లెక్కలు మొదలయ్యాయ్

Update: 2018-03-25 16:30 GMT

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము ఎన్ని సీట్లు సాధించగలము? ఏయే సమీకరణలతో ముందుకు వెళ్లాలి? ప్రత్యర్థులకు చుక్కలు చూపించడమెలా? ఆధునిక టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలి? వంటి అంశాలపై పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో కొంచెం ఎక్కువ హడావిడి కనిపిస్తోంది. తెలంగాణలో ఇంకా సందడి ప్రాథమిక దశలోనే ఉంది. ఏపీలో పొలిటికల్ హీట్ ఇప్పటికే పీక్ కు చేరిపోయింది. ప్రత్యేక హోదా అంశం పుణ్యమా అని అందరూ అదే పాట పాడుతున్నారు. చిత్తశుద్ధితో ఈ విషయంలో పోరు సలపగలవారెవరని ప్రజలు భావిస్తారో అటువైపే మొగ్గు కనిపించే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో తనకు తిరుగులేదనుకుంటున్న కేసీఆర్ జాతీయ ముద్రతో రాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేసే దిశలో పావులు కదుపుతున్నారు. తెలంగాణలో టీడీపీ తరహాలోనే ఆ పార్టీకి నిన్నామొన్నటివరకూ మిత్రపక్షమైన బీజేపీ కూడా తన వాటా కోల్పోయే ప్రమాదం కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేనలదే ఈసారి ప్రధాన పోటీ . కాంగ్రెసు బాటలోనే బీజేపీ కూడా తన పాత్ర,పరిధిని కుదించుకోకతప్పదంటున్నారు. మొత్తమ్మీద రాజకీయ లెక్కలు మొదలయ్యాయి.

చీలిక ..చిక్కుముడులు....

కచ్చితంగా బహుముఖ పోటీ తప్పని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడింది. ఇప్పటికే ఆ స్పష్టత వచ్చేసింది. ఒకవేళ ఏ ఒక్కపార్టీ మరో పార్టీతో కలిసినా అవకాశవాద పొత్తుఅనే రీతిలో రాజకీయం మధ్య విభజన రేఖలు వచ్చేశాయి. మూడు పక్షాలు ప్రధాన పోటీదారులుగానూ, మరో రెండు జాతీయ పార్టీలు తాము కూడా బరిలో ఉన్నామనేరీతిలో తలపడబోతున్నాయి. విచిత్రమైన అంశమేమిటంటే అన్నిపార్టీలు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాన ప్రచారంలో ఉంచబోతున్నాయి. బీజేపీ కూడా తాము ప్రత్యే క హోదాకు సమానమైన ప్యాకేజీ ఇచ్చాం. రెండూ సమానమే అని చెబుతుంది తప్ప హోదా అంశాన్ని పక్కనపెట్టేశామని చెప్పే సాహసం చేయదు. అధికార తెలుగుదేశం పార్టీ మిగిలిన రెండు ప్రధాన పోటీ దారులైన వైసీపీ, జనసేనలకంటే తామే ఈ హోదా అంశాన్ని ఎక్కువగా డిమాండ్ చేస్తున్నామన్న భావన రేకెత్తే రీతిలో ఇప్పటికే ప్రచారాన్ని మొదలెట్టేసింది. ముఖ్యమైన పోటీ ఈ సారి కూడా వైసీపీ, టీడీపీల మధ్యనే కేంద్రీకృతమవుతుందనేది పరిశీలకుల అంచనా. మూడో పార్టీగా రంగంలో ఉండే జనసేన ఎవరిని దెబ్బతీస్తుందనేదే ఇక్కడ ప్రధానం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని టీడీపీ అంచనా వేస్తోంది. కానీ వైసీపీ మరో కోణంలో లెక్కలు వేస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లోని 34 స్థానాల్లో పవన్ ప్రభావం పడితే టీడీపీకే నష్టం వాటిల్లుతుంది. అది వైసీపీకి లాభిస్తుంది. గడచిన ఎన్నికల్లో టీడీపీ, పవన్ ల ఓట్లన్నీ కలిస్తే మాత్రమే ఈ జిల్లాల్లో హవా సృష్టించగలిగాయి. ఇప్పుడు పవన్ దెబ్బకు టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందని వైసీపీ నాయకత్వం లెక్కలు తీస్తోంది.

కాంగ్రెసు కూడా కథలోకి...

