపిస్తే హాయిగా అధికార బిజెపిలో చేరడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని వ్యూహాత్మక చర్యలకు సిద్ధమైంది.

గెలిస్తే మేము … ఓడితే పార్టీనా అంటున్న విహెచ్ …

రాజగోపాల్ రెడ్డి తాజా రాజకీయంపై టి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత్ రావు తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. గెలిచినప్పుడు మా వల్లే అనే కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ ఓడిపోతే మాత్రం అంతా పార్టీ వల్లే అనడం రివాజుగా వస్తుందని సెటైర్లు విసిరారు. అవకాశవాదులు పోతే ఎంత ఉంటే ఎంత అంటూ సీరియస్ అయ్యారు విహెచ్.

మాకు అదే ఇచ్చివుంటే ….

తమకు గాని టిపిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించి ఉంటే తెలంగాణాలో కాంగ్రెస్ కి ఇంత దుస్థితి వచ్చి ఉండేదే కాదంటున్నారు రాజగోపాల్ రెడ్డి. తానేమి పార్టీ మారాలని అనుకోవడంలేదంటూ పార్లమెంట్ బయట స్ఫష్టం చేసేసారు. మోడీ ని ప్రశంసిస్తే రాహుల్ ను నిందించడం ఎలా అవుతుందని పార్టీ నేతలను దుమ్మెత్తిపోశారు ఆయన.తెలంగాణ కాంగ్రెస్ లో విపక్షం తుడిచిపెట్టుకుపోవడానికి సొంత పార్టీ వారే కారణమని ఆరోపించారు. మొత్తానికి రాజగోపాల్ వెర్సెస్ టి కాంగ్రెస్ గా మారిన ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి .

Tags:    

Similar News