ఈసారి కాంగ్రెసు పార్టీ కూడా ప్రత్యేక హోదా హామీతో బరిలోకి దిగబోతోంది. జాతీయ పార్టీగా ఆ అవకాశం బరిలో నిలిచే ఒక్క కాంగ్రెసుకు మాత్రమే ఉంటుంది. ఉనికే ప్రశ్నార్థకమైన స్థితిలో ఉన్న పార్టీకి ప్లీనరీలో చేసిన ప్రత్యేక హోదా తీర్మానం, ప్రభుత్వంపై లోక్ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానం నోటీసు కాంగ్రెసు కు అండగా నిలవనున్నాయి. దీంతో కొంత నిలదొక్కుకునే వీలు చిక్కుతుంది. కొంతమేరకు ఈ ప్రభావం ప్రజలపై పడవచ్చు. ప్రధానంగా కాంగ్రెసు ఓటు బ్యాంకు వైసీపీకి మళ్లింది. దీంట్లో కొంతభాగం రివర్స్ ట్రాక్ పడితే వైసీపీ ఓట్లకు గండి పడుతుందని టీడీపీ నాయకులు గణాంకాలు చూపుతున్నారు. జనసేనది మరో లెక్క. రాష్ట్రప్రభుత్వ వైఫల్యం, వైసీపీ అధినేతపై ఉన్న కేసుల కారణంగా ప్రత్యామ్నాయంగా తామే నిలుస్తామనేది ఆ పార్టీ లెక్క. బలమైన సామాజిక వర్గం అండ కూడా రాజకీయ పరిస్థితులను సానుకూలం చేస్తుందని ఆపార్టీ నాయకులు ధీమాగా చెబుతున్నారు. పైపెచ్చు అంకితభావంతో పనిచేసే వామపక్షాల అండ తీసుకోవాలని ఇప్పటికే పార్టీలో నిర్ణయం జరిగింది. వామపక్షాలు కూడితే జనసేన బలోపేతమవుతుందని ,పటిష్ఠమైన క్యాడర్, అభిమాన కెరటాల మధ్య ఎన్నికల నావ అధికార తీరం చేరుతుందని ఈక్వేషన్లు చూపుతోంది. బీజేపీ పార్టీ పైపైకి త్రిపుర తరహాలో ఏపీలో విజయాలు సాధిస్తామని చెబుతున్నప్పటికీ క్యాడర్ లో ఎక్కడా ఆ జోష్ లేదు. అపజయం తప్పకపోతే ఎలా సమర్థించుకోవాలనే అంశంపై సాకులు వెదుక్కునే పని మొదలుపెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ లో కంగాళీ రాజకీయమే నడుస్తున్నప్పటికీ 2019 తర్వాత మాత్రం పొలిటికల్ పిక్చర్ లో క్లారిటీ వస్తుందని ఒకటి రెండు పార్టీలు కనుమరుగు కాకతప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఎదురుచూపులే...

జాతీయనాయక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నకేసీఆర్ కు ఆ దిశలో పెద్దగా మద్దతు లభించడం లేదు. పెద్దపార్టీలు ఏవీ ఈ ఫ్రంట్ వైపు తొంగిచూస్తాయన్న నమ్మకం కరవైపోయింది. ఏపీలో తెలుగుదేశం కలిసి వస్తుందని తొలుత భావించారు. అయితే అవిశ్వాసతీర్మానం విషయంలో టీఆర్ఎస్ ఆటంకాలు కలిగించడంతో ఆ నమ్మకం పోయింది. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి తమిళపార్టీలు, జేడీఎస్ వంటి కన్నడ పార్టీ ఈ ప్రతిపాదనపై పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. దక్షిణాదిలోనే మద్దతు కూడగట్టలేకపోతే ఉత్తర, ఈశాన్య, మధ్య భారతాల్లోని పార్టీలను ఆకట్టుకోవడం అసాధ్యం. పశ్చిమబంగ ముఖ్యమంత్రిని కలిసినా పెద్దగా సానుకూలత, కదలిక కనిపించలేదు. తన పాత్రను తాను పెంచుకోవాలనుకున్న కేసీఆర్ ఆశలకు ఇది పెద్ద ఆటంకమే. టీఆర్ఎస్ జాతీయంగా పెద్ద పాత్రను పోషించబోతున్న భావనతో రాష్ట్రంలో ఎన్నికలను టీఆర్ఎస్ వైపు ఏకపక్షం చేయాలనుకున్న కేసీఆర్ యోచన ప్రతిఫలించే సూచనలు కనిపించడం లేదు. ఫెడరల్ ఫ్రంట్ కట్టడంలో వైఫల్యం చెందితే అది ప్రాంతీయంగా కూడా టీఆర్ఎస్ పై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కాంగ్రెసు చుట్టూ జట్టు కట్టిన పార్టీలు యూపీఏలోనే కొనసాగడానికి మొగ్గు చూపుతున్నాయి. వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెసు వంటి పార్టీల మద్దతు కూడా యూపీఏకే ఉండవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణ సీఎం కల ఫలించే అవకాశాలు అంతంతమాత్రమే. పైపైచ్చు ఆయన నిర్ణయంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చడానికే కాంగ్రెసు కు వ్యతిరేకంగా ఈ జట్టు కడుతున్నారని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇవన్నీ ప్రతికూల పరిస్థితులే. మొత్తమ్మీద మిత్రుల కోసం టీఆర్ఎస్ కు ఎదురుచూపులు తప్పడం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